మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం 2022 కు ఎగుమామిడి అయోధ్య రెడ్డి కథా సంపుటి ' అక్కన్నపల్లి రైల్వే స్టేషన్ ' ఎంపికయింది. ఈ సందర్భంగా అయోధ్య రెడ్డి కథలపై డా. సిద్దెంకి యాదగిరి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి:
-డా. సిద్దెంకి యాదగిరి
(నిన్నటి తరువాయి భాగం )
" మనసు విరిగెనేని మరియంటు నేర్చునా ?’’అని వేమన ప్రశ్నించినట్లు - అహానికి పోయిన అభిరాంకు సరిదిద్దుకోలేని తప్పు జరిగింది. ఒకప్పుడు ఇద్దరు ఒకటిగా బతికారు. కష్టాలు... సుఖాలు, సంతోషం... దు:ఖం, ఆలోచనలూ... నమ్మకాలు, స్వప్నాలూ.. వాస్తవాలు, అన్నీ జీవితంలో తారసపడినవన్నీ కానీ అప్పుడు ఎందుకలా జరిగింది? ప్రాణంగా ప్రేమించే ప్రియాంకను ఎందుకు కాదనుకున్నాడు? దానికి బలమైన కారణమే ఉంది.
ఒకనాడు పొత్తికడుపులో కత్తులతో కోస్తున్న నొప్పితో బాధపడుతుంది. మిస్ క్యారింగా?? కావచ్చునేమోనని ప్రియాంకకు భయమేస్తుంది. ‘‘ప్లీజ్ నా దగ్గరుండు’’ అని అభిరాంని బతిమాలితే ‘‘ఉండి ఏం చేయాలి. ఇంకేం మిగిలిందనీ ఉండాలి’’ అంటూ వెళ్లిపోతాడు. పొత్తి కడుపులోని బాధకన్నా మనసుకైనా గాయం నొప్పి తీవ్రమై ప్రియాంక విలవిల్లాడిరది. తోడుండాల్సిన సమయంలో బతిమాలుతున్నా వెళ్లిపోయాడు. ఆమె వారించినా పిల్లలుకారని తెలిసి డైవర్సిచ్చి వెళ్లిపోయాడు. ఇప్పుడు అతికష్టమ్మీద ప్రియాంకను కలిసాడు. నా అవివేకాన్ని, నా దుర్మార్గాన్ని మన్నించు. నీ మంచితనంతో కడిగెయ్యి. ఫర్‌గివ్‌మీ ప్రియా అని బతిమాలుతాడు. పశ్చాత్తాపం... ప్రక్షాళనం అతనిలో.. నీళ్లు నిండిన కళ్లతో అతని వంక చూసి నవ్వింది. అతనిలో చైతన్యం. ఉద్వేగం. ఊరట. ఇద్దరి మధ్య మౌనం గోడలు కూలి రహదారి అయింది. నన్ను మన్నించు ప్రియా ప్లీజ్ మనం మళ్లా కలసి ఉందాం. పెళ్లి చేసుకుందాం అన్నాడు చిన్నగా. ప్రియాంక దీర్ఘంగా నిట్టూర్చింది. అతని చేతిలోంచి తనచెయ్యి సున్నితంగా విడిపించుకుంటూ ‘‘సారీ అభి’’ అంటూ ముందకువెళ్లింది.
రెండవసారి తన జీవితంలోకి అభిరాంని ఆహ్వానించి తప్పుచేయదలుచుకోలేదు. స్వతంత్రంగా ఆలోచించింది. ప్రియాంక తన ఆత్మగౌరవాన్ని ప్రకటించింది. ఒంటరిగా జీవించాలని నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం వెనుక ఉన్నది ఒక్క అభిరాం కాదు. పిల్లలు పుట్టకపోవడానికి, దక్కకపోవడానికి కారణం స్త్రీలే కారణమనీ, నిందించడం పరిపాటిగా ఉండేది. ప్రతి చెడును స్త్రీలపైకి నెట్టేయాలనుకునే అభిరాంలని తయారుచేసే పితృస్వామ్య వ్యవస్థ ప్రభావం ఉందనీ వెల్లడిజేస్తుందీకథ.
