ఎంతకూ తెల్లవారని చీకటి మీది కోపం తెల్లారగట్ల పొయ్యి వెలిగించి అగ్గి దేవున్ని నిద్ర లేపుతుంది అంటూ గజ్జెల రామకృష్ణ రాసిన కవిత ' ఆల్ రౌండర్ ' ఇక్కడ చదవండి :
అప్పుడప్పుడు
కడుపంతా ఖాళీగా ఉన్నట్టు
లోపలేదో నిప్పు సురుకు అంటుకున్నట్టు
నోటికేదో తినాలని అనిపించినపుడల్లా
జున్నుగడ్డ లాంటి
పొయ్యిమీది బువ్వగిన్నె దించి
కారం కారంగా....
ఉప్పుప్పుగా.. పులపుల్లగ.. ముద్దలు తినిపిస్తుంది
తిననను మారాము పద్యమయినపుడల్లా
బతిమాలే బుజ్జగింపవుతుంది
ఒక్కోసారి జ్వరం మందేదో వేస్తున్నట్టు
ముద్దెనక ముద్ద నోట్లో కుక్కుతుంది
చెప్పకుండానే
ఆకలి నొప్పికి మెతుకు మాత్ర అవుతుంది
కడుపు నొచ్చె కడుపు నొచ్చె అని
కడుపు పట్టుకుని ఏడ్చినపుడల్లా
నెత్తిమీద ఉప్పూ మిరపగాయ గిరగిరా దిప్పి
అటూ ఇటూ రేగ్గంప మీద దాటించి
బాధెళ్ళిపోయిన బడిబాట అవుతుంది
బడివొదలగానే ఎదురొచ్చే
ఎదురుచూపుల తోరణమవుతుంది
బడికి వచ్చీ పోయే దారిలో
పుస్తకాల మూట అందుకుని
లేత ఎన్నుబొక్క వొంగిపోయే ప్రమాదాన్ని
భుజాలకెత్తుకుంటుంది
బట్టలు నల్లబడ్డాయని
పాలనురగలో ముంచి తీసినట్టు
సూరుకింద సీతాకోక చిలుకలు వాలిన
దండెం కడుతుంది
మొక్కలకు నీళ్ళు పోసి
రంగు రంగుల పూల పిట్టల్ని ఆహ్వానిస్తుంది
చిక్కుడూ దొండపాదుల చేత
కూరకొచ్చే కవిత్వం పాడిస్తుంది
బయటపడదు గానీ
మాయమయిన బచ్చలితీగ ప్రాణం దొరకబట్టి
కమ్మటి పప్పయిన మమకారం
పచ్చని ఉదయాలు పండించే
పాలకూర కొత్తిమీరల చిట్టి చాటంత వ్యవసాయం
ఎంతకూ తెల్లవారని చీకటి మీది కోపం
తెల్లారగట్ల పొయ్యి వెలిగించి
అగ్గి దేవున్ని నిద్ర లేపుతుంది
తాత చుట్టపొగ వొదిలినట్టు
పొగ గక్కుతున్న పొయ్యి చెవిలో గొట్టం బెట్టి
ఏదో మంత్రం ఊదుతుంది
చెప్పదు గానీ
దవడ కింద
గుక్కెడు అగ్గి దాచుకున్న ఇంద్రజాలం
వాకిలూడ్చి..... సానుపుజల్లి...... ముగ్గులేసి......
అంట్లు తోమి..... ఇల్లు కడిగి.........
అక్క నేర్చే పాఠమవుతుంది
గుర్తుపట్టం గానీ
రాత్రి జోలపాడి నిద్రబుచ్చే జోలపాట
ఎప్పుడు నిద్రపాట అవుతుందో తెలియని
మెలుకువ రాగం.
గజ్జెల రామకృష్ణ
8977412795