తట్టుకోని మనస్సంద్రం వెల్లువలా వచ్చే అక్షరాల క్షణికభావావేశం అంటూ డా.చీదెళ్ళ సీతాలక్ష్మి రాసిన కవిత ' ఆనందార్ణవం ' ఇక్కడ చదవండి :
ఉప్పొంగే భావాలు
ఎగసిపడే ఆలోచనా తరంగాలు
తీరం తాకే కలల అలలు!!
అంతరాన దాగిన
సద్భావనా
మేలిమి ముత్యాలు
తిమింగలాల, మొసళ్ళ స్వార్థం నిండిన
భయంకర జీవనసంద్రం వాతావరణంలో
ఎదిరించి పోరాడి గెలిచే అల్పజీవుల విజయ భేరీ!!
మంచిచెడులు కష్టనష్టాలు
ఎన్నో ఆటుపోట్లు
ఎదలో దాగిన బడబానలం
ఎగసిపడే బాధల మంటలు!!
అన్యాయంగా బలై పోతున్న అమాయక జీవులు
ఒక్కసారే ఉప్పొంగే ఉప్పెన
ఎగసిపడే భావ వీచికలు!
అంతా అల్లకల్లోకం
ముంచేసే ప్రమాదం
గాలి వాటంలో కొట్టుకుపోయే
అనాథల ఆక్రందనలు
తట్టుకోని మనస్సంద్రం
వెల్లువలా వచ్చే అక్షరాల క్షణికభావావేశం
చెడుపై సమరమే!!
ఎన్నో భావాలకు ఆలవాలమైనా
ప్రశాంతంగా గంభీరంగా నిలకడగా
వుండే మది ఆనందార్ణవం!!