వేశ్యా వృత్తి మీద సంస్కర్తలు చాలా రచనలు చేశారు. కన్యాశుల్కం నాటకంలో ‘మధురవాణి’ పాత్ర. కొ.కు కథ ‘ముడిసరుకు’. ‘నన్ను గురించి నేను చెప్పుకోగలిగితే నువ్వుదేనికి?’ అని కథానాయిక రచయితను ప్రశ్నిస్తుంది. కారా మాస్టారు గారి ‘హింస’ కథలో పదేళ్లు నిండని వ్యధను వ్యక్తీకరిస్తుంది. రంగనాయకమ్మ ‘అంధకారంలో ’ అనే నవల దుర్భర జీవితాలను వివరించాయి. ‘ తను శవమై ఒకరికి వశమై /తను పుండై ఒకడికి పండై /ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై’ అనే పంక్తులు విన్న, చదివిన తరువాత వేశ్యలమీద ఇంకేం రాయగలమనిపిస్తుంది. నళినీ జమీలా అనే సెక్స్ వర్కర్ తన ఆత్మకథను ప్రకటించింది. అయోధ్యరెడ్డి వేశ్యకు మనస్సును, ప్రేమను ఆప్యాయతలను ఆవిష్కరిస్తాడు...
సమాజం దృష్టిలో నీచమైన పనిచేస్తున్నారని చిన్నచూపున్నా ఆత్మీయతలకు ఎవరూ అతీతులు కారనీ వివరించే కథ ‘ఆమెలోని నది’. కథ ప్రారంభవాక్యం ‘‘జీవితంలో ఆమెను చూస్తాననుకోలేదు’’ అనే వాక్యం పాఠకుడిని పట్టుకుంటుంది. చివరిదాక చదివిస్తుంది. కొన్ని అనివార్య కారణాలవల్ల నిరాశా పూరితంగా మారిన ఎడారి జీవితాల్లో ఆప్యాయతలు, ఆత్మీయతలుంటాయని వాటి ఆత్మీయతలతో వసంతం చిగురింపజేయడం ఈ కథ ప్రత్యేకత.
ఆదర్శంగా జీవించే వాళ్లు బయటికి కనపడే అందమైన సమాధులు. లోపలంతా దుర్గంధమనీ, పైకి కనిపించేదంతా నిజం కాదనీ తెలిపే కథ ‘రెప్పచాటు కన్నీరు’. ఈ గల్లీవాళ్లం అందరం కలసి భార్యల్ని గౌరవించటం అనే కొలమానం ప్రకారం మేం భర్తల్ని రెండు రకాలుగా విభజించినం. భార్య కోరికల్ని కాదనకుండా తీర్చేవాళ్లు ఒకటో రకమనీ, వీళ్లు మంచి భర్తలనొచ్చు. పిల్లల్ని కనిపెట్టి ఇంట్లో పనులు చేసిపెట్టే యంత్రంలా భావించేవాళ్లు రెండోరకం. వీళ్లని చెడు భర్తలుగా నిర్ధారించినం. యాదగిరి రావు, ఆంజనేయులు మంచి భర్తలనీ తీర్మానించిండ్రు. కొన్నాళ్లకు యాదగిరిరావు తన భార్యను కొట్టిన విషయం తెలుపుతున్నపుడు మంచి భర్తలకుండే ప్రధాన లక్షణమా అని రచయిత వేళాకోలమాడుతాడు. మరుసటిరోజున అతని ఆస్తిని ఏసీబి జప్తుచేసారనీ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆంజనేయులు భార్య సరస్వతి ఉన్నట్టుండి కిరోసిన్ పోసుకొని చనిపోయింది. సరస్వతి రాసిన బేరింగ్ లేటర్ (స్టాంపులు పెట్టక పోవడం వలన డబ్బులు చెల్లించి తీసుకునే ఉత్తరం) వారం రోజుల తర్వాత అందింది కథకుడి ఆఫీసుకి. చనిపోయే ఒకరోజుముందు కిరాతుకుడైన ఆంజనేయులు నన్ను చంపేస్తాడని రాసింది. రెండు ఉదాహరణల నుంచి కథకుడి భార్యకు వాస్తవం తెలుస్తుంది. భర్తమీద అభిమానం పెరుగుతుంది.
