డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : నాలోని నేనైన నీవు

By Arun Kumar P  |  First Published Dec 1, 2022, 3:24 PM IST

ఆలోచనల కవిత్వం నీవైన -  ఓ గొప్ప అనుభవం నాలోన అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత  " నాలోని నేనైన నీవు " ఇక్కడ చదవండి : 


ఏ భావోద్వేగాలూ, మమతానురాగాలు
కనిపించని కటిక చీకటిలో
ఒక మంచి వాక్యానికైనా 
కవిత్వ వాసన పుట్టించడం
బహుశా అంత సులభం కాదేమో
అదీ మనిషి గురించి మనిషిగా...

ఒక చెట్టు నీడను తలపించాలి
నాలోని నేను
నాలోని నేనైనా 
ప్రకృతి ఆకుపచ్చ చెట్టు వేళ్ళైన
నీవు నాలో కవిత్వశ్వాస 
 
నా కలం నుండైతే జారినవి   
కాయితంలోకి అక్షరాలు 
కానీ, ఒక్క అక్షరమైనా కనిపించదు
కంటి రెటీనా పైన 
ఎంత తరచి చూసినా 
గాలికి రెపరెపలాడే ధవళ వస్త్రం 
దృశ్యమే నా కళ్ళలో 
 
అయినా ఇంకా నేను
ఆలోచిస్తున్నాను అదే పనిగా..‌ 
ఓ భావన  మెరుపులా తట్టింది 
నాలోని నేనైన నీవుగా
కాగితాన్ని ముగ్గుల వాకిలి చేసింది        
ద్రవించిన సిరా చుక్క

Latest Videos

నా చూపులు 
అందమైన మిణుగురుల సన్నాయి
ఆ చూపులను సారించే కనులు       
సుందర మృదుకర పున్నాగలు
ఇక్కడే... ఇక్కడ 
నా మనసు రంగరించుకొన్న మానవత్వం 
నాలోని నేనైన నీవుగా లేచి ఆడింది
ఆ నీవే, వెలిగే కవితా కాంతి ధార

భావోద్వేగాల సంగమ శబ్దనిశ్శబ్దం
అందమైనది లోయ 
లోతుల జారే నదీ పాయలా 
మొలకెత్తే రుధిర హృదయ సేద్యం
అద్భుతమైనది కవితాక్షర లహరి 
ఝరిలా 

ఆలోచనల కవిత్వం నీవైన 
ఓ గొప్ప అనుభవం నాలోన
నాలోని నేనైన నీవు నన్ను 
నిదురలేచిన కావ్యమైన నీవే 
మరువలేని మధురానుభూతి
  

click me!