దుఃఖం రంగు తెలిసిన వాక్యాలు గాయం రుచిగన్న పదాలు కన్నీటి వాసన ఉన్న అక్షరాలు ఎక్కడైనా ఉంటే అది నేనే అంటూ నూజివీడు నుండి శిఖా - ఆకాష్ రాసిన కవిత " క్రితమే చనిపోయాను ! " ఇక్కడ చదవండి :
కలల శిలలకు కన్నీరూరదు
కాఠిన్యానికి ప్రేమ తెలియదు
మరణానికి కరుణ ఉండదు
ప్రేమలేని చోట నిత్యమూ..
మృత్యువే నిదుర లేస్తుంది
* * *
మనిషి మరణించడం మొదలయ్యాక
దేవుడు పుట్టాడు
కులమతాల రంగు
కన్ను విప్పింది
* * *
శిలువెక్కిన వాక్యాలకే
యుద్ధం చేసే అవసరత
కన్నీరంటిన పదాలకే
ప్రశ్నించే అర్హత
నేనొక నిత్యాగ్ని గాయాన్ని
నేనొక సత్యాగ్ని నగ్న గేయాన్ని
* * *
ప్రతివాడూ
కలగనీ కలగనీ...
ఒక కొయ్య దేశాన్ని నిర్మించేశాడు
చెద పట్టిన లోచనాలతో
దేశం డొల్లబారి ఆలోచిస్తోంది
* * *
శిథిలమవుతున్న దేశంలో
మనిషి లోలోపలికి
మరొక లోహ మృగమేదో
కరిగి ప్రవహించి
ఇక మరోసారి కరగడానికి వీల్లేని
విగ్రహంగా..
వింత గ్రహంగా....
* * *
రక్తం రంగొక్కటే
గ్రూపుల కథలే వేరు
ప్రేమ హృదయ మొక్కటే
కుల మతాల గోచీలే వేరు వేరు
* * *
ఇంకా.. ఈ నేలన
చూపులకు తేనె కత్తులు పూస్తాయి
ఇంకా.. ఈ గాలిలో
మాటలకు వెన్న తూటాలు పరిమళిస్తాయి
ఇంకా.. ఈ నీటి చేతులకు
వెన్నెల సంకెళ్లు మొలుస్తాయి
నవ్వుల కోరలు చాచిన మతాలు
చావుల తాడులు పేరిన కులాలు
నన్ను ఒక హత్యను చేస్తాయి
* * *
అలుపెరగని అలల పోరాటం నాది
సుఖమెరుగని కన్నీటి కలల ఆరాటం నాది
నేనొక గాయాన్ని
గాయపడందే..
నే నగ్నమవ్వందే...
ఏ అక్షరము నన్ను ముద్దాడలేదు
నేనొక తడి ఆరని గాయాన్ని
తడి తగలని ఎడారిని నేనే
నా గాయం పేరు ప్రాచీన భారతం
చెరచబడ్డ గీతాన్ని నేనే
నరకబడ్డ దేహాన్ని నేనే
మృత్యు దేశాన్నీ నేనే
నేనొక నో గ్రావిటీని
నా పుట్టుకే ఒక గాయం
ఉరితాటి గేయం
నా గాయం పేరు ఆధునిక భారతం
నా గేయం ఊరి పేరు అవమానభారతం
నా ఇంటి పేరు వెలివేతల భారతం
నేనొక నిషిద్ధ భారతం
నేనొక గాయాన్ని
నా గాయానికి ఆకాశాలు ఉండవు
నా కన్నీటికి ఆనకట్టలు ఉండవు
నా బాధకు కారణాలు ఉండవు
నా ప్రేమకు ఆనవాళ్లు ఉండవు
నేనొక అంటరాని చరిత్ర గతిని
నేనొక చెరచివేతల పవిత్ర శృతిని
* * *
నా బాధకు నోరు ఉండటం నేరం
నా ప్రేమకు కన్నుండటం శాపం
నా కన్నీటికి కాలం పెదవులు ఉండటం పాపం
నేనొక అసత్య దేశాన్ని
నేనొక దేశ ద్రోహ గీతాన్ని
నే పుట్టిన చోట
అమృతం విషమై ప్రవహిస్తుంది
వెలుగు చీకటై చిగురిస్తుంది
నేనొక దోష బీజాన్ని
* * *
నా బాధకు ఈ భాష చాలడం లేదు
అక్షరాలు శవాల బస్తాలై
రాలుతున్న దృశ్యాలు
నా కంటిని మింగేస్తున్నాయి
నా మాటను మూసేస్తున్నాయి
నా చెవుల్లో సీసం పోసేస్తున్నాయి
