రమేశ్ కార్తీక్ నాయక్ కవిత : కాగితం మీది జీవితం

By Arun Kumar P  |  First Published Apr 21, 2023, 11:49 AM IST

ఏదో రాద్దామని మదనపడుతూ దేహంలోని రక్తాన్ని సిరాగా మార్చుకుందామని గాయం చేసుకుంటే అది కూడా  తెల్లగానే ఉంది అంటూ రమేశ్ కార్తీక్ నాయక్  రాసిన కవిత  '  కాగితం మీది జీవితం ' ఇక్కడ చదవండి : 


కాగితం మీద
బరువు లేని కలల మధ్య
నేను నిద్ర మేలుకోవాలని
కలలు కంటుంటాను

అనుకున్నట్లే
ఒకరోజు కలల మధ్య మేలుకున్నాను
కాలి కింద పొడవాటి తెల్ల కాగితం
కాగితం మధ్యలో
పాలరాతి శిలలా నిల్చుని
నేను పారేసుకున్న
నా చూపును దూరం నుండే వెతుక్కుంటున్నాను

Latest Videos

కాగితం మీద తెల్ల రంగు నదిలా పారుతుంటే
ఆ నీళ్లలో వేలకోట్ల చిరునామాలు చేపల్లా ఈదులాడుతున్నాయి
నా మది దర్శించిన దృశ్యాలకు
 నా జాడను చెప్పమని వాటితో వేడుకున్నాను

కాళ్లు నొప్పులేసి
కళ్ళు చెమ్మగిల్లిన ప్రతీసారి
కళ్ళు మూసి తెరిస్తే
తెల్లని నెమ్మళ్లు కాగితం మీదుగా సంచరిస్తున్నట్లు కనిపించాయి
అవి తము కోల్పోయిన రంగుల కోసం వెతుక్కుంటున్నాయి కాబోలు

కదలలేను వదలలేను
ఉన్నచోటే ఉంటూ మేధావిలా
కాలికింది కాగితం మీద
ఏదో రాద్దామని మదనపడుతూ 
దేహంలోని రక్తాన్ని సిరాగా మార్చుకుందామని 
గాయం చేసుకుంటే
అది కూడా  తెల్లగానే ఉంది.

నిల్చున్న చోటే కూర్చుని కాగితాన్ని తడిమాను
కాగితం కింద ఇంకో ప్రపంచం ఉన్నట్లుంది

ఎవరున్నారో,
వాళ్లు ఏ రంగులో ఉన్నారో
వాళ్లు నాలా పుస్తకం, కలం పట్టుకు తిరిగే వాళ్ళు కాకపోయి ఉండొచ్చు
లేకుంటే ఉన్న ప్రపంచం నుండి నాలా ఎలా ఒంటరి అవుతారు 
అక్షరాల్లోని ఒంటరితనం నా చుట్టూ శూన్యంలా తోచింది 

కాగితం కింది ప్రపంచంలో
అరుపులు, ఏడ్పులు,
వెర్రి నవ్వులు ఉన్నట్లున్నాయి
అవన్నీ నా లోపల వినిపించి మాయమైపోతున్నాయి

రోజులు గడుస్తున్నా
నేను మాత్రం కాగితం మీదే ఉన్నాను
రోజురోజుకీ దేహం మీద బూజు పట్టడం ఎక్కువైంది

తల పైన తెల్లని మేఘాలు నిండిన ఆకాశం
పగలు లేదు రాత్రి లేదు
హఠాత్తుగా కాలి కింద అప్పుడే గందరగోళం, 
అప్పుడే నిశ్శబ్దం.

 కాగితానికి ఉన్న నాలుగు వైపులా
నాలుగు దృశ్యాలు.

దృశ్యం : 1
తెల్లని పొగలు మెలికలు తిరుగుతూ పైకి లేస్తున్నాయి
బహుశా ఆకలి చావులతో చచ్చిన వాళ్ళ కడుపులో మంటలు అనుకుంటాను

దృశ్యం : 2
ఆదివాసి గిరిజనులనుకుంటాను
ఆకాశంలోని మేఘాలన్ని కిందికి లాగడానికి వారు బాణాలను వేస్తున్నారు.

దృశ్యం : 3
అలల్లాంటి కొండలు అనుకుంటాను
వాటి మీద నిలబడి రెక్కలు ఉన్న దూతలు, తమ రెక్కల్ని  నరుకుంటున్నారు.

దృశ్యం : 4
అటు ఎటువంటి దృశ్యం కనిపించలేదు
నాకు తెలియకుండానే నా కాళ్లు అటుగా కదిలాయి 
కాగితం అంచున చేరుకున్నాను 
అక్కడ అన్ని తెల్లని బట్టల్లో చుట్టిన శవాలు
వాళ్లందరూ కవులు రచయితలు అయ్యుంటారు

ఏమిటో ఈ కాగితం మీది జీవితం
అంతా కాగితంలానే ఉంది
ఈ కాగితపు ఆధ్యాత్మికతను వివరించేవారు ఎవరైనా ఉంటే బాగుండు 

బహుశా 
ఈ తెల్ల కాగితాన్ని రంగులతో నింపుకోవడానికి
గొంగళి పురుగులా తెల్లబోయిన ముఖంతో వేచి ఉండాలేమో ఇప్పుడు.
 

click me!