అంతా సుఖం కూడా నరకం - అంతా దుఃఖం కూడా బాధకరం అంటూ హైదరాబాద్ పాతనగరం నుండి రేడియమ్ రాసిన కవిత ' జీవనచక్రం ' ఇక్కడ చదవండి.
వాడు చావాలను కుంటున్నాడు
ఆమె బతకాలను కుంటుంది
వాడు బతకాలను కుంటున్నాడు
ఆమె చావాలను కుంటుంది
ఆమె అతడు
అతడు ఆమె
సంసారంలో
సంఘంలో
బతికి సాధించాలనుకున్నారు...
చావు పుట్టుక సత్యం
మట్టి కూడా అంతే నిజం
సహజ మరణం
అసహజ మరణం
పిరికి వాళ్లది అసహజ మరణం
సమాజ పునాది జీవన చక్రం...
కర్త కర్మ క్రియలా
ఓ మంచి వాక్యంలా
జీవనం ఉండాలి
మంచు కొండలు కరుగుతాయి
కొండలు పగిలి నేలకు జారుతాయి
ప్రకృతికి తలవంచి
సమస్తం నడుస్తుంది
అన్వేషణ మనిషి పని
ఆచరణ అందరి విధి
చావు పుట్టుక మధ్యనే జీవితం
కష్ట సుఖాలలోనే
ఆనంద జీవనం
అంతా సుఖం కూడా నరకం
అంతా దుఃఖం కూడా బాధకరం
తీపి చేదులా రెండూ సమతుల్యం
అదే జీవన చక్రం