ధిక్కార స్వరం ఎండ్లూరి సుధాకర్‌ - పుస్తక పరిచయ సభలో వక్తలు

By Siva Kodati  |  First Published Feb 5, 2023, 8:11 PM IST

కర్నూలు నగరంలోని టీజివి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం ప్రముఖ కవి, రచయిత డప్పోల్ల రమేష్‌ సంపాదకత్వంలో వెలువడిన 'ఎండ్లూరి కవనకళ - స్మారక స్వరం' అనే పుస్తకాన్ని భార్గవ ఆవిష్కరించారు


ఆధునిక కవిత్వం మల్లెమొగ్గల గొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించిన ధిక్కారకవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ అని ప్రముఖ విమర్శకులు  భార్గవ అన్నారు. కర్నూలు నగరంలోని టీజివి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం ప్రముఖ కవి, రచయిత డప్పోల్ల రమేష్‌ సంపాదకత్వంలో వెలువడిన 'ఎండ్లూరి కవనకళ - స్మారక స్వరం' అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

కర్నూలు కవులు నిర్వహించిన ఈ సభకు కథారచయిత మారుతీ పౌరోహితం అధ్యక్షత వహిస్తూ సాహితీ ప్రపంచంలో ఎండ్లూరి సుధాకర్‌ ధృవతార అన్నారు. ఆవిష్కర్త భార్గవ మాట్లాడుతూ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జీవితమంతా ఉద్యమంలా సాగిస్తూ కవిత్వాన్ని ఉద్యమానికి ఆయుధంగా వాడుకున్నాడు అని అన్నారు. బహుశా ఈకాలపు మహోజ్వలిత దళిత సాహిత్య ఉద్యమకారుడని కొనియాడారు. ప్రముఖకవి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎండ్లూరి కవిత్వం నిండా ఆర్తి, ఆర్ధ్రతలే ఉంటాయని  కవిత్వపు ఉద్యమాక్షరాలు విస్ఫోటనాలై తెలుగు దళిత కవిత్వానికి వెలుతురు దారులు పరిచాయన్నారు. అతడి కవిత్వాన్ని సృశించడమంటే, అతడి కవిత్వం గూర్చి మాట్లాడటమంటే దళితుల పక్షాన నిలబడి సమరం చేయడమే నన్నారు.

Latest Videos

రాయలసీమ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు డా.అరుణ మాట్లాడుతూ మానవ సమాజంలోని మూలాల్లో పునాదులై మనిషి జీవితాల్ని శాసిస్తున్న వర్ణవ్యవస్థపై ఎండ్లూరి సుధాకర్‌ కవిత్వం తిరగుబాటు జెండా ఎగరేసిందని, పచ్చటి పొలాల్లో మంటలై  విస్తరిస్తున్న మతోన్మాదం,  అణగారిన ప్రజల ఆర్తనాదాలు కవిత్వ వస్తువులయ్యాయన్నారు. నిత్యం తన జాతి ఎదుర్కొంటున్న సమస్యలొక్కటే కవిత్వమవ్వలేదని అతడి కవిత్వం సామాజిక అసమానతలపై ఎర్రని నిప్పుకణికలయ్యిందన్నారు. విరసం నాయకులు పాణి మాట్లాడుతూ ఎండ్లూరి సుధాకర్‌ దళిత తాత్విక చింతనాపరుడని ఆయన ఆలోచన కవిత్వపు అలజడి దళితదృక్కోణమేనన్నారు. కవిత్వం నా చర్మతత్వరహస్యమని చెప్పడంలోనే మూలల్లోకి వెళ్ళిపోయి తన జీవితమంతా కవిత్వమై బతికినవాడన్నారు. మనువు ఆడిన దొంగనాటకాన్ని మనుధర్మం చెప్పిన నీతిమాలిన సూత్రాల్ని తన కవిత్వపు మంటల్లో కాల్చేసిన వాడు ఎండ్లూరి సుధాకర్‌ అన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని,  రావాల్సిన న్యాయమైన వాటా కోసం భావావేశం కట్టలు తెంచుకున్న కవిత్వ ఉప్పెనకు తార్కాణం గోసంగి కావ్యం అని అన్నారు.

సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ ఎండ్లూరి సుధాకర్‌ బహుముఖీయ ప్రజ్ఞ కలిగినవాడని, బహుభాషల ద్వారా దళిత బతుకుల్ని తెలుగు సాహిత్యానికి అందించిన బాహుబాషావేత్త అని,  అనేక భాషలపై పట్టున్న లబ్ధప్రతిష్డుడని ఇప్పటికీ తాను అనువాదం చేసిన ఒక హిందీ గీతం చదివాక అతడెంత గొప్ప సాహిత్య సృజనాకారుడో అర్థమౌతుందన్నారు. ఆయన సాహిత్యాన్ని సమాజానికి మరింత చేరువ చేయడం మన బాధ్యతన్నారు. సభలో కవులు జంధ్యాల రఘుబాబు, అయ్యన్న, యస్డీవి అజీజ్‌, ఏవి రెడ్డి, సయ్యద్‌ జహీర్‌ అహ్మద్‌, పెరికల రంగస్వామి తదితరులు మాట్లాడారు.

click me!