గద్వాల కిరణ్ కుమారి రాసిన ‘చంద్రకిరణాలు’ బాలల గేయ సంపుటిపై గోపగాని రవీందర్ చేసిన సమీక్ష ఇక్కడ చదవండి :
బాలల కోసం ‘చంద్ర కిరణాలు
బాలలకోసం రాస్తున్న సాహిత్యం ఇటీవలి కాలంలో తెలుగులో విరివిరిగా వస్తున్నది. కొంత మంది కవులు, రచయితలు కేవలం బాలల కోసమే రచనలు చేయడం ఆహ్వానించదగిన పరిణామం. కథలు, కవితలు, గేయాలు సరళమైన శైలిలో రాయడం వలన పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పాఠశాల స్థాయి పిల్లలకు సాహిత్యం పట్ల అభిరుచిని కల్గించడానికి అనేక సాహితీ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. పిల్లల రచనలతో పుస్తకాలను కూడా ముద్రిస్తున్నారు. బాలసాహిత్యం వికాసం కోసం కృషి చేస్తున్న రచయితలను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ యజ్ఞంలో భాగస్వాములైన వాళ్ళను మనమంతా బాధ్యతగా ప్రశంసించాలి. అందులో భాగంగానే రచయిత్రి గద్వాల కిరణ్ కుమారి రాసిన ‘చంద్రకిరణాలు’ బాలల గేయ సంపుటిని వెలువరించడం అభినందనీయమైనది.
బాల్యం నిలువెత్తు జీవితానికి పునాది. బాల్యంలోని ఆలోచనల బీజాలకు ఆశయాలను కల్పించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, రచయితలు ప్రధాన భూమికను పోషిస్తున్నారు. పిల్లలు ఆటపాటలతో ఏది చెప్పిన ఆసక్తిగా వింటారు. ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. వాటి మీద అభిమానాన్ని కూడా పెంచుకుంటారు. 40 బాల గేయాలను ఒక సంపుటిగా తీసుకరావడం మంచి ప్రయత్నం. పిల్లలకు రోజువారి జీవితంలో కనిపించే వస్తువులను ఎంపిక చేసుకొని గేయాల్లో వాటిని అందంగా విడమరిచి చెప్పడం బాగున్నాయి. ‘బాల్యం, వారములు, వాన, బడిగంట, చందమామ, నేస్తాలు, సెలవులు, గడియారం, పండుగ, చీమలు, జాతర, సూర్యుడు, మంచం, పుస్తకం, చెట్టు, బహుమతి, అడవి, మా ఊరు, ఆకాశం, గురువు, నీడ’ వంటి గేయాల్లోని చరణాలు పొందికగా ఉన్నాయి.
ఒగరైన పండు/రేగి పండు
తింటే మాత్రం/భలేగా వుండు
గింజల దండు/ జామ పండు
తింటే మాత్రం/ రుచిగా వుండు’ (పండు)
‘అమ్మా నేను బడికి పోతా
అక్షరాలే నేర్చుకుంటా
పాఠాలు చదువుకుంటూ
మంచి మాటలు తెలుసుకుంటా (బడికి పోతా)
ఇట్లాంటి గేయాలతో ఈ సంపుటి సుసంపన్నంగా ఉన్నది. ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో, ప్రతి ఉపాధ్యాయుడి దగ్గర ఉండాల్సిన పుస్తకమిది. కఠిన పదాలతో కాకుండా అతి సులువైన పదాలతో మంచి వర్ణనలతో నిండుగా ఉన్నది. బాలసాహితీ పురస్కార గ్రహీత, కవి పత్తిపాక మోహన్ గారు ఈ పుస్తకానికి అర్థవంతమైన ముందుమాటను రాసి మరింత వన్నెను తెచ్చారు. ఈ పుస్తకం కోసం గద్వాల కిరణ్ కుమారి గారిని ఈ (9642401878)నంబరుతో సంప్రదించగలరు.