అయిల సైదాచారిపై సిద్ధార్థ : నిస్సంగ కవి

By SumaBala Bukka  |  First Published May 4, 2023, 11:33 AM IST

వొక మంచి కవి లోకం నుంచి నిష్క్రమిస్తే.. ఎవరు దుఃఖపడతారు? ఎవరు నష్టపోతారు? ఎవరికి ఎక్కువ శోకం మిగులుతుంది? 


Poetry(real poetry) is like that; you can sense it, you can feel it in the air, the way they say certain highly attuned animals(snakes) worms, rats and some birds can detect an earth quake. 

- Robert Bolano (The Savage Detectives లోంచి) 

Latest Videos

వొక మంచి కవి లోకం నుంచి నిష్క్రమిస్తే.. ఎవరు దుఃఖపడతారు? ఎవరు నష్టపోతారు? ఎవరికి ఎక్కువ శోకం మిగులుతుంది? 

కుటుంబసభ్యులకు తప్ప ఇంకెవరిని ఆ బాధ వెంటాడుతుందీ... అని అందరం జవాబు ఇచ్చుకుంటాం.. అంతేనా.. ఇంకేం 
కాదా, ఇంకేమీ జరగవా... చనిపోయిన మన ముందుతరం కవుల చావులు మనం చూడకపోయినా వ్యక్తిగతంగా వాళ్ళతో సహచరించకపోయినా ఇప్పటికీ వాళ్ళను గుర్తుచేసుకుంటూ లోపల్లోపల ఏడుపు మంటను రహస్యంగా మింగుతూనే వుంటాం కదా వాళ్ళను తలుచుకుంటూ వుంటున్నప్పుడు.. వాళ్ళ జీవ నిర్జీవదేహాలు వేల వేల వాక్యాల అక్షరాల నడుమ నిలబడి మనతో.. సంగతులు చెస్తున్నట్టే వుంటుంది కదా... కవుల మృత్యుప్రవాహంలో ఈత రాటుతూ, వాళ్ళ అక్షరాలతో సత్సంగం చేస్తూ కలిగే పరానుభవస్థితిని వొడిశిపట్టుకునేవారెవరూ...ఇంకెవరూ.. అనుకుంటే... పాఠకుడే కదా అని తెలిసొస్తుంది. 

ఆ మాటకొస్తే... అపమృత్యువు కవికే కాదు.. ఆ అనుభవం.. అతడ్ని ఇష్టంగా చదివే పాఠకులకు కూడా వుంటుంది. మృత్యు తాండవ స్థితి ఇంటి గడపలోపలికి వచ్చి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది ఎక్కడా.. ఎప్పుడూ.. అంతం కాదు. ఆ కవిని ఇష్టంగా చదివే పాఠకుడు ఎక్కువగా ఒంటరివాడయిపోతాడు. నాకు ఇష్టమైన కవి సైదాచారి. నా వంటి అతని కవిత్వ పాఠకుల్ని అటువంటి దుఃఖానికే గురిచేసి పోయాడు. 

మంచి కవికి కొలమానం.. అతడిని చదివే పాఠకుల సంఖ్యనుబట్టి వుంటుందనుకోను. అతడిని చదివే ఒక్క రెండు, మూడు పాఠకుల సంఖ్యకూడా లక్షలమందితో సమానమే. వంపుకొని, వొక నిర్వాణస్థితికి చేరుకొని, తనను తనలోకి చెక్కు కొని, నీరై ప్రవహిస్తూ పోతాడు. మన రక్తమాంసాల సాల్లల్లో వొరుసుకుంటూ పోతాడు. పాఠకుడు వొక ఉత్తమ అనుభవంలోకి కళ్ళు తెరుస్తాడు. సైదాచారి కవిగా అటువంటి కవిత్వాన్ని రాయగలిగాడు. తన కవిత్వాన్ని మనకు వదిలి తను కాస్మిక్ లోకపుటంచుల విహారానికై బయలుదేరాడు. 

“సంత ముగిసిందిలే" అని చలంగారిలా... అతనికిష్టమయిన బాణీని స్వరపరుచుకొని “సందె మసకలో అందరూ ఇళ్లకు మళ్ళాక" అంటూ బిస్తర్ దులుపుకొని.. బుడ్డిదీపాన్ని అంగడి మలుపులోనే వదిలేసి, పెను నల్లటి కాంతిలోకి గమించాడు. 

సైదాచారి కవిత్వం – తాదాత్మ్య కవిత్వం, ఆరోపణల కవిత్వం. తనలోని క్రోమోజోమ్స్ పెర్మన్స్కి అనువుగా ఏర్పడిన కవిత్వం. అతని కవిత్వ లయ అతని క్రోమోజోమ్స్ బీట్ అని అనుకుంటా. అతనిలోని వ్యక్తిగత అంశాలన్ని కుటుంబ సామాజిక కులసంక్షోభ అంశాలే అని అనిపిస్తుంది. అతని కవిత్వంలో పురుషుని దీనత్వం, నిస్సహాయతా, వైలెన్స్, ఆత్మహనన ధ్వంస క్రీడ అంతా పాదరసంలా కణకణలాడుతూ వుంటుంది. 

