ఈఎంఐ ల రూపంలో నైనా నెలకు కొంత మానవత్వాన్ని పంచుదాం అంటూ జహీరాబాద్ నుండి ఈ. వెంకటేష్ రాసిన కవిత : పరుగు ఇక్కడ చదవండి :
పద్మవ్యూహం లాంటి
జీవనచక్ర భ్రమరంలో
అస్పష్ట వేకువ కలల మధ్య
అదృష్టాన్ని ఆవాహన చేసుకోవాలని!
పదిమందిని తొక్కి అయినా
జీవితపు మెట్లను
ఆసరా లేని కర్ర కాళ్లతో
ఎండమావి లాంటి
మార్కెట్ మాయాజాలం నుండి
జీవితాన్ని డిస్కౌంట్ లో
అమ్మాలని చూసే
మల్టీ నేషనల్ మహమ్మారిలు!
ఈఎంఐ ల రూపంలో నైనా
నెలకు కొంత మానవత్వాన్ని పంచుదాం
మాయమైపోతున్న
మానవ సంబంధాలను
5జి సాక్షిగా సంబరాలు చేసుకుందాం!
ఆపిల్ ఫోన్ ఉందా?
కారు ఉందా?
పెద్ద బిల్డింగ్ ఉందా?
బ్యాంకు బ్యాలెన్స్ ఉందా?
అయితే నీవు మహాత్ముడివి
ఆధునిక మార్కెట్
జాతిపితవు నువ్వే!