మల్యాల మనోహరరావు 'వెలుగు రవ్వలు' పుస్తకావిష్కరణ

By Arun Kumar P  |  First Published May 4, 2023, 11:45 AM IST

ప్రముఖ రచయిత మల్యాల మనోహరరావు కవితల సంపుటి 'వెలుగు రవ్వలు' పుస్తకాన్ని నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆవిష్కరించారు. 


వరంగల్ : సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆద్వర్యంలో హన్మంకొండలోని హోటల్ హరిత కాకతీయలో మల్యాల మనోహర్ రావు కవితా సంపుటి ఆవిష్కరణ మహోత్సవం  జరిగింది. ఈ కార్యక్రమంలో నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ పెండ్యాల శ్రీ కృష్ణదేవరావు ముఖ్య అతిధిగా హాజరై  పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కృష్ణదేవరాయ మాట్లాడుతూ... నేడు ప్రజాస్వామ్య పరిరక్షణలో న్యాయ స్థానాలు, కవులు, రచయితలు, మరియు ప్రశ్నించే గొంతుకల పాత్ర ఎంత ఉందో వివరించారు.  మనోహర్ రావు  వ్రాసిన కవితా సంపుటిలోని దాదాపు అన్ని కవితలు సమాజ హితాన్ని కాంక్షించే రీతిలో ఉన్నాయని అన్నారు. మనోహర్ రావు సామజిక రుగ్మతలపైననే గాక మానవీయ విలువలపై, అధికార దుర్వినియోగంపై, మానవ హక్కుల ఉల్లంఘనపై తన అభిప్రాయాలను సూటిగా, నిక్కచ్చిగా కవితా రూపంలో వ్యక్తపరిచారని అన్నారు. మన రాజ్యాంగంలో పొందు పరచిన సమానత్వాన్ని సమసమాజాన్ని పరిరక్షించే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను, బడుగు బలహీన వర్గాల అణచివేతను నిరసిస్తూ కవులు, రచయితలు తమ రచనలు చేయాలని శ్రీకృష్ణదేవరావు పిలుపునిచ్చారు. 

Latest Videos

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న బన్నా అయిలయ్య మాట్లాడుతూ...  మల్యాల మనోహర్ రావు  'వెలుగు రవ్వలు' ప్రజాస్వామ్య కవిత్వం అని కొనియాడారు. ప్రజాస్వామ్యం బలోపేతం కావడానికి ప్రతి వ్యక్తి ప్రాధమికంగా అనుసరించాల్సిన అంశాలు మల్యాల మనోహర్ రావు  కవితలలో ప్రతిబింబించాయని అన్నారు. 

ఈ కార్యక్రమానికి  సాహితీవేత్త  గన్నమరాజు గిరిజ మనోహర్ బాబు అధ్యక్షత వహించగా  మెట్టు మురళీధర్  పుస్తక పరిచయం చేసారు. ఈ కార్యక్రమంలో నాగిళ్ల రామశాస్త్రి, ఘంటా రామి రెడ్డి, ప్రముఖ కవులు పొట్లపల్లి శ్రీనివాసరావు, కాంచనాపల్లి రాజేందర్ రాజు, అన్వర్ పాల్గొని కవి మల్యాల మనోహర్ రావును అభినందించారు. కవి ఈ కవితా సంపుటిని తన శ్రీమతి అయిన మల్యాల మాధవికి అంకితమిచ్చారు.
 

click me!