సబ్బండ కులాల స్త్రీల రణ నినాదం - దాతి

By Arun Kumar P  |  First Published Nov 30, 2022, 2:38 PM IST

దాసోజు లలిత కవిత్వ సంపుటి  " దాతి " పైన  సాగర్ల సత్తయ్య రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :


అస్తిత్వ స్పృహ, లోతైన అభివ్యక్తి, స్పష్టమైన దృక్పథం దాసోజు లలిత కవిత్వ జీవ లక్షణాలు.  ఉత్పత్తి కులాల స్త్రీల పక్షపాతిగా  లలిత కలం కదం తొక్కింది. అన్యాయాన్ని ప్రశ్నించింది. దీనులను ఆర్ద్రతతో అక్కున చేర్చుకుంది. వాళ్లలో పోరాట స్పృహను రగుల్కొల్పింది.
        పదిమందికి పని నేర్పిన
        మా నాయన ప్రొఫెసర్
        మా అమ్మ ఆఫీసర్
        మా ఇల్లు
        చేతి వృత్తి పనుల యూనివర్సిటీ...  
అంటూ ధీమాగా ప్రకటించిన దాసోజు లలిత కవిత్వం పూర్తిగా శ్రామిక జనపక్షపాతమే. జ్యోతిష్యానికి, చేతబడులకు తరగతులు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాలు ఉన్న ఈ రోజులలో చేతివృత్తిదారులకు ఓ ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని డిమాండ్ చేయడం లలిత కవిత్వం తాత్విక దృక్పథాన్ని స్పష్టం చేస్తున్నది.  ఈ కవిత్వం జీవితం నుంచి పుట్టుకొచ్చింది. అందుకే స్పష్టమైన సామాజిక స్పృహ ఇందులో కనిపిస్తుంది.  ప్రత్యేకించి  ఉత్పత్తి కులాల స్త్రీల పక్షం వహించింది.

జానపదుల స్త్రీల సంగీత మాధుర్యం వెలకట్టలేనిది. వేల ఏండ్లుగా ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మోసుకు వస్తున్న జానపద స్త్రీ గొప్పదనాన్ని
        మైదానం సంప్రదాయ
        గోడల మీద కూసే కోయిలలు
        ఆమె గొంతును
        విన్నప్పుడు ఎగిరిపోవాల్సిందే...
అని గిరిజన స్త్రీల సంప్రదాయక సంగీత జ్ఞానాన్ని ప్రశంసించింది. వారి సాంస్కృతిక జీవనాన్ని, ప్రత్యేక సంగీతాన్ని మూల్యాంకనం చేసింది.
ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పరికిస్తే కాలానుగుణంగా అనేక ఉద్యమాలు కనిపిస్తాయి.  భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం,  దిగంబర కవిత్వం,  విప్లవ కవిత్వం అనంతర ధోరణులు వాదాలు గమనించవచ్చు.  విశేషించి దళిత వాదం, స్త్రీవాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయ అస్తిత్వవాదం,  బీసీ వాదం మొదలైన వాదాలు కొన్ని దశాబ్దాలను శాసించి నెమ్మదించాయి. ఈ కోణంలో దాసోజు లలిత కవిత్వాన్ని చూసినప్పుడు ఇది వృత్తి వాదమవుతుంది. వృత్తులు ఉన్నంతకాలం, వృత్తులపై ప్రపంచీకరణ ప్రభావం ఉన్నంతకాలం వృత్తి వాదం సాహిత్యంలో నిలబడుతుంది. ఇలా తనదైన ప్రత్యేక వాదాన్ని సాహిత్యంలో ముందుకు తెచ్చిన దాతి కవిత్వాన్ని అభినందించకుండా ఉండలేం.

