దండమూడి శ్రీచరణ్ కవిత : దాచుకుంటావా!

Published : Dec 20, 2022, 10:51 AM IST
దండమూడి శ్రీచరణ్ కవిత : దాచుకుంటావా!

సారాంశం

నీకై నే రాసిన ప్రేమలేఖలని నీ కన్నీళ్లలో దాచుకుంటావా! అంటూ భువనగిరి నుండి దండమూడి శ్రీచరణ్ రాసిన కవిత  " దాచుకుంటావా! " ఇక్కడ చదవండి :   

నా గాయాల్ని
నీ జ్ఞాపకాలుగా దాచుకుంటావా!
కొన్ని తీయనివి, కొన్ని మాననివి
కొన్ని మలగిపోనివి, కొన్ని మరచిపోలేనివి!!
ఒక్కో క్షణం
రాత్రుళ్ళు
కొవ్వొత్తిగా రాలే నా కన్నీళ్లను
నీ దోసిట దాచుకుంటావా!
నిశీధులలో
ఒంటరిగా
చీకటి దారులలో సంచరించే
నా ఏకాంత, విషాద క్షణాల్ని
నీ కనుకొలుకుల్లో దాచుకుంటావా!
నీకై నే రాసిన ప్రేమలేఖలని
నీకు పంపలేక
నా అలమారా సొరుగులో దాచుంచాను
అవి నే మరణించాక,
నీ కన్నీళ్లలో దాచుకుంటావా!
నీకై సాయం సంజెలలో
చెట్ల నీడలలో
ఒంటరిగా వేచుండే
ఆ సుదీర్ఘ ఎదురుచూపులను
నీ రెప్పలలో దాచుకుంటావా!
నీకై నే తపించి, జ్వలించి, దుఃఖించి
రాసుకుంటున్న ఈ కవితలను
నీ కలలలో దాచుకుంటావా!
అసలు ఎప్పటికైనా
నన్ను
నీ హృదయంలో దాచుకుంటావా!!


 

 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం