
రోజంతా నీతో అలా
మాట్లాడుతూనే ఉంటాను
ఇది అది అని కాదు
మనసునుండి ఉబికి వస్తున్న
ప్రతి మాటను నీతో మాట్లాడుతుంటాను
రాత్రి పొద్దు పోయేదాకా
పగలు రాత్రయ్యే దాకా
మనల్ని విడువని సంభాషణలు
అవన్నీ నీకు గుర్తుంటున్నాయా
ఒక్కసారైనా వాటిని తిరిగి చెప్పవూ
ఎలా నమ్మేది నిన్ను
వింటూనే మాట్లాడడం నీ బలమైతే
తడుముకోకుండా మాటల ఊటనై
నీ దగ్గర ప్రవహించడమే నా ఉనికి
సువిశాలమైన ఈ అక్షర క్షేత్రంలో
మనది ఆవిశ్రాంత గమనం..!