Latest Videos

ఉత్పత్తి కులాలు లేని సమాజాన్ని ఊహించలేము. సమాజ నిర్మాణంలో,  గమనంలో ఉత్పత్తి కులాలదే అగ్రస్థానం. ఒక రజక స్త్రీ శ్రామిక సౌందర్యాన్ని అభివర్ణిస్తూ...
        సౌడు పూతలతో
        సర్ఫును కనిపెట్టిన ఆమె
        మహా శాస్త్రజ్ఞురాలు... అంటుంది. 
రజక స్త్రీ శ్రమలో దాగిన  శాస్త్రీయ దృక్పథమిది. నిజంగానే సబ్బుల గుణంలోనూ, సౌడు స్వభావంలోనూ  క్షార గుణాన్ని గమనించవచ్చు. అనాదిగా రజకులు అవలంబిస్తున్న విధానానికి  మరింత శాస్త్రీయతను జోడించి  సబ్బులు సర్ఫులు  తయారు చేస్తున్నారన్నది కాదనలేని సత్యం. మైల బట్టలు ఉతుకుతూ సమాజానికి ఇంత సేవ చేస్తున్న రజక స్త్రీల శ్రమకు తగ్గ వాటా కావాలని లలిత డిమాండ్ చేస్తున్నది.

గీత కార్మిక వృత్తిలో పురుషులతో సమానంగా గౌడ స్త్రీలు కూడా శ్రమిస్తారు. ఇప్పటివరకు వచ్చిన సాహిత్యంలో  గౌడన్నల శ్రమను కొంతమేర గుర్తించారే కానీ గౌడ స్త్రీలను గుర్తించిన వారు బహుశా లేకపోవచ్చు.
         దూప గొన్న ఎట్టి నోర్లకు
          వాడిక ముంత ఆమె
          మడ్డి పేరిన
          శేరు ముంతల్లా
          పులిసిపోయింది ఆమె...
నిజమే దాహమేసిన పేదవాడికి అమృతాన్ని అందించే కల్పవల్లి  గౌడ స్త్రీ. ఎందరికో ఆకలి దూపలను తీరుస్తుంది.  ఇది ఆమె నెనరును ప్రకటించే కవిత. ఇదే సందర్భంలో అందరికీ సాయం చేసే ఆమె మాత్రం మడ్డి పేరిన శేరు ముంతలా పులిసిపోవడం ఆమె బతుకు చీకట్లను ప్రకటించడమే. తాను కష్టపడుతూ కూడా ఇతరులకు సాయపడుతున్న ఆమె బతుకు తాటి మీది నురుగోలె మెరవాలని లలితక్క ఆశించింది.

సమాజ గమనంలో కీలక పాత్ర వహించే మరొక వృత్తి కుమ్మరి.  కుమ్మరి వృత్తిలో కూడా స్త్రీ శ్రమ వెలకట్టలేనిది. తన భర్త చేసిన కుండలను వాములో పెట్టి కాల్చడం మొదలు వాటిని అమ్మే వరకు అవిరేని కుండలు మొదలైన వాటికి అలంకరణలు చేయడంలోనూ కుమ్మరి స్త్రీ కళా నైపుణ్యం ఎంతో గొప్పది. కళాత్మకమైన ఈ వృత్తి ప్రపంచీకరణ నేపథ్యంలో విధ్వంసం అవుతున్నది.  ఈ సందర్భంలో కుమ్మరి స్త్రీ గురించి మాట్లాడుతూ
          పచ్చి కుండ
          ఇన్ని సల్ప దెబ్బల మీద
          వాములో కాగిన
          ఆమె కణ్ మని మోగినకుండ
          మట్టిపై అన్ని హక్కులు కావాలి ...
కష్టాల వాములో కాలిపోయి గుండె రాయి చేసుకుని కష్టాలకు ఎదురీదుతూ ముందుకు సాగుతున్న కుమ్మరి స్త్రీ పక్షాన నిలబడి కొత్త శకాన్ని లలిత ఆహ్వానిస్తున్నది.