దానిని తన కవిత్వం ద్వారా చల్లబరచటానికి సైదాచారి చాలా ప్రయత్నం చేస్తాడు. అది తగ్గలేదు. ఊదిన కొద్దీ మంట పెరుగుతూంటే పోయింది. అది వొక సెన్సుయల్ హిస్టీరియాగా మారి పురుషత్వపు స్త్రీగా తత్వాన్ని అవలంబించి “మాతమ్”ని, శిగాన్నీ” పెర్ఫామ్ చేస్తూ... పాఠకుల ముందుకు వస్తుంది. ఇటువంటి శిగం వజీర్ రహ్మాన్, చలంగారూ, రేవతీ దేవీ, చిత్రకొండ గంగాధర్ కవిత్వంలో.. స్పర్శకు తెలుస్తూ వుంటుంది. మన దుఖాన్ని ‘ఖవాలీ' పాటగాళ్ళలో వుండే... విద్యుత్ ఫ్యూజన్ లాంటిదన్నమాట. 

ఈ శిగానికి ఆరోహణ మాత్రమే వుంటుంది. అవరోహణ వుండదు. సైదాచారి కవిత్వాన్ని గనుక మనం సంగీతపు పరిభాషలో చెప్తే.. అది మొత్తం వొక సంధిప్రకాశ రాగాల సముచ్ఛయ కవిత్వం. సోహినీ రాగంలోని .. అంతర్ద్వారం సైదాచారి కవిత్వం చదవగానే తెరుచుకుంటుంది. కవిత్వ పఠనాన్ని సాధన చేసే ఉత్తమ పాఠకులకు ఇటువంటి అనుభవమే కలగడం విజువల్ నేరేటివ్స్ లో చూస్తూనే వున్నాం. 

ప్రాథమిక దశలో సైదాచారి హైకూ కవిత్వ ప్రేమికునిగా నాకు జ్ఞాపకం. కవిత్వంలో.. శుద్ధ సౌందర్యానుభవపు వానజల్లు, లలిత సంగీతంగా.. సాధారణంగా వుండే ప్రాకృతిక గుసగుసలో అతనికిష్టం. అటువంటి కవిత్వాన్ని.. తన తొలిరోజుల్లో రాయడం ఇష్టపడ్డాడు. తనకి కవిత్వం రాయడం కంటే.. కవిత్వాన్ని మెడిటేటివ్ ఎంతో.. నెనరుతో, పూర్తి ఇష్టంతో వినడం ఇష్టం. కవిత్వాన్ని, అది ఏ పొలిటికల్ సోషల్స్టాండ్లో రాసి కవిత్వమయినా.. అందులో కవిత్వం వుంటేచాలు.. గరమ్ చాయ్ లాగా, ఆనందంతో పొగలు చిమ్మేవాడు.. నవ్వేవాడు. 
అతని నవ్వు.. మొగలిపొద సందెజీకటిలో నవ్వినట్టుగా అనిపించిన జ్ఞాపకం. తనను తాను అన్నింటినుంచి విడగొట్టుకొని దు:ఖించడం ఇష్టం. అన్నింటిలోకి తనను కలుపుకొని సుఖించడం ఇష్టం. 
సైదాచారి కవిత్వమంతా.. ఆంతరంగిక భాష. చాలావరకూ ప్రయివేట్ లాంగ్వేజ్ తనది. అందుకే ఆ భాషలో వొక అసంతృప్తి, ఎక్కువగా.. ఆపకుండా.. లౌడర్, బరువును పెంచుతూ.. సమాంతర పదచిత్రాలను కూరుస్తూ, తెరమీదకి తెస్తుం టాడు. వొక్కోసారి..భాషలోని బరువు ఎక్కువైపోయి కవిగా తన నిస్సహాయస్థితిని కూడా పొందుపరుస్తూంటాడు. కానీ పాఠ కులు అతని అనుభవ తీక్షణలో కొట్టుకుపోతూ అతని భాషను కూడా మ్యూట్ చేసి ముందుకుపోతారు. 

జీవితంలోని యాంత్రికలను, బోర్డము రసహీనత్వాన్ని ఎదిరించి దాని నుంచి రోగ నిధానంగా.. స్త్రీత్వ దు:ఖాన్ని ఎంచుకున్నాడు కవి.. తన మార్గంగా. తన సారంలో.. తేటనీటి సరస్సు తాలూకు డెప్త్ కళ్ళకు కనబడినట్టుగా సైదాచారికి కవిత్వంలో క్లారిటీవల్ల తోలు అవగతమవుతూంటుంది. కవిత్వంలో.. లోతునీ, స్పష్టతనీ వొక అనుభవకేంద్రం మీద నిల బెట్టగలగడం అంత తేలికగా, వంటబట్టే లక్షణం కాదు. కవిత్వ విమర్శలో లోతునీ, గాఢతనీ, స్పష్టతనూ వొకే గాటుకట్టి చాలా కోల్పోయాం. ఈ అంశాలకు విడి విడిగా చూస్తూనే వొకే గాలి అద్దం లోంచి చూస్తే తెలిసి వస్తుంది. 

