కాలం భ్రమ కాదు మహా చక్ర భ్రమణ ప్రయాణం అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత " కరిగిన ఘడియలన్నీ " ఇక్కడ చదవండి :
జీవితం నడుస్తున్నది
మనిషిలో మూడ్ లా
కాల ప్రవహం సాగుతున్నది
గతమంతా చరిత్రలో ఒదిగిపోతూ
నిద్ర ఎరుగని కాలం
ఎవ్వరిని ఎప్పుడు ఎక్కడ ఎలా
వీడుతుందో మనకు తెలియదు
కాలం చరిత్రగా మారడంతోనే
తిరిగిన కాలం బతుకుతుంది
యాదిగా కలకాలం
ఎల్లకాలం ముందుకు పరుగుదీసేదే
కాల జ్ఞానంలోని మర్మం
కాలంలో
కరిగిన ఘడియలన్నీ
చరిత్రలో బతుకు వెలుగులై
చరిత్ర అంటే
గతానికి అద్దం కదా మరి
గతంలోని సంగతులన్నీ
ఘనీభవించిన గొప్ప యాది పొది
జరిగిన విషయాలు విప్పే పొత్తమే కాలం
ఇప్పుడు నడుస్తున్నది
వర్తమానంలో సంగీత విభావరి
రేపటి గాలి గలగలల గొంతు పాట
నిన్నటి కరిగిన కలలన్నీ చరిత్ర తోటే
ఆశలు ఎప్పుడూ పూల పరిమళ వీచికలే
ఊహలు ఏనాటికీ గుసగుసలే....
కాలంలో
నిన్న నేడు రేపు దశలు పరస్పరం పల్లవించే
ఐక్యతా రాగంలోని సంగీత ఝరులు
ఆకులుగా
చిగురులై పండినవై ఎండినవై ఎదిగే
శిశిరాల వసంతోదయ కావ్య తరులు
కాలం భ్రమ కాదు
మహా చక్ర భ్రమణ ప్రయాణం
జీవకోటి ఉద్వేగ వృత్తంలో
చలన సంచలనాల ఉద్విగ్నయానం
గాయాల గేయాలు రాసే కవి గుండెలో
నిరంతరం సాగే ఏకీకృత కాలరేఖ