ఎవరు తోడుకున్న గోతిలో వారు పడుతారన్నది ఎంత నిజమో అంతే వాస్తవముగా చిత్రించబడిన కథ ‘వెంటాడిన రాత్రి’. ఎండ వానలకు రంగులు వెలసి అలుక్కపోయినట్లున్న నేమ్‌ప్లేట్ సిపాయిల తిరుగుబాటుకు ముందా వెనకా అన్నట్లున్నది. భయం పుట్టించే నిశ్శబ్దంతో శ్మశానంలో సమాధిని తలపిస్తుందా లాడ్జీ. అక్కడి లైటు దీర్గరోగి ఉనికిలా డిమ్ముగా వెలుగుతోంది. దడదడమని మోత పెట్టుకుంటూ వొచ్చి ఆ మనోహర లాడ్జి ముందాగింది ఆటో. ఇద్దరూ లేచిపోయి ఫ్యాన్ కూడాలేని గొప్ప లాడ్జీలో దిగారు.
తాగినమత్తులో గోపాల్ బలాత్కరిస్తుంటే పెళ్లి తర్వాతనే అని ఆమె వారిస్తుంటది. కాని అతడు వినడు. అస్తమా రోగిలా ఆమె ఆయాసపడసాగింది. గొంతుకు ఉరితాడు బిగుసుకున్నట్లు కళ్లు వెలుపలికొచ్చాయి. నోరు తెరుచుకొని నాలుక బయటికి వచ్చింది.
‘‘భానూ... ఏమైంది భానూ...! మాట్లాడు’’ - కామదాహానికి భానుమతి బలి అయిపోయింది. ఎవరికీ దొరుకకుండా, ఏ శిక్ష పడకుండా పారిపోయి నిశ్చింతగా బతుకుదామనుకున్న గోపాల్ రైల్ టిక్కెట్ కొందామని పరుసు కోసం వెతికేటప్పుడు లాడ్జీలో వదిలొచ్చిన విషయం గురుతుకొచ్చింది.
కులం, మతంపేర ఎవరు మోసం చేసినా చివరకు బలయ్యేది ఆడపిల్లలే అని తెలిపే కథ ‘అన్ అనాధరైజ్డ్ లవ్ స్టోరీ’. జరగరానిది జరిగాక ఇలాంటిదేదో జరుగుతుందని రవి మీద తనకెందుకు అనుమానం రాలేదు అనే మాటలతో కథ ప్రారంభమవుతుంది. అరవింద అందమైన మాదిగ బాలిక. రవీందర్ అగ్రవర్ణపు బాలుడు. మాజీ ఎమ్మెల్యే బిడ్డకొడుకు. తెలివిపరుడు. ఇద్దరిమధ్య చిన్నప్పటి నుంచే ప్రేమ చిగురించింది. ఆమె చదువుకు పదితోనే ఫుల్‌స్టాప్ పడ్డది. సినిమా చూస్తున్నపుడు హీరో స్థానంలో రవిని ఊహించుకునేది. రవి ఐఐటి చదువుతున్నాడు. లక్ష్మణరేఖలాంటి హద్దులు దాటారు. అరవింద నెలతప్పింది. పెళ్లి చేసుకుందామని, ఇరు కుటుంబాలను ఒప్పించాలనీ ఇద్దరూ తీర్మానించుకున్నారు. కుల పట్టింపులవల్ల రవీందర్ తప్పుకుంటాడు. అరవిందకు ఇక నన్ను మరిచిపో అని మెసేజ్ పెడుతాడు . ఇది జరిగిన వారం రోజులకు ఓ వార్త బయటకొచ్చింది. ఎంత వెతికినా రవీందర్ జాడలేదు. కాలేజీకని వెళ్లి అదృశ్యమయ్యాడు. ఇందులో నిజమెంతో తెలియదు. ఆ రాత్రి ఆమె దారుణంగా రోదించింది. అరవింద జీవితం ఎడారిగా మారింది.