అవన్నీ విడిగా ఉంటేనే కలిసి భ్రమిస్తాయని. సైదాచారి కవిత్వంలో.. మనకు పురుషున్నీ, పురుష స్త్రీత్వం తాలూకు సరిహద్దు గీతల్నీ స్పష్టంగా అర్ధం చేసుకుంటాం. మన లైంగికాంశాల మైధున స్థితి, వివశత్వ అనుభవం... అందీ అందకుండా జారిపోతున్నప్పుడు కలిగే దు:ఖం, అసహనం, దైహిక పరిమితులూ.. అన్నీ పాఠకుల అనుభవానికి తగుల్తుంటాయి. స్త్రీని స్వంతం చేసుకోలేని.. పురుషత్వపు స్త్రీత్వం తనకు అడ్డుగా నిలబడడం.. తనని ఆత్మహింసలోకి, ఫిజికల్ మేడ్నెస్లోకి నెట్టివేయడం, తనను తాను ఆల్కహాలిక్ గా ప్రెజెంట్ చేసుకోవటం వరకూ వచ్చింది. తనలోని స్త్రీత్వాన్ని సమన్వయం చేసుకోవడానికి సైదాచారికి ఇమ్మిడియెట్ నెసెసరీ యాంటీడోట్ అయ్యింది. 

కవిత్వం అందుకే తన సమస్యలకు సమాధానం కోరటం కంటే.. తన సమస్యను ప్రపంచం దృష్టికి బహిర్గతంచేయటం అనివార్యమయిపోయి.. సైదాచారి.. తన స్త్రీత్వాన్ని, కారుణ్యకాఠిన్యాన్ని, తన పురుషునితో.. లయింప జేసుకొని.. భౌతిక, మానసిక ఆనందం దొరుకుతుందనుకొని, కవిత్వం ద్వారా అది సాధించవచ్చునని అనుకున్నాడు. 

అతని కవిత్వంలోని స్త్రీత్వహింస మెర్సీ కిల్లింగ్గా అనిపిస్తుంటుంది నాకు. సైదాచారి కవిత్వ సంకలనాలు..ఆమె నా బొమ్మ, నీలం మాయ, తెలుగు అత్యాధునిక కవిత్వ చరిత్రకు కావల్సిన, లోదృష్టిని భాషనూ, జీవసాంద్రతనూ సమకూర్చగల కవిత్వ సంకలనాలు.. కవిగా.. తను వరించిన మార్గం చాలా చాలా వేదనాపూరితమైన దారి. అసలు వేదన లేకుండా, బాధ బారిన పడకుండా, దు:ఖం లేకుండా, దు:ఖారోహణ లేకుండా.. స్వయం హననం లేకుండా, స్వీయ హింస లేకుండా, కరుణ కోపంతో దహనమవ్వకుండా, దహించకుండా.. కవిత్వం వుంటుంది. 
పూర్తిగా ఆధునికం కాని, సెమీ ఫ్యూడల్ సమాజంలో, అసమానత నిగ్గుతేలుస్తూ పోతున్న.. ఇప్పటి తరం కవులకు వేదన, దుఃఖం అనివార్యమయిన రహస్య ద్వారాలు కవిత్వానికి. అటువంటి ద్వారాలకు, తొవ్వలకు కళ్లు సైదాచారి కవిత్వంలో వాటి పుటల్ని తెరవంగనే జలజలమంటూ.. కన్నీళ్ళు రాలి పడుతాయి. 

ఆ కవిత్వానికి ఎందుకు అంత శక్తి వచ్చిందా అని విస్మయపడితే.. కవి, దుఖాన్ని గుంజను చేసి.. తన మూలగృహంలో పాతి.. తనను దానికి కట్టుకొని చివికి చివికీ.. పురాతన మానవ సంగీతాన్ని సాధనచేస్తాడు కాబట్టి. తను స్వయానా సంగీతకారుడు కూడా అవ్వడం వల్ల కవిత్వానికి ఆక్సిజన్ వచ్చింది. ఆ బలంవల్లనే గొప్ప కవిత్వాన్ని అందివ్వగలిగాడు. ఎప్పటికీ వెంటాడే తన గొంతు, చిర్నవ్వు, ఇప్పటికీ.. మరుపుకురాని, ఆ ఇరానీ చాయ్ అల్లనేరేడిపండ్ల మసక గుగ్గిలం పొగల కవిత్వ పఠనాలు పాటల సంగీతకారీ వీడ్కోలు లేదు. 

There is no real coming and going 
For what is going but coming. 

- Shabistari 
The Secret Rose garden of Said ud din 
mahmud Shabistari

click me!