నేనేమో నా ఇంట్లోనే పరాయితనాన్ని చాపలా పరుచుకుని భయం భయంగా నక్కి నక్కి కాల్రెక్కలు ముడుచుకుని కూర్చున్నా అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత "నేనూ- నా ఇల్లూ " ఇక్కడ చదవండి :
ఇంటి ముందు వాకిలి లేదు
వెనకాల పెరడూ లేదు
నాలుగు గోడల నడుమ స్థలానికి
పునాదుల్లేవు
తలెత్తి చూస్తే పై కప్పూ నాది కాదు
దేనికీ ఎలాంటి హామీ లేదు
ఇంట్లో గాలి ఆడదు
అంతా వై ఫై పరుచుకుని వుంటుంది
అందరూ ఎవరి గదుల్లో వాళ్ళుంటారు
ఆశలు తిరుగుతూ వుంటాయి
కోరికలు కేరింతలు కొడుతూ వుంటాయి
అందరి నడుమా
మౌనం వేలాడుతూ వుంటుంది
గోడలకు మాటలు ఉరి పోసుకుంటాయి
అలారం మోతల్లాగా
సెల్లులు మోగుతూ వుంటాయి
వాట్స్ అప్ పలకరింపులూ
ఇన్ స్టాగ్రామ్ పోస్టులు మెరుస్తూ వుంటాయి
యు ట్యూబులూ, ఓ టి టి లు నాట్యమాడుతూనే వుంటాయి
‘నగరం’ నా ఇంట్లోకి చొచ్చుకొచ్చింది
వస్తూ వస్తూ
ప్రపంచాన్ని తన పిడికిట్లో బిగించి
నట్టింట్లో కుప్ప బోసింది
నేనేమో నా ఇంట్లోనే
పరాయితనాన్ని చాపలా పరుచుకుని
భయం భయంగా నక్కి నక్కి
ఓ మూలన
కాల్రెక్కలు ముడుచుకుని కూర్చున్నా