హెర్నియా ఆపరేషన్ అయి 15 రోజులు గడిచినా తొలగని నొప్పితో బాధపడుతూ డా.చీదెళ్ళ సీతాలక్ష్మి రాసిన కవిత ' పోస్ట్ సర్జరీ ' ఇక్కడ చదవండి :
అవును
నరకం ఎక్కడో లేదు
మనలోనే
మనకళ్లముందే
కాయానికి గాయం అయితేనో
మనసుకు భయం ఆవరిస్తేనో
ఏ సాయం అందకుంటేనో
ఇక్కడే ఇప్పుడే
మన కళ్ళ ముందే
బతికున్నప్పుడే!!
భరించలేని బాధ
ఎవరికి వారే అనుభవించాలి
పంచేది కాదు
పంచుకునేది కాదు
తాతలు ఇచ్చిన ఆస్తికాదు
చెప్పుకుంటే వచ్చేది లేదు
చెప్పకుంటే పోయేది లేదు
శారీరక బాధ
మానసిక వ్యధ!!
undefined
ఉదరానికి ఇరువైపులా గుచ్చిన ప్లాస్టిక్ పైపులు ద్వారపాలకుల్లా
డ్రైన్ చిప్పకు తగిలించి...
దినదినం మృత్యుకుహరంలోకి వెళ్లినట్లు
మెలికలు తిరిగే బాధ
ప్రాణం వాయిదా పధ్ధతిలో పోతున్నట్లు
తీరని సలపరం
ఇక్కడ
ఎవరి బాధ వారిదే
బాధల బదిలీ ఉండదు
యాంత్రికమైన
సానుభూతి తప్ప!!
కొన్ని యాపిళ్ళు
కొన్ని ద్రాక్షలు
కొన్ని సంత్రా పళ్ళు
తమ సానుభూతిని తెలియపరిచి చల్లగా జారుకుంటాయి!!
మళ్ళీ షరా మామూలే
సానుభూతి వాక్యాలతో
ఉపశమించిన నొప్పి
తిరిగి తన పంజా విసురుతుంది
ధైర్యం క్రమక్రమంగా సడలుతున్నప్పుడు
నాలోకి నేను ప్రవహిస్తూ
అంతర్ముఖినై నాలో నేను
ఒక నిశ్శబ్ద దుఃఖగీతం పాడుకుంటాను
నా బాధల్ని పంటికింద అదిమిపడుతూ
ఒంటరి పోరాటం చేస్తూ
నరకపు అంచుల్ని తాకి వస్తూంటాను!!
నా బాధలు ఎవరిక్కావాలి
తస్కరించేది లేదు
తన్నుకుపోయేది లేదు
ఇంకా ఎంతకాలమో
ఈ సుళ్ళు తిరిగే ప్రత్యక్ష నరకం
బాధ బడబానలమై శరీర సంద్రాన్ని తోడేస్తుంటే
బలహీనమైన మనసుపై
కాసింత సానుభూతిని కుమ్మరించిన వారంతా
ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తారు
ఎవరి దారి వారిది
ఎవరి ప్రపంచం వారిది!!
యమలోకం
నరకలోకం అంటూ వినడమే
ఇప్పుడు
ప్రత్యక్షానుభవం
కర్మఫలం అనుభవించక తప్పదు మరి!!
గాయమైన కాయానికి
కాలం కట్టుకడుతుందనీ
దుఃఖపు తడి వీడి
సంతోషాల జల్లు నన్ను కమ్ముకుటుందని
ఆశావహ దృక్పథంతో
నాలోని సగం నా హృదయం తలువు తడుతుంది.