అమ్మంగి వేణుగోపాల్ కవిత :  మారువేషంలో కొత్త సంవత్సరం

By Arun Kumar PFirst Published Jan 14, 2024, 8:29 AM IST
Highlights

మాదకద్రవ్యాల మాఫియా సృష్టిస్తున్న మాయ నుండి  యువతరాన్ని కాపాడుకునేదెట్లా ? అంటూ ఆందోళన చెందుతూ కాళోజీ పురస్కార గ్రహీత అమ్మంగి వేణుగోపాల్ రాసిన కవిత  ' మారువేషంలో కొత్త సంవత్సరం' ఇక్కడ చదవండి : 

2024 - కాలఖండం మీద ఒక ఊహా రేఖ
' హ్యాపీ న్యూ ఇయర్ '
మనకు మనం రాసుకునే ప్రేమ లేఖ
కోలాహలం నడుమ హాలాహలం బుస్సుమంటున్న వేళ
కళ్ళు బైర్లు కమ్మే కాంతిలో
చెవులు చిల్లులుపడే దుశ్శబ్దంలో
మ మ ... మాస్ మహాసందడిలో
కొత్త సంవత్సరం వచ్చేసిందన్న పుకారు
విశ్వవ్యాప్తమవుతుంది, అంతే
స్టెప్పులు గతి తప్పుతాయి 
పాటలు శ్రుతి తప్పుతాయి
ఆశలు ఆశయాలు ఎప్పుడూ ఉండేవే అయినా
పాత కథే మళ్ళీ మొదలవుతుంది కొత్తగా
ఫేక్ నోట్లు జాలీగా చూస్తుండగా
వ్యాపారాలు, వ్యవహారాలు సాగుతాయి జోరుగా
మనిషికన్నా  పెద్దదైపోయిన నీడ
చీకటి బజారును శాసిస్తుంది
కొంత సహజంగా ఎంతో కృతిమంగా
చైనా మాంజాతో ఎగురుతున్న మన పతంగిలా
కొత్త సంవత్సరం - మత్తులో తేలి తూలియాడుతుంది
శిథిల దేవాలయం పక్కన
గంజాయి దమ్ముకొడుతున్న బైరాగి
' ఏమి జన్మము ఏమి జన్మంబో ' అంటూ
తత్వం అందుకుంటాడు
ఇక్కడ పోలీసు లాకప్పులో
కలా మెలకువ ఒక్కటైన అద్వైతంలో
' దమ్ మారో దమ్ - మిట్ జాయె హమ్ ' అంటూ
ఆత్మహత్యా గీతాన్ని పలవరిస్తున్నాడు యువకుడు
ఒక్క నిషేధ ద్వారాన్ని మూసేస్తే
వెయ్యి ప్రవేశ ద్వారాలు తెరుచుకుంటున్నపుడు
మాదకద్రవ్యాల మాఫియా సృష్టించిన మాయ నుండి
యువతరాన్ని కాపాడుకునేదెట్లా ?

click me!