ప్రపంచీకరణ కార్పొరేటీకరణ మాయలో పూసల గంపలు మాయమైనవి. ఒకప్పుడు పూసలోళ్ళు దండలు, పౌడర్ డబ్బాలు, బొట్టు బిళ్ళలతో ఇల్లిల్లు తిరిగి అమ్ముకునే పూసల మాణిక్యమ్మలు కనుమరుగవుతున్న వైనానికి ఈ కవయిత్రి ఆవేదన చెందింది.
         ఇంటి పేరుగా దండ గుచ్చిన
         పూసల మాణిక్యమ్మ ఆమె
         ఆమె వచ్చిందంటే
         పల్లె సింగారించిన వయ్యారం..
అంటూ అందంగా పూసల స్త్రీ జీవితాన్ని ఆవిష్కరించింది. పురుషులతో సమానంగా శ్రమిస్తూ తమ చెమట చుక్కలతో సమాజ భవనాన్ని నిర్మిస్తున్న వడ్డెర స్త్రీల శ్రమను లలిత తన కవిత్వం లో అద్భుతంగా కీర్తించింది.
        కోలల లోతు బావులు తవ్వి
        గుక్కెడు నీళ్లకు
        పాతాళ గంగను కనుగొన్నది
        ఆమె గొంతు ఇప్పుడు
        చారెడు నీళ్ళకు పిడసగట్టింది
         మెరిసే బంగ్లాలకు భవంతులకు
         పునాది ఆమె...
అంటూ వడ్డెర స్త్రీ శ్రామిక తత్వానికి కవిత్వ గౌరవాన్ని ఆపాదించింది. వాళ్ల రూపురేఖలను తన కవిత్వం ద్వారా పాఠకుల కళ్ళ ముందు దృశ్యమానం చేసింది.
         ఎత్తుకు ఎత్తు మోతాదు లావు
         మన్ను పెళ్ల లాంటి కడ
         ఆస్మాన్ కామంచి గోసి
         గడ్డపార లాంటి వెన్ను...
ఈ వాక్యాలు చదివిన పాఠకులకు వడ్డెర స్త్రీ కళ్ళముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది.  సుందరయ్య భవనంలో పెద్ద గదికి వందలాది మందితో తరలివచ్చిన వడ్డెర హక్కుల పోరాట పతాకగా ఆమెను లలిత అభివర్ణించింది.

లలిత కవిత్వంలో ధర్మాగ్రహం కనిపిస్తుంది.  ఉత్పత్తి కులాలకు దక్కవలసిన గౌరవం  ఉన్నత వర్గాలు తన్నుకు పోతున్న వైనాన్ని సూటిగా ప్రశ్నించింది
         నూలు ఒడికిన కండెలకు
         గుండెలద్దిన మిర్యాల రాధమ్మల నడుమ
         వీటి కోసం ఒక్కనాడు శ్రమ చేయని గాంధీ ఎట్లా దూరిండు? అని ప్రశ్నించడం తరతరాలుగా ఉత్పత్తి కులాలకు జరుగుతున్న అన్యాయం, అగ్రవర్ణాల పెత్తనాన్ని గల్లా పట్టి నిలదీసినట్లుంది.  నేత మగ్గాలకు ఆదెరువు కావాలి అనే లలిత డిమాండ్ ఎంతైనా సమంజసం.
         రాట్నం ఒడికి ఆసుపోసి
         బట్టలకు రూపం ఇచ్చిన
         మిర్యాల రాధమ్మనే
         మా బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించిన లలిత చైతన్యం ఈనాడు సబ్బండ కులాల స్త్రీల చైతన్యానికి ప్రతినిధిగా చెప్పవచ్చు.

సమాజంలో మనకు గొప్ప సేవా కులం మంగలి వృత్తి. మంగలి స్త్రీలు సమాజానికి చేస్తున్న సేవ ఎంతో గొప్పది. ముఖ్యంగా ప్రసవ సమయంలో  మంత్రసానులుగా అవతారమెత్తి తరాల తరబడి డాక్టర్ వృత్తిని నిర్వహిస్తున్నారు. ఈనాడు కార్పొరేట్ మాయాజాలంలో కనుమరుగవుతున్న మంత్రసాని సేవలను ప్రశంసిస్తూ...
         అనాదిగా సమాజానికి బొడ్డు కోసి
         పురుళ్లు చేసే మంత్రసాని తల్లుల
         మునివేళ్ల జ్ఞానంపై కార్పొరేట్ దవాఖానాలు
         టక్కు, టై, తెల్లంగి ధరించి ప్రైవేట్ బొప్పి...
అంటూ ప్రైవేట్ వ్యాపార దృక్పథాన్ని  మంగలి స్త్రీల సేవా గుణాన్ని తన కవిత్వంలో విప్పి చెప్పారు.  వీళ్లే ఆరోగ్య మంత్రులుగా చెలామణి కావాలని ఆకాంక్షించారు .

