వారాల ఆనంద్ కవిత : దారి

By Arun Kumar P  |  First Published Feb 10, 2023, 1:36 PM IST

పూలనూ ముళ్ళనూ సమంగా ప్రేమించడం మొదలుపెట్టాను అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత   '  దారి ' ఇక్కడ చదవండి : 
 


అడుగులో అడుగేసుకుంటూ 
నా దారెమ్మట నేను నడుస్తూనే వున్నా 

ఒక చోట 
దారి రెండుగా చీలి పోయింది 
నేను రెండో దారిని ఎంచుకున్నాను 

Latest Videos

కాని 
దారి పొడుగునా పూలూ ముళ్ళూ 
పాదాలు రక్త మోడుతున్నాయి 
కన్నీరు ఒక్కో చుక్కా రాలుతున్నది 

ఎవరయినా 
పూలనూ ముళ్ళనూ 
ఎందుకని వేరుచేయరు 

చూద్దును కదా 
దూరంగా మిణుకు మిణుకు మంటూ 
ఓ వెలుగు చుక్క 
కానీ ఆ వెల్తురు నా దాకా రాదు 
నేనే వెళ్ళాలి 

పూలనూ ముళ్ళనూ
సమంగా ప్రేమించడం మొదలుపెట్టాను 
రక్తాన్నీ కన్నీళ్ళనూ దోసిట్లో కలిపేసి 
నవ్వును పొదువుకున్నాను 
నడకను నమ్ముకున్నాను 

ఇక 
తొవ్వ తూగుతున్నది 
దారి దంగుతున్నది

click me!