డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : కొత్త గాలి

By Arun Kumar P  |  First Published Apr 20, 2023, 10:18 AM IST

కొత్త గాలి వచ్చింది ఆమ్లజనిని మోసుకొచ్చింది అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత  '  కొత్త గాలి ' ఇక్కడ చదవండి : 
 


గాలి తెరలు తెరలుగా వీస్తుంది
గలగల రాగాల తీస్తూ
ఆకాశం అంచుల అల్లుకుంది
ఒక్కొక్కసారి కస్సుమంది మెత్తని కత్తిలా  
గాలిచేసే గాయాలనూ ఆకాశం దాచుకుంది భద్రంగా ప్రేమతో
కానీ,
నేలతల్లి ముక్కుపుటాలనే  ఓర్చుకోలేనంతగా బాధించే
గాలి మోసుకొచ్చే చెడు వాసన

వస్తున్న గాలి పాతదే మిత్రమా!
ఓ సనుగుడు మాట
తప్పదు భరించాలన్న చూపుల గుసగుసలు  
ఆరోగ్యాన్ని బలిదీసుకునే
విష కాలుష్య గాలి ఇంకెంత కాలం?!
ఈ స్వీయ ప్రశ్నకు 
ఓ మంచి ఆలోచన వెలిగింది  
ఆరోగ్యం ప్రాముఖ్యత తెలిసింది కాబోలు!రాగమాలకు
పరిశుభ్రత పాకులాడి పారాడింది మనసంతా 
చుట్టు ముట్టూ ఇరుగు పొరుగుకు శుభ్రతపై 
ధ్యాస మర్లింది మట్టికి ఉడుం పట్టులా 

Latest Videos

కొత్త గాలి వచ్చింది పిలుపుపై  
ఆమ్లజనిని మోసుకొచ్చింది  
ఊపిరిలో ఊపిరిగా ఆకాశం పాట రాగమైంది
ఆరోగ్యం,ఆనందం పూలై పూసే   
పచ్చ పచ్చని పొలాలుగా
కాలుష్యం కోరలు విరిచిన
పర్యావరణ వాకిలి మెరిసింది 
ఆకాశంలో దీపమై 
పట్టరాని సంతోషంతో ఆడిందీ నేల  గంతులేస్తూ

 

click me!