ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అష్టావధాని అష్టకాల నరసింహ రామశర్మ మృతిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆర్థిక మంత్రి హరీష్ రావు సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్ : ప్రముఖ సాహితీవేత్త, అవధాని అష్టకాల నరసింహ రామశర్మ(80) నిన్న(బుధవారం) మృతిచెందారు. రాత్రి 11గంటల సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నరసింహ రామశర్మ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
సిద్దిపేట ప్రాంతానికి ఎనలేని సేవచేసిన నరసింహ రామశర్మ ఆ ప్రాంత కీర్తిప్రతిష్టలు మరింత పెంచారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన మరణం ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు తీరని లోటని అన్నారు. నరసింహ రామశర్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా నరసింహ రామశర్మ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. సిద్దిపేట జిల్లాలో అనంతసాగర్ శ్రీ సరస్వతీ క్షేత్ర నిర్మించిన బ్రహ్మశ్రీ అష్టకాల ఆద్యాత్మిక సేవ చేసారన్నారు. భావి తరాలకు ఆయన జీవితం మార్గదర్శకం కావాలని హరీష్ అన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్, రచయిత నందిని సిధారెడ్డి కూడా నరసింహ రామశర్మ మృతిపై విచారం వ్యక్తం చేసారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ళ రామశాస్త్రి కూడా నరసింహ రామశర్మ మృతికి సంతాపం తెలిపి, కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
ఇక రేపు(శుక్రవారం) సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ లో అష్టకాల అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంభసభ్యులు ప్రకటించారు. ప్రజల సందర్శనార్థం పార్థీవదేహాన్ని అనంతసాగర్ లో వుంచనున్నట్లు తెలిపారు.