కథకుడు వివిధ రీతులలో కల్పనలతో అద్భుతమైన కథలు రాస్తాడు. ఇందులో ప్రధానంగా ఊహతో పాఠకులను భయపెట్టించే విధంగా ఉంటాయి. దయ్యాల, భూతాల స్మశాన సినిమాలను మనం చూసే ఉంటాం. ఆ సౌండ్ సిస్టానికి దృశ్య వాతావరణానికి జడుసుకుంటాం. కానీ చదువుతుంటే కూడా అలాంటి భయాన్ని కలిగించి మనసులోనే భయోత్పాతం కలిగించే కథా రచయిత అయోధ్యరెడ్డి. బయోత్పాతం కలిగించిన కథ ‘నీడను పట్టుకున్నవాడు’ ఇందులో కొంత వాస్తవం, కొంత కల్పితం కలిపి ఈ కథ అత్యంత సహజంగా చిత్రీకరించాడు. ఈ కథలో కొత్త పెళ్లికొడుకు దినకర్ శోభనం కోసం వెళ్తాడు. బస్సు దిగి చుట్టూ చూస్తే చిమ్మ చీకటి. ప్రకృతి నిండా నిశ్శబ్దం. ఆకాశంలో దట్టంగా మబ్బులు. ఉన్నట్టుండి ఈదురుగాలి మొదలైంది. చింత చెట్టు మీద పెద్ద పిట్ట కావచ్చు. జబ్బు పడిన ముసలోడు మూలిగినట్లు వెక్కిపడుతూ అరుస్తుంది. ఊరు శివారులో కుక్కలు ఏదో ప్రపంచం అంతం కాబోతున్నట్లు అదేపనిగా ఏడుస్తున్నాయి. ఈ వాతావరణం చూసిన దినకర్ కి భయం భయం. గతంలో చదివిన డిటెక్టివ్ నవలలు, చూసిన ఇంగ్లీష్ హారర్ సినిమాలు. టీవీలో చూసిన దయ్యాల సీరియల్స్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలయ్యాయి.
ఉన్నట్టుండి స్మశానంలో అడుగుపెట్టాడు. దూరంగా ఒక చితిమండుతోంది. నల్ల చీకటి. అర్ధరాత్రి కొత్త ఊరు మధ్యలో స్మశానం. అయితే ఏమైంది? ఊరన్నాక వల్లకాడు ఉండదా? పాట పాడుతూ వెళ్తున్నడు దినకర్.
‘‘అన్న బాగున్నావే’’ హఠాత్తుగా పలకరింపు. మర్రిచెట్టు నుంచి దినకర్ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ఏందన్నా బాగున్నవా? నన్ను గుర్తు పట్టలే. ‘‘నేను రాఘవ’’ అన్నాడు. ‘‘ఇంత రాత్రి స్మశానంలో ఉన్నావెందుకు?’’ అని అడిగిండు. అయినా దినకర్‌కి గుర్తురాలేదు. ‘‘నువ్వు ఎవరో చెప్పు’’ మళ్లి అడిగాడు దినకర్. మీ పెళ్లి రోజు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన నేను అని పరిచయం చేసుకున్నాడు రాఘవ.
