డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి కవిత : ఇంటిముందు కల్పవృక్షం

By Arun Kumar P  |  First Published May 4, 2023, 11:50 AM IST

ఎండాకాలం ఎండనుండి వానాకాలంలో ఎదిగి గొడుగై కాపాడే  రక్షణ కవచం!! అంటూ డా.చీదెళ్ళ  సీతాలక్ష్మి రాసిన కవిత  ' ఇంటిముందు కల్పవృక్షం ' ఇక్కడ చదవండి : 


ఆకులన్నీ రాలి మోడువారినా
తనువంతా చెమ్మదనంతో 
నూతనత్వాన్ని సంతరించుకుని 
ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న  లేత ఆకులతో 
పచ్చదనాన్ని నింపుకుని
కొత్తదనాన్ని సంతరించుకుని 
రెమ్మలతో  విస్తరించి 
స్వచ్ఛంగా మెరిసి మురిసిపోతూ
నవ వధువులా 
మా ఇంటి ముందు విరాజిల్లుతున్న  గానుగు వృక్షం!!

కాకులు  పిచ్చుకలకు గూడును ఇస్తూ
వచ్చిపోయే బాటసారులకు సేదతీరుస్తూ 
రెండు చక్రాలు నాలుగు చక్రాలు నిలబెట్టే ఆవాస స్థానం
ఎండాకాలం ఎండనుండి
వానాకాలంలో ఎదిగి గొడుగై
కాపాడే  రక్షణ కవచం!!

Latest Videos

తలస్నానం చేసి నిండు ముత్తైదువలా దీవెనలిస్తూ
శాఖోపశాఖలుగా విస్తరించి 
గాలికి ఊగి నాట్యం చేస్తూ 
ఆనందంగా ఆడే నాట్యమయూరి!!

పక్షుల కిలకిలా రావాలతో కాకుల అరుపులతో 
పరవశించి తలలూపుతూ 
ఉడుత తన మీద పాకగా
తల్లిలా సంతసిస్తూ తరించిపోయే తరువు!!

వంగపూవు రంగుతో చిన్ని చిన్ని పూలు భూమాత ఒడి చేరి
ఎండిపోయి రాలితే వడ్లపొట్టులా కనువిందు చేస్తూ
కాయలు రాలిన వేళ 
తన జీవితమంతా పరోపకారంతో
ఊగిపోయే త్యాగమయి అనురాగమయి
మాఇంటి ముందు కాపలా కాస్తున్న 
సంజీవని
రక్షణ ఛత్రము
దివ్య వృక్షధామము.....

click me!