తొడకొట్టి పుట్టమన్ను గద్దె మీద మీసం మెలేసిన మహా దిగంతాల ఆదిజాంబవ నిలయం నా ఇల్లు అంటూ డా.పొన్నాల బాలయ్య రాసిన కవిత " తరతరాల తవుసు ఇల్లు " ఇక్కడ చదవండి :
చెట్టుకు చెట్టుదీము !పిట్టకు పిట్టదీము !!
వొడ్డు మీద నిలబడి చూసే గుడ్డి లోకమా !
ఇల్లు లేని బతుకు చెల్లనేరది ఏడా!!
అన్నీ వున్నోనికి ఆనందాల లోగిలి
ఏమీ లేనోనికి ఎండమావుల తొవ్వ ఇల్లు
కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి
అవ్వయ్యనో ! అత్తమామనో !!
అప్పనంగా యిస్తే ఏం తెలుస్తది !!
కష్టాలు కన్నీళ్లు అవమానాలు అన్నీ తానై
మోసేటోనికి దుక్కపు వొర్రెలు ఎదను కోసె అంతు దొరకని అప్పుల లోతులు..
ఇంపైన జీవితాలకు ఇంద్రభవనాలెన్నో
పరాన్నబుక్కులకు అసంపాదిత ఆస్తులెన్నో
కానీ
గుంటెడు భూమికి బుక్కెడు బువ్వకు వంచితులై
వూరికి దూరంగా నెట్టబడ్డ తాత ముత్తాతలకు
ఇల్లంటే ఇజ్జత్ కా సవాల్
తరతరాల తవుసు ఇల్లు
ఇల్లంటే మనిషికి పునర్జన్మ
ఆత్మీయతానురాగాల కూడలి
అస్తిత్వాలు ఆసుపోసుకున్న జిందగీల సాందిరి
...............(2).................
మట్టి పొయ్యి మంగులం పెంక
సారెడు గంజిగడ్క కోసం గాజ బొత్తంతా దూప
రెండు కండ్లు అంచెతట్ట జంబుగంప
ఉట్టిమీద వుత్తగా వూగులాడే మొర్రెసుల కవిసిన శోకం
బేట్లు బేట్లు లేసిన పొక్కిలి వాకిట్లో గుడిసె ముంగట దిగులుతో కూసున్న
మా తాత మనసు నెర్రెల్లో గాయపడ్డ ఎనకటిజాడలెన్నో
జోరు వానలకు సూర్లపొంటి ఉర్శి
ఈత దడులల్లకేలి దంచి సంపే సల్లు
పనగడి తలుపు నుల్క పుర్రులు తెగి
గుడిసె నిండా తెంపులేని వరద నీళ్లల్ల
పాత సాపసింపుల మీద తడిసి ఏడ్చిన బాలక్యాలి
కుక్కి మంచం కూడా దిక్కులేని
గత మొక్క రడామండల రవుతం అవిసే పుండు
పిడికెడు కూడు కోసం సెంచరిల్లి సెంచాల్లమై
బతకబోయిన బాధల నెగడు దగడు దిగమింగి
దిమ్మేస గుద్దిన కంకర రాళ్ల పునాదుల్ల సపోర్టు లేని
మా అయ్య వెధలెన్నో సాలీసాలని మెతుకు బాధలెన్నో
నిట్టాడు గుంజ పంగకు వేలాడుతున్న
ఏండ్ల ఎతల పాత డప్పు ఏడికాడికి పట్టన పలిగి
తూటుపోయిన కౌవుసు బతుక్కు అక్షరాలద్దిన నా తల్లి
లందగోలెంకు చందన పరిమళాలు నింపి
పొతమైన తోలు శెల్ల నా ఇల్లు
దీపం దిక్కు లేని కాడ చెప్పేస్తే కుండకు తాకని కాడ
ఏరుగ పోయి ముడ్డి కడగా జాలారి లేని జాగల
సిరిపంచరం చెట్టు పొంటి పారు గుంజలు పాతి
వాయిలి పొర్క వాసాలకు పెండె కట్టిన సొప్ప కట్టల మీద సిగురంత గడ్డి కప్పిన పందిరి
తాటాకుల తడ్కల గూట్లే తవ్వేడు గింజలు లేని యాది
కనకుదురులల్ల కాలిగున్న కుండ దొంతులు
కూరాడు కుండా ఐరేని పట్వా కలి కాగు పేగులు
అల్లల్లాడి అలమటించిన ఆకలికేకల ఆర్తనాదం నా ఇల్లు
నా ఇల్లు ఎన్ని కాటగలిసిన అనుబంధాలను
మమకారాలను మతిలనింపుకొని నిలబడ్డదో చూడు
కన్న తల్లి లాగా రెండు చేతులు సాపి
నా ఇల్లు చిన్నదే! గిజిగాడు అల్లుకున్న చిన్న పిట్టగూడే!!
కానీ దాని ఇమరసే పెద్దది !!!
పెయ్యిల పెళపెళ విరిగిన బండెడు బొక్కల ముల్లె మీద
ఎలిగే ఎన్నిల కాంతి నా ఇల్లు
కుసిగుంపెనల అణిచివేతల ఈసడింపులల్ల
ఇలవరుస గజ్జెల మోతే నా ఇల్లు
. .......... (3 )............
అవును !మరి !
ఆ వూరు! ఈ వూరు తిరిగినోనికి! ఏ వూరు? గతి! మాయిముంతను కొల్లుగుంటల దాసుకున్న సొంతవూరు మీదికే కుతి
ఢిల్లీకి రాజైన పల్లెల ఇల్లు వుండాలే
సచ్చినా బతికినా సొంత వూర్లో యింత గూడుండాలే
పథకం ప్రణాళిక పైస కాపాయము లేకున్న
ధ్వంసమవుతున్న జీవితాలకు దగదగా మెరిసే
చిన్నదో! పెద్దదో !!
బంగారు పురుగు అసొంటి ఇల్లు వుండాలే!
ఎవ్వడెన్ని కూతలు కూసిన ఎక్కిరిచ్చి ఎగతాళి చేసిన
ఈర్ష ద్వేషాలతో ఈసడించిన
నీకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలే
తన అజం కంటే వజనెక్కువ మోసి పుట్టలు కట్టే
చిన్న చిన్న చీమలలెక్క గట్టిధైర్యం వుండాలే!
పచ్చని చెట్టు భూమ్మీద నిటారుగా నిలబడ్డట్టు
మట్టిని గుండెల నిండా ప్రేమించే గుణముండాలే
ఇల్లంటే వుట్టి కిటికీలు తలుపులే కాదు
కరిగిన నా మాంసపు ముద్దలు
కారిన నా సెమటబొట్టులు
గోడలకు రంగురంగుల తీనెలు దిద్దిన నగాషిచిత్రాలు
తొడకొట్టి పుట్టమన్ను గద్దె మీద మీసం మెలేసిన
మహా దిగంతాల ఆదిజాంబవ నిలయం
పూర్వికుల ఆశయాలు పునర్ ప్రతిష్ట చేసుకున్న
సజీవ దృశ్య కావ్యం నా ఇల్లు...