పురుషోత్తం నాకు మేనమామ. వసంత నా మేన మరదలు. నీవల్లే వసంతను నేను పెళ్లి చేసుకోలేకపోయిన. ప్రాణసమానంగా ఆరాధించిన. మీ పెళ్లి జరుగుతున్నప్పుడు నేను విషం తాగిన. అని పరిచయం చేసుకుంటే చేతులో చేయి వేసినప్పుడు మంచు ముద్ద తగిలినట్టు అనిపించింది. పెళ్లి కాగానే నువ్వు వెళ్లిపోయావు. నేను వసంతను చెడగొట్టిన. అంటే రేప్ చేసిన. నీకు బదులు నేను శోభనం జరిపిన. అని రాఘవ అన్నాడు. ‘‘యూ రాస్కెల్’’నా భార్య గురించి ఇంకొక్క మాట మాట్లాడిన చంపేస్తా... రాఘవ మల్లి మల్లి అదే చెప్తే కోపానికి వస్తున్నాడు దినకర్. ఇద్దరిమధ్య వాతావరణం వేడిక్కింది. నిన్ను చంపేస్తే నా పగ పూర్తిగా చల్లారుతదని రాఘవ దినకర్‌లు కొట్లాడుతున్నారు. బలమైన దెబ్బతాకింది దినకర్‌కి.
బరువుతో కళ్ళుతెరిచిన దినకర్ ఆశ్చర్యపోయాడు. ‘‘నేను బ్రతికే ఉన్నానా’’ అని చుట్టూ పరికించి చూశాడు.
నేను ఉన్నది స్మశానంలో కాదా? నేను స్మశానంలో చచ్చిపోలేదా ఇక్కడికి ఎట్లా వచ్చాను? అని ప్రశ్నిస్తుంటాడు దినకర్.
‘‘ఏంది బాబు అర్థం లేకుండా మాట్లాడుతవు?’’ అని అడిగిండు దినకర్ మామ. ‘‘నన్ను రాఘవ చంపలేదా? రాస్కెల్! వాడి అంతు చూస్తా.’’ అని లేచాడు. అందరు వారించారు. శాంతపడ్డ దినకర్‌తో రాఘవ చనిపోయి మూడు నెలలు అయింది. పెళ్లిలో విషం తాగింది అతనే. అప్పుడు బతికాడు. ఆ తర్వాత మళ్లీ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు.
‘‘నిన్ను చెడగొట్టినట్టు చెప్పింది మీ బావనే. నిజమా’’ అని వసంతను ప్రశ్నించినప్పుడు ఏడుసుకుంటూ తల ఊపింది వసంత. అంటే రాఘవ చెప్పేది నిజమేనన్నమాట అని దినకరన్నాడు. కాదండి అదుర్దాగా తలెత్తింది. బావ బలాత్కారం చేసిన మాట నిజమే కానీ అతడు నన్నేం చేయలే. నా అరుపులకు అందరు లేచారు. బావ పారిపోయాడు. ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలి? తను ఇప్పుడేం చేయాలి ? భార్యతో భవిష్యత్తును తలుచుకుంటే దినకర్ కు భయమేసింది. పక్కన వసంత ఏడుస్తూనే ఉంది. పాత్రల మనస్తత్వాలని సమర్ధవంతంగా చిత్రించాడు రచయిత.
ఆడం స్మిత్ సంపద నిర్వచనం. రాబిన్స్ కొరత నిర్వచనం, జేబిసే మార్కెట్ సప్లై సిద్ధాంతం, ప్రొఫెసర్ గౌతమ్ మాథూర్ ప్రతిపాదించిన గాజు తెర సిద్ధాంతం ఒకటేమిటి ఎన్ని సిద్ధాంతాలు మారుతున్న పేదరికం మాత్రం అన్ని సిద్ధాంతాలకు ఎదురుపడి నిలవడమే కొసమెరుపు అని చెప్పే కథ ‘కొత్త బస్టాండ్.’ ఈ కథ పాఠకులు చదవాల్సిందే.
స్థల కాలాదులు మారుతాయి. మారనిది మార్పురానిది దరిద్రుల బతుకులే. ఈ వ్యవస్థలో ఎప్పుడైన బలహీనులే బలవుతారనే తెలియజేసే కథ ‘గాలివాన’. దొర పెత్తనానికి బలహీనులు, బడుగువర్గాల ప్రజల జీవితాలు ఎలా కోల్పోతారో తెలియజేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన తెలుగు కథ పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలివాన’లో ముష్టిది చనిపోతుంది.
