నీకు మారుపేరుగా నిలిచే ఆత్మీయమైన ఇల్లొకటి వుండాల్సిందే అంటూ గోపగాని రవీందర్ రాసిన కవిత " శాశ్వత చిరునామా..! " ఇక్కడ చదవండి :
మనిషికింత నేల కావాలి
అందులో నిలువనీడనిచ్చే
ఒక గూడుండాలి
గర్వంగా తలెత్తుకొని
గమ్యాన్ని చేరడానికి
గమనంలో ఆశయమున్నట్లుగానే
సేదతీరటానికి పందిరి వంటి
ఇల్లొకటి ఉండాలి...!
సంపాదనలో కొంత మొత్తాన్ని
పొదుపు సూత్రాలను అనుసరిస్తూనే
బ్యాంకులిచ్చే లోన్లను తీసుకుంటూనే
కలల సౌదాన్ని నిర్మించుకున్న
అశేష జన వాహినిలో నేనొకణ్ణి..!
పునాదిరాయి వేసినప్పటి నుండి
గృహంలో ప్రవేశించే దాకా
నిద్రలేని రాత్రులెన్ని గడిపానో
లెక్కలేదు చెప్పడానికి
పద్ధతిగా కాగితాలపై
ఖర్చులన్నీ రాసుకుంటూ
సరిచూసుకుంటూనే మధ్యలో
ఇవన్నీ ఇంటికే కదా అని
రాయడం విరమించుకున్నాను..!
పనులు జరుగుతున్న రోజుల్లో
ఏ రోజుకు ఆ రోజు
కొత్త అందాలను
సంతరించుకుంటున్న నిర్మాణాన్ని
తనివి తీరా చూస్తూ
ఆత్మీయుల సలహాలను పాటిస్తూ
కట్టుకున్న చోటిప్పుడు
శాశ్వత చిరునామై నిలిచింది..!
ఇసుకెంత కంకరెంత
సిమెంట్ ఎంత అవసరమో
కరెంటు , ప్లంబర్ , వడ్రంగి పనుల
రకరకాల డిజైన్లతో
నిత్యం సందడిగా ఉండేది
అనుకున్న సమయానికి
పని కాకపోతే నిరాశ ఆవరించేది
బలమైన సంకల్పమే తోదుండడంతో
ఉత్సాహం పుంజుకునేది..!
మేస్త్రిలందరూ
భవన నిర్మాణ ఇంజనీరుల్లా
కట్టడంలో నిమగ్నమయ్యారు
కూలీలందరూ
తమ చెమటను ధారపోశారు
ప్రేమమయమైన చేతులన్నీ
ఒక్కటై చేస్తేనే కదా
మన ఉనికిని చాటే
నిలువెత్తు సంతకమై నిలిచింది..!
ప్రతి గోడలో శ్రమ కనిపిస్తుంది
ప్రతి గదిలో హృదయ రాగాల
సవ్వడులు వినిపిస్తుంటాయి
ప్రతి కిటికీ పలకరిస్తుంది
ప్రతి ద్వారము ఆహ్వానిస్తుంది
ధైనందన కార్యక్రమాల్లో
అలసట చెంది వస్తే
ఆత్మీయంగా హత్తుకునేది
అపురూపమైన ఈ ఇల్లే కదా..!
పాదం మోపితే చాలు
తనువంత జల్లుల్లా పులకరించే
ఇల్లొకటి వుండాల్సిందే
కష్టమంతా పక్షుల్లా ఎగిరిపోవడానికి
భరోసానిచ్చే ఇల్లొకటి వుండాల్సిందే
నీకు మారుపేరుగా నిలిచే
ఆత్మీయమైన ఇల్లొకటి వుండాల్సిందే
మమతానురాగాల బంధాలతో
కలియతిరిగే ఇల్లొకటి వుండాల్సిందే
ఒక్కమాటలో ఇల్లంటే
వసంతోత్సవాల పరిమళాల కూడలి..!