ఊడలమర్రి కాళ్ల భాషలు
నా చావు లోతును కొలిచేస్తున్నాయి
నా ప్రతి ఘటనా
ఓటమినే అంగీకరిస్తున్నది
నా ప్రతి కదలికలలో
ఇనుప పాదాల రాజ్యం,
దాని సకలాంగాల నిఘా
సంతకం చేస్తున్నది
* * *
చెల్లా చెదురైన వాక్యాల్ని
పోగేసుకోలేక పోతున్నాను
తెగిపడిన శవాల్ని
లెక్క కట్టలేక పోతున్నాను
జీవితం నిఘంటువులో లేని గాయాన్ని నేను
స్లండాగ్ మిలియనీర్ ని నేనే
బీచ్ బేబీ బీచ్ ని నేనే
కోటేసుని, మార్తమ్మని, ముత్తవ్వని,
అసిఫాని, షహీనాని,
హసీనాని, అమీనాని నేనే
ఆదివాసి హత్యాచారాన్ని నేనే
నెలలు నిండని పసిపాపల
అత్యాచారాన్ని నేనే
రోహిత్ ని నేనే
ప్రణయ్ నీ నేనే
సునీతను నేనే
సుజాతను నేనే
దేవుడి పెళ్ళాన్ని నేనే
దొరగాడి ఉంపుడుగత్తెను నేనే
మాతంగిని నేనే
దేవదాసినీ నేనే
నా ప్రశ్నొక హత్య
నా ప్రేమొక హత్య
నా పాటొక హత్య
నా నడకొక హత్య
నా చూపొక హత్య
నా బతుకొక ఆత్మహత్య
ఏ శాస్త్రానికి అందని
రాజు గారి భుజం మీద
వేలాడే శూన్యాన్ని నేనే
* * *
దుఃఖం రంగు తెలిసిన వాక్యాలు
గాయం రుచిగన్న పదాలు
కన్నీటి వాసన ఉన్న అక్షరాలు
ఎక్కడైనా ఉంటే అది నేనే
* * *
అద్ధం కూడా యుద్ధం చేసే
వాక్యమే రాస్తున్నా..
రాయి కూడా కన్నీరైపోయే
పదమొకటి మోస్తున్నా..
జంధ్యాలు కూడా తెగిపడే
కులమతాహంకార జెండాలు కూడా తలవంచే
అక్షరాల కోసమే వేచి చూస్తున్నా..
* * *
జీవితం ఆగిపోయిన చోట
క్రితమే చనిపోయాను
చానా చాన్నాళ్ల క్రితమే
మరణించి ఉన్నాను
ఈ భూమ్మీద నా అస్తిత్వం
ఒక చావులేని జ్ఞాపకం
నాదొక ఆగిపోయిన జీవితం
నే క్రితమే మరణించాను
* * *
ఈ చరిత్రను తిరగరాయడానికే
నే పునరుత్థానమవుతాను
జ్ఞానం నా ప్రేమ
వసుదైక సంగీతం నా ప్రేమ
నీ ద్వేషరాగానికి
గీతం పాడే
విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని నేను
యుద్ధభూమిలోంచి
మొలకెత్తిన శాంతి వృక్షాన్ని నేను
* * *
నేనే చరిత్ర అవుతాను
నేను మనిషిని చేసే
మానవత్వపు దినుసునవుతాను
చరిత్ర నాలోంచే జీవించటం నేర్చుకుంటుంది
నేనొక ప్రేమ బీజాన్ని
అంటరాని దేశానికి
పవిత్రతనొసగే నదీ గీతాన్ని
లోలోని ఆకాశాన్ని
నేను నడిపించే మట్టి మనిషిని
నేను సమస్త ప్రపంచాన్నీ
నిలబెట్టే మట్టిని
మట్టీ గాలీ నిప్పూ నీరు
ఆకాశాల అసలు వారసుడిని
నా చెమట నెత్తురులతో తడిసాకే
ఈ భూమి పరిమలభరిత వనమయ్యింది
మట్టి మొగ్గల
మనిషి పాటల పరిమళాన్ని నేను
నలుపెక్కిన
చెమట చెట్టును నేను
చెమట నదుల
పాదముద్రలు లేకుండా
నీకు చిరునామా ఎక్కడిది ?
త్రికాలాలకు
కూడలిలో
నిలువెత్తు జ్ఞాన దీపమై
పరివ్యాప్తమయ్యే
ప్రశ్న నూ, సమాధానాన్ని నేనే