బెల్లంకొండ సంపత్ కుమార్ కవిత : పైశాచికుడా !

By Arun Kumar P  |  First Published Jul 16, 2023, 11:30 AM IST

భావచలన బుల్డోజర్లు నడవాలే భవిష్యత్తు బుల్డోజర్లు నడవాలే! అంటూ బెల్లంకొండ సంపత్ కుమార్ రాసిన కవిత  ' పైశాచికుడా ! ' ఇక్కడ చదవండి : 


పశువులైనా 
చోటు చూసుకొని విసర్జిస్తాయి
హీనసంస్కారి !
నీ రక్తం నిండా ఎన్ని కలుషాలున్నాయి !
నరనరానా ఎంత కొవ్వు పేరుకున్నది ?
వికృత జయాంట్‌వి
నీతోనేంసోపతి?

నేల గంధం తీసిన 
భూమి పుత్రులు
పొల్లంత ఎగ బోసి 
తిండి గింజలు ఊడ్చిపెట్టిన 
నేల వారసులు 
ఈ కప్పల తక్కెడ చిక్కు ఆటల
సర్వం కోల్పోయిన ధర్మ పాదులు
ఎం మిగిలాయని
రెక్కలే రెండు

Latest Videos

కష్టం విలువ తెలిసినోనివా !
సంసారం ఎల్లబోసిన తెలివా !
ఆవారా! ఏ మనిషివీ
కలిమిలేమి కన్నీళ్లు కానినోనివా !

మనిషి మీదనా !
నీ అసభ్యత మీద చెయ్యాలె 
నీ అకృత్యం మీద చెయ్యాలె 
నీ మీద చెయ్యాలె 
బహిర్మలినాలు బాగుంటుందా !

ఎవరికన్నాఎక్కువ కాకపోవచ్చు
నీకన్నా తక్కువేం కాదు
పైశాచికుడా !
నీతో సమానమెట్లా !

పల్లేర్లు కుమ్మేముళ్ళు 
గాజు పెంకులు 
తుప్పు కీకారణ్యాలు
అడ్డుదిడ్డంగా మొలచిన 
కలుపు మోళ్లు పెకిలించాలె 
బుల్డోజర్లు నడవాలె 
భావచలన బుల్డోజర్లు నడవాలే 
భవిష్యత్తు బుల్డోజర్లు నడవాలే!

click me!