ఎడతెరపిలేని కుండపోత వాన. గాలివానకు తడిసిన కొమురయ్య, అతని కుటుంబ సభ్యులు చలికి గజగజ వణికిపోతున్నారు. చెత్తిరి పట్టుకొని వొచ్చిన సంజీవరావు దొర బెదిరింపులకు భయపడి దొర బిడ్డ కుటుంబం ఎలా ఉందో తెలుసుకొని రావాలనీ వెళ్లిన మాదిగ కొమురయ్య వాగుదాటుతూ కొట్టుకపోయి తుమ్మ తుప్పల్ల ఇరుక్క్కపోయి చనిపోతాడు. అంతగనం జెప్పినా పని ఇనిపిచ్చుంకున్నట్లు లేదు... లంజకొడుకు... ఇల్లు పీనుగుల పెంటగావాలే అనుకుంట పండ్లు పటపట కొరికిండు దొర. దొర దిమాక్ల కొమురయ్య, అతని కుటుంబం రేపు తన కోపానికి ఎట్లా కాలి బూడిదైతదో కండ్ల వడ్డది తప్ప.. పీనుగైంది దొరకు కన్పియ్యలే...
ALso REad: బతుకు దిక్సూచి ‘‘అక్కన్నపేట రైల్వే స్టేషన్’’ కథలు
దొరలకు ఎదురుతిరిగిన సంఘటనలు తెలంగాణ కథల్లో చూడగలం. సురవరం ప్రతాప రెడ్డి ‘గ్యారా కద్దూ బారా కోత్వాల్’ కథలో పదకొండు సోరకాయలు అమ్ముకోవడానికి వచ్చిన రైతుకు పదకొండు మంది అధికారం కలిగినవారు ఎదురై ఉచితంగా తీసుకెళుతారు. పన్నెండవవాడుగా కరణం ఎదురై నాకు ఇవ్వవా అని ప్రశ్నిస్తాడు. ఈ కథలో రైతుకు లాభంలేదు. కానీ ప్రాణం దక్కింది. పగవట్టిన హన్మంతరావు దొర, సర్పంచ్ ఊరి జనాల చేత అధికారికంగా ప్రాణం తీసిన సంఘటనే ‘పాముల నడుమ చీమ’ కథ.
గారడీవాడు బాలీరు. బాలీరు బార్య, బిడ్డ గౌరీ. ఊరిలోకి రాగానే ‘‘గారెడి బాలీరన్న బండి’’ అని పిల్లలు గట్టిగ ఆరుసుకుంట సంతోషపడ్డారు. పర్మిషన్ కోసం పోతే దొర, సర్పంచ్ ఇద్దరు వద్దన్నరు. బాలీరు పోతూంటే గారడీ ఆడాలనీ, ఎదురు తిరిగి ఊరిజనం చివరకు ఒప్పించిండ్రు. చిత్ర చిత్రాల కనికట్టుతో ఆట ఆడుతున్నారు. కత్తులు మింగుతుంటే జనం ఈలలు వేస్తారు. చప్పట్లు కొట్టారు. దొర వొచ్చిండు. నిశ్శబ్దం ఆవరించింది. మోసం చేస్తున్నవేంరా? బాలీరుగా??? అని ప్రశ్నించిండు దొర. మోసం చేయకపోతే మా తల్వారు మింగుమని అందులోంచి కొంతమందిని ఉసిగొల్పిండు. బల్మీటికి దొర తల్వారు మింగిన బాలీరు పర్వతంలా నెత్తురు కక్కుకుంటూ కూలిపోయాడు.