ఇనుమును కాల్చి వస్తువులుగా తయారు చేసే కమ్మరి వృత్తి ఔన్నత్యాన్ని ఇంత అని వెలకట్టలేము. కమ్మరి వృత్తిలోనూ సమ్మెట దెబ్బలతో  పురుషులతో సమానంగా కష్టిస్తున్న స్త్రీల శ్రమకు విలువ కట్టలేము.
        తల నరుక్కొని
        డాకలి తున్క మీద
        సమ్మెట దెబ్బలకు
        సాగిన కర్రును ... అంటూ కమ్మరి స్త్రీ మనోవ్యథను ఉత్తమ పురుష కథనంలో ఆర్ద్రంగా  ఆవిష్కరించారు. పంచభూతాలతో కలిపి కాగే కర్మశాలలో ముడి సరుకు కావాలని,  మండే కొలిమి కడుపు నిండే ఆదరువు కావాలని ఆకాంక్షిస్తుంది.  విశ్వకర్మలలో మరొక ఉత్పత్తి కులం కంచర.  ఇత్తడి కంచు వస్తువులు తయారు చేయడం, అందమైన కళాకృతులకు నగిషీలు చెక్కడం కంచరి వృత్తిదారుల కళా కౌశలాన్ని ప్రకటిస్తుంది. ఈ వృత్తిలోని మహిళలు కూడా పురుషులతో సమానంగా శ్రమిస్తూ ఉంటారు.
        ఆశ్రమ రుషి భార్య కాదు
        సలసల కాగే పేగులను కరిగిస్తూ
        సలాకతో కలుపుతూ పోత పోసే
        కంచరి దాయి లోహకారుని భార్య...
అని కంచరి స్త్రీల శ్రమ గొప్పదనాన్ని కీర్తించింది. ' ఆమె చెక్కిన తామ్ర పత్రమే శాసనమై చెల్లాలి' అనే కవిత్వ పాదం లలిత గొప్ప అభివ్యక్తికి నిదర్శనం. ఎంతో గాఢత ఉన్న వాక్యం ఇది.  తామ్ర పత్రాలను చెక్కగలిగే కళాకౌశలం కంచరి వారికి సొంతం.  పూర్వపు రాజ్య శాసనాలు తామ్రపత్రాలపై చెక్కేవారు.  ఈ అంశాన్ని అన్వయిస్తూ ఉత్పత్తి కులాలు తమ శాసనాలను తామే చేసుకోవాలనే ఆకాంక్షను ఈ కవిత్వం ద్వారా వ్యక్తీకరించారు.
         బలిసిన దొరలతో చెయ్యి కలపక
         రజాకార్ల పేచి గెలిచి వచ్చిన
         పెనిమిటికి దాపలి భుజంగా ...
కమ్మరి లక్ష్మమ్మ త్యాగనిరతిని కొనియాడింది.

సమాజానికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అందిస్తున్న మరొక ఉత్పత్తి కులం యాదవులు. యాదవ స్త్రీల శ్రామిక సౌందర్యాన్ని లలిత అందంగా అక్షీకరించారు.
         దోరగాగే పాలమీగడ
         గడ్డ పెరుగుల ఒట్టు కట్టిన
         సల్ల తోడు కడవలో కవ్వం
         తెప్పతేలిన వెన్న ముద్ద
         గురిగి గోరెచ్చ సెగలో
         నేచ్చుక్క కనిపెట్టిన
         ఈమె చేతులకు సల్లసాక... 
అనే కవిత్వ పాదాల్లో యాదవుల సాంస్కృతిక జీవనం ప్రతిబింబిస్తుంది. 

మతసామరస్యంతో, వావి వరసలతో కలిసిమెలిసి ఉండే దూదేకుల స్త్రీలు సైదమ్మ చెల్లె, జానమ్మ వదినలతో మైత్రిని ఆకుపచ్చ చంద్రవంకలు కవితలో అద్భుతంగా  ఆవిష్కరించారు. కూలి తల్లుల ఆట పాటలను,  అవ్వల సామెతలను, ఆడబిడ్డల సందడిని, కొత్త కోడండ్ల సిగ్గును అందంగా కవిత్వీకరించారు.
         గొట్టె భూముల సదును
         కలగలిసే కలుపు పాటలతో
         అలుపు లేని కూలి రైతమ్మల
          బతుకు బురుద
          కురులారబోసుకున్న
          ఉత్పత్తి వృత్తి తల్లుల
          చెమటపూల నవ్వులు ....
అంటూ కూలీ తల్లుల శ్రామిక జీవన తత్వాన్ని వారి శ్రమజీవనములో భాగమైన పాటను తన కవిత్వంలో స్మరించుకున్నారు.

