సమున్నతంగా జాతి జనులు పులకరించిపోయె మహొత్తుంగ జలపాతం !!!!! అంటూ కందుకూరి శ్రీరాములు రాసిన కవిత ' జెండా సూర్యుడు ' ఇక్కడ చదవండి :
జెండా సూర్యుడు
రెపరెపలాడుతున్నాడు !
ఎన్ని మేఘాలు
ఎన్నెన్ని గ్రహణాలు
కమ్ముకున్నాయి
ఎన్ని తాపాలు
ఎన్నెన్ని కోపాలు
విరజిమ్ముకున్నాయి
ఎన్ని వాదాలు
ఎన్నెన్ని రణన్నినాదాలు
కవోష్ణ రక్తసిక్తమయ్యాయి
గత చరిత్ర
వర్తమానానికి పూలబాట కావాలి !
వర్తమానం భవిష్యత్తరానికి
కొత్తలోకం రావాలి !
ఎగురుతున్న మువ్వన్నెల జెండాలో
కుట్రలూ కూహకాలూ కనపడొద్దు
నవ్వెన్నల మువ్వలగువ్వలు కువకువమనాలి !
జెండా బానిస కాదు !
కారాదు !!
జూలుదులిపి గర్జిస్తున్న
సింహం!!!
స్వాతంత్ర్య సమరయోధుల
త్యాగాల చిహ్నం !!!!
సమున్నతంగా జాతి జనులు
పులకరించిపోయె మహొత్తుంగ
జలపాతం !!!!!
ఇవ్వాళ్ళ ఈనాడు
ఎర్ర కోటమీదనే కాదు
ప్రతి ఇంటిమీదనే కాదు
జాతిజనుల గుండెల్లో
ధీరోదాత్తమైన
నిరంతరంగా
నిరభ్యంతరంగా
ఎగురుతున్న మువ్వన్నెల జెండా !
యావత్ జాతికి
పెద్దదిక్కు !
శాసిస్తున్న సామ్రాజ్య
వాదుల్నెదురుకొనే
ధైర్యంకవచపు ఉక్కు !
వజ్రోత్సవ స్వాతంత్ర్య
దినోత్సవానికి నమస్కారం !
మువ్వన్నెల ప్రజాస్వామ్య
జెండాకు వందనం !
భరత వీరుడు
తలవంచడు !
జెండా శౌర్యం
తలదించదు !
ఎర్రకోటమీద రెపరెపమంటాయి !!