మాట మసిచేసే శక్తి మనుషుల నడుమ తచ్చాడుతే నిప్పులేకుండా మాటలు మంటలనే పుట్టిస్తాయి అంటూ డా॥ కొండపల్లి నీహారిణి రాసిన కవిత " మాటల నిప్పులు " ఇక్కడ చదవండి :
వాచ్యాగ్ని అంటుకున్న నాలుక
కాల్చే సందర్భం చెవులకు సంచులు కట్టి
కర్ణపేయం నుండి కఠోరానికి దారయ్యి
మనల్నో ఆలోచనాడవి పాలచేసి
లోచనాలు తడిపేస్తుంటవి
గుండె గుండెకో ప్రశ్న సంధించి
మనిషి ప్రకృతికి మరో వేట అవుతుంటవి
ఏవి నీలోని చీకట్లను పోగొట్టవో
ఏవి నీలోని చెలిమి సువాసనలు వెదజల్లవో
త్యజించని లోభ ముద్రను
తరాజు వస్తువులుగ చేస్తుంది
ఈ తూకాలలో బాటువు నీవయ్యి
పొరబాటువూ నీవయ్యి
దారి మరచిన జగతిని నీది చేస్తుంది
కొడగట్టిన దీపంలా
చమురుపాల్జేసి అభాండాలన్నీ
నీ మరుపు భాండాగారం లో వేస్తుంది
ఎందుకంటే ...
ఎందుకంటే
తప్పుల తక్కెడ కథలో
తప్పించుకోలేని ప్రధాన పాత్ర నీవైనప్పుడు
వేరుపురుగు సామెతలో
వృక్షానివీ బీజానివీ నీవేనన్న
మాట మసిచేసే శకైతే మనుషుల నడుమ తచ్చాడే కనిపించని దుర్మార్గం దృశ్యం తాలూకు వాసనవేస్తున్నప్పుడు
నిప్పులేకుండా
మాటలు మంటలనే పుట్టిస్తాయి
అడ్డుగోడలు అపనమ్మకాలు
అంతో ఇంతో ఎగదోస్తుంటాయి