సమాజంలో ఎరుకలి తల్లుల శ్రమ కూడా ఎంతో విలువైనది. సమాజానికి కావలసిన గంపలు, జల్లలు, బుట్టలు అందించడమే కాక సాంస్కృతిక జీవనంలో భాగంగా ఎరుక చెప్పడం వంటి అంశాలు కవిత్వంలో చర్చించారు.
         తాటాకు బుట్టల ఎల్లమ్మ గద్దె
         డొక్కాడే రెక్కల ఎరుక చెప్పే
         ఎరుకలి నాంచారి మాతృక
         ఏకలవ్యుని అమ్ములపొది...
అంటూ ఎరుకల తల్లి చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని ఎరుకపరిచారు. కూలి తల్లి అంతరంగాన్ని పొత్తిలి కూన కవితలో అందంగా ఆవిష్కరించారు.
       నా సొదను లోలోపల దాచుకొని నింగిలో
       చందమామను చూపక నా ఎదను వేదిక చేసి
       నీ పాల కుతికి నా చెమట తడిని
       పెదవులకు అద్ది జోకొట్టిన... 
అని తన పేదరికానికి ఆవేదన చెందుతున్న వైనాన్ని హృద్యంగా కైకట్టింది. పేద తల్లులను ఆదుకునే ముతక చీరను సైతం కవిత్వ వస్తువుగా చేసుకొని లలిత అందమైన కవిత్వమల్లారు.
         పొత్తికి నడికట్టు వేసిన
         ఆమె కామంచె కాశె విప్లవం
         కొంగును రొండికి బిగించిన
         నారు మడిలోంచి బువ్వ ముద్ద ఆమె...
అంటూ ముతక చీరలో దాగిన చరిత్రను కవిత్వంలోకి అనువదించారు.  
తెలంగాణ మలిదశ ఉద్యమంలో బెల్లి లలిత పాత్రను గుర్తు చేస్తూ గొప్ప ఎలిజి రాశారు.
       మలి దశ ఉద్యమ పతాకమై
       ప్రజల తరపున చైతన్యగీతమై
       అగ్నిపర్వతం లావాలా పొంగిన
       తుమ్మెద నాదం ఆమె...

బిడ్డకు జన్మనివ్వడానికి తల్లి పునర్జన్మ ఎత్తినంత వేదనను అనుభవిస్తుంది. పండంటి బిడ్డను చూసుకున్న తర్వాత ఆ బాధనంతా ఇట్టే మరిచిపోతుంది.
         కొత్త లోకంలోకి వాని పసి నవ్వుల్ని
         వెదజల్లడానికి ఆమె ఒళ్లంతా జల్లెడ తూట్లు... అంటూ కన్నతల్లి ప్రసవ వేదనను కవిత్వీకరిస్తూ పంటలలో కెల్లా గొప్ప పంట కడుపు పంట అని తేల్చి చెప్పారు.  ఈ విధంగా దాసోజు లలిత కవిత్వం నిండా బహుజన స్త్రీలు విస్తరించి ఉంటారు.  కష్టసుఖాల వలపోత కనిపిస్తుంది. కవిత్వం చదవడం మొదలుపెడితే పాఠకులు ఆ కవిత్వ ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఏకధాటిగా చదివించగల గుణం లలిత కవిత్వానికి ఉంది.
        సందీటి సత్తెమ్మ
        నడికట్టుకేలాడుతున్న
        పురుకోస కొసన తాళం చెయ్యి ..... ఈ కవిత్వ పాదం పాఠకుల మనోఫలకంపై గొప్ప భావ చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ఇటువంటి కవిత్వ పాదాలు దాతి కవిత్వంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. సాహిత్య చరిత్రకు దాతి ఒక గొప్ప చేర్పు.
 

click me!