అతిథిలా వచ్చిన సౌందర్యరాశి ప్రేమతో ఇక్కడే వాలిపోతుంది అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత ' వసంతగానంలా...! ' ఇక్కడ చదవండి :
ఒక ఉత్సాహపు వర్షపు జల్లు
మెల్ల మెల్లగా కురుస్తుంది
ఉషోదయపు లేత కిరణాల వెలుగు
నిమ్మలంగానే నేలపైన వాలుతుంది
మూసిన షాపుల రెక్కలన్ని
వడివడిగా తెరుచుకుంటాయి
ఏ వైపుకు చూసినా
సందడి సందడి జన సందోహం
అచంచలమైన ఆత్మ విశ్వాసంతో
దినచర్యను ప్రారంభిస్తారు వాళ్ళు
నిన్నటిని పోల్చుకుంటూ
రేపటి భవిష్యత్తును తలచుకుంటూ
వర్తమానాన్ని ఆస్వాదించుకుంటూ..!
చెట్ల మీది పిట్టలు
సత్తువనంతా కూడగట్టుకొని
ఆహారాన్ని అన్వేషిస్తూనే
ఆకాశంలో విహరిస్తుంటాయి
వీధుల్లోని పిల్లలంతా
చదువుల సారాన్ని గ్రహించడానికి
గల గల పారుతున్న నదుల్లా
పాఠశాలలకు వెళ్ళుతుంటారు..!
ప్రకృతిలోని రమణీయమైన
కమనీయమైన దృశ్యాలివి
మదిని పులకరింపజేసే
అద్భుతమైన సౌందర్యమిది
ఉదయపు శీతల సమీరాలు
హత్తుకుంటాయి వెచ్చగానే
అతిథిలా వచ్చిన సౌందర్యరాశి
ప్రేమతో ఇక్కడే వాలిపోతుంది
విప్పారినపూరెమ్మల వంటి కన్నులతో
తనివితీరా ఆస్వాదించాల్సిందే..!
విచ్చుకున్న సుమాల సుగంధాలతో
అందరికీ అభివాదాలు తెలుపుతూ
రోజువారి పనుల్లో నిమగ్నమౌతాము
తేజోమయమైన అనుభూతి అపూర్వం
పంట పొలాల పలకరింపులతో
పచ్చదనాల గుభాలింపులతో
రహదారిపై జీవన సమరమొక
వసంతగానంలా శోభిల్లుతున్నది..!