నిశి నీడలు కరిగిపోయే శశి జాడలు వెలుగులీనాలి అంటూ సిద్దిపేట్ జిల్లా మాచాపూర్ గ్రామం నుండి బొప్పెన వెంకటేష్ రాసిన కవిత " శశి జాడలు " ఇక్కడ చదవండి.
అల్లంత దూరంలో హర్మ్యాల అంతరంలో
ఎదిగి ఒదిగిన వెలుగుల చుక్కల కోసం
చీకటి అంటిన జీవితాలు
దీపాలు లేని ఇళ్ల దీనతలో
కష్టాలు కలతల నుంచి కదలాడుతుంటే
ఊర్థ్వముఖంగా ఊపిరి
దీపంలా మెలగాలని ఊసుపోతాయి
అమావాస్యతో సావాసం
సాగించలేక ప్రాణం నుసిలా వాడిపోతుంది
వెంట వస్తున్న ఈదురు గాలిని
ఈడ్చుకొని నిలబడే దేహాలే
రేపటి ఆశా దీపాలవుతాయి
చీకటి రాజ్యాన్ని దేదీప్యమానం చేస్తాయి
ఏ గాలివేటుకో తూరుపు ముఖం పట్టకుండా
వెలుగులు పంచే ప్రేమ ఆరని దోసిలి పట్టాలి
అందనంత దూరంలో ఉన్న
ఆకాశ దీపపు వెలుతురు
అవని అంతా కురిసి
మట్టి శ్వాసలు మణి కాంతులై మెరవాలి
అందరి జీవితాలు తారల్లే విరియాలి
నిశి నీడలు కరిగిపోయే
శశి జాడలు వెలుగులీనాలి