చేతులు నరికే మనిషి చేతలు తరతరాల అంతరాల పతనానికి ప్రతీకలు అంటూ జల్లిపల్లి బ్రహ్మం రాసిన కవిత ' మనిషికి అర్థం కావాలి ' ఇక్కడ చదవండి :
దోసెడు వాన చినుకులు చిలకరిస్తే
పుడమి తల్లి మొలకలై పులకరిస్తుంది
చెట్లు కొమ్మల చేతులతో
విసన కర్రలై గాలులు విసురుతుంది
చేతులు నరికే మనిషి చేతలు
తరతరాల అంతరాల
పతనానికి ప్రతీకలు
పువ్వుకు ఆకుకు
మధ్య జరిగే
సౌందర్య సంభాషణ
నేలకు చెట్టుకు
మధ్య పెనవేసుకున్న
అనుబంధాల అల్లిక
మనిషికి
అర్థం కావాలి
ఆగ్నిగోళానికి
జలకుంభానికి మధ్య
పచ్చని సంబంధం
పవిత్రంగా ఉండనివ్వాలి
ఆహారమై ప్రాణం పోయాలి
హారమై శోభను
అందివ్వాలి