అక్కన్నపేట రైల్వేస్టేషన్ - కథా శిల్పం: ‘‘కథ అనేది గుర్రపు పరుగు వంటిది. ప్రారంభం, ముగింపు ముఖ్యం’’ అని మోపాస అంటాడు. అయోధ్యారెడ్డి మొదటి వాక్యంతోనే పాఠకుని మనసుని బంధిస్తాడు. కథ ముగింపువరకు ఆపకుండా చదివిస్తాడు. ఈ కథల పుస్తకం తీరిక సమయాల్లో నేను చదవడానికి తీసుకెళ్లాను. స్టాఫ్ రూంలోని టైబిల్‌పై పెట్టాను. ఒక టీచర్ ఈ పుస్తకాన్ని అలా తిరగేసింది. సార్ ఈ కథ చదివేవరకు ఇవ్వనని చెప్పి కథ ఆసాంతం చదివింది. చదివిన కథపేరు. ‘శిథిల’. ఆ కథపై చర్చజరిగింది. బాగా చదివించింది రచయిత స్టైల్ అని కితాబ్ ఇచ్చారు. రచయిత శైలిబాగుందని అవగతమవుతుంది. రుచిచూసేవాడు వంటచేసేవాడు కాకున్న రుచి చెప్పినట్లే పాఠకుడు కథకుడు కాకున్న మంచి కథను గర్తిస్తారని చెప్పటానికి ఈ సంఘటనను ఉదహరించాను.
ఈ కథా సంపుటంలో కథకు పెట్టేపేరు నుంచి పాత్రకు పెట్టే పేర్ల వరకు, పాత్ర నిర్వహణలో అద్భుతమైన శిల్పాన్ని ప్రదర్శించాడు రచయిత. ‘‘కథకు శైలి, శిల్పం అనేవి రెండు కండ్ల లాంటివి. ఇందులో ఏ ఒక్కటి లోపించినా కథ అవిటిదవుతుంది. పదజాలం, నుడికారం,ప్రతీకలు, రూపకాలు, భాష ఇవన్నింటి సమాహారంగా కనిపించేది శైలి. స్పష్టంగా సరళంగా, సంక్షిప్తంగా ఉన్న వాక్యరచన ఉత్తమ శైలికి నిదర్శనం. పాఠకులను చకితులను చేయడం, అయోమయానికి గురిచేయడం కన్నా అర్థమయ్యేవిధంగా రాయడం మిన్న.’’ అని (కళగా భాసించేదే కథ. నమస్తే తెలంగాణ దినపత్రిక తేది:27.02.2022, స్వామి, బి.వి.ఎన్) పేర్కొన్నట్లు అయోధ్యారెడ్డి మనసులో సింక్ అయ్యేటట్లు రాస్తాడు. తానే చూసినట్లు కథ చెప్పడం, పాత్రల చేత కథను చెప్పించడం వంటి ప్రారంభాలు వున్నా ఆసక్తిగా ఎత్తుగడ కొనసాగుతుంది. ఆకట్టుకునే శిల్పాన్ని నిర్వహిస్తాడు. ఇంతకీ శిల్పమనగా ‘‘ఉండి తీరాల్సినవి మాత్రమే ఉండడం’ అని ఖదీర్‌బాబు వివరించారు. (‘కథలు ఇలా కూడా రాస్తారు. అన్వీక్షి ప్రచురణ. జనవరి, 2022. పుట.86. ఖదీర్‌బాబు, మహమ్మద్) ‘‘ఏ కళాకృతిలోనైనా అత్యంత కీలకమైన అంశం దానికొక కేంద్రం ఉండితీరాలి. అంటే ఆ కేంద్రం దగ్గర కిరణాలన్నీ ఏకీకృతం కావాలి, లేదా అక్కణ్ణుంచి నలుదిక్కులా ప్రసరించాలి. నిజమైన కళ ముఖ్య లక్షణాల్లో ఇది ఒకటి, అది చెప్పే సందేశమేదో, అది మాత్రమే సంపూర్తిగా చెప్పగలగడం.’ అని టాల్ స్టాయి నిర్వచించాడు.(నా కుటీరం, వెబ్ పత్రిక, కథ శిల్పం -2 చినవీరభద్రుడు, వాడ్రేవు ఏప్రిల్28,2019).
(మిగతా భాగం రేపు)