సద్దు మనిగిందనుకోకు పొద్దు వాలే లోపు ఎప్పుడైనా లేస్తుంది జాతిని జాగృతం చేసే నినాదమొకటి! అంటూ కరీంనగర్ నుండి కె ఎస్ అనంతాచార్య రాసిన కవిత ' అలికిడి!! ' ఇక్కడ చదవండి :
ఎక్కడి నుంచి వచ్చిందో శబ్దం
ఒక్కసారిగా మెదడుచుట్టూ వలయమై చుట్టుకుని
కొన్ని కువ కువల గొంతుల మొగ్గలు విప్పుకున్నాయి!
హృదయాన్ని తాకిన సవ్వడి
కవాటాలు దాటి
ఉద్వేగ తుఫాన్ను సృష్టించి
బడబాగ్ని రవ్వలు లేపింది !
కిటికీలోంచి వచ్చిన కొండ గాలి
తనువును తాకి ప్రేమగా రూపొంది
కొండలు కోనలమీద నుండి
వాగులు, వంకలు దాటిన జావళియై
నదిలోని తెరచాప మీద సంగీతం వినిపిస్తుంది!
అది నాదమే
ఆరంభం శివుని ఢమరుకం అయినా
అర్వాచీన ఆలోచనల పెదవులమీద వేద భాషణం!
ఆ మోత ఇంతా అంతా కాదు
రాసే లేఖకుడి పద్దు పుస్తకం మీది తీర్చ లేని బాకీ అంత!
గుట్టు తెలిసిన రవళి
రెండు ధోరిణుల నాలుక మీద నుండి ఊడి పోయిన
ముసలి అమ్మ వృద్ధాశ్రమపు గోడు
అలికిడి ఒకటి వాకిట్లో నిలిచి
నీలోని పోలికల్ని రూపు మాపి
నీ బంగ్లా మీద సంతృప్తి జెండా యెగురేయమంది!
సద్దు మనిగిందనుకోకు
పొద్దు వాలే లోపు ఎప్పుడైనా లేస్తుంది
జాతిని జాగృతం చేసే నినాదమొకటి!
నీరెండను చూసి చలి కాచుకోకు
బతుకు మూల్యాలను
అంగట్లో తాకట్టు పెట్టకు!
రాళ్లు రాపాడించి పుట్టించిన నిప్పులా
నిశ్శబ్దాన్ని భేదించి
జయధ్వనుల పదకోశపు
నిఘంటువు అవుతుంది శబ్ధం!