వెన్నెల పూత రేకు కొబ్బరి నీళ్ళ నదీ కెరటాలై దోసిళ్లలో దోబూచులాడుతూ ఉంటుంది అంటూ ఒబ్బిని రాసిన కవిత ' వెన్నెల పూతరేకు ' ఇక్కడ చదవండి :
నేల నేలంతా
చాపగా పరుచుకుంటుంది
వెన్నెల పూతరేకుల కోసం !
నేల మీది సమస్త వృక్ష జాలమూ ,
నేల మీది సర్వ సౌధాలూ
వెన్నెల పూత రేకుల కోసం
కుండల వీపులై సిద్ధమవుతాయి !
ఈ వెన్నెల పూత రేకు
కళ్ళకి రుచులు చూపిస్తుంది !
ఒంటికి మఖమల్ వస్త్రపు
హాయిని కలిగిస్తుంది !
కొబ్బరి నీళ్ళ నదీ కెరటాలై
దోసిళ్లలో దోబూచులాడుతూ ఉంటుంది !
శాంతికీ , స్వస్థతకీ
పరమౌషదం ఈ వెన్నెల పూత రేకు !
రాత్రుళ్లు ఆరుబయట ఆరగిస్తే
ఈ వెన్నెల పూతరేకు వన్నెల రాణి అవుతుంది !
విద్యుత్ తీగెలని కాకుండా
వెన్నెల కిరణాలని
వొళ్ళంతా చుట్టుకోవాలి !