కథలు సమాజాన్ని చిత్రించాలి

By Siva KodatiFirst Published Nov 27, 2022, 7:10 PM IST
Highlights

ముడుంబై పురుషోత్తమాచార్య రచించిన ' తేనె తెరలు ' కథాసంపుటి ఆవిష్కరణ సభ ఈరోజు నల్లగొండ పట్టణంలో  జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సాహితీవేత్త, మిసిమి మాస పత్రిక సంపాదకులు వల్లభనేని అశ్వినీ కుమార్ పాల్గొన్నారు. 

ముడుంబై పురుషోత్తమాచార్య రచించిన ' తేనె తెరలు ' కథాసంపుటి ఆవిష్కరణ సభ ఈరోజు నల్లగొండ పట్టణంలో  జరిగింది : బాధ్యతాయుతమైన రచయితలు రాసే కథలు సమాజాన్ని చిత్రిస్తాయని ప్రముఖ సాహితీవేత్త,  మిసిమి మాస పత్రిక సంపాదకులు వల్లభనేని అశ్వినీ కుమార్ అన్నారు.  ఇవ్వాళ నల్లగొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త, సంగీత విద్వాంసులు డాక్టర్ ముడుంబై పురుషోత్తమాచార్య రచించిన ' తేనె తెరలు ' కథాసంపుటి ఆవిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అశ్విని కుమార్ మాట్లాడుతూ ముడుంబై పురుషోత్తమాచార్యులు మానవ సంబంధాలను,  స్త్రీ పురుష సంబంధాలను ఈ కథల్లో అత్యంత ఆసక్తికరంగా వ్యక్తీకరించారన్నారు.

ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నవలా రచయిత శిరంశెట్టి కాంతారావు మాట్లాడుతూ పురుషోత్తమాచార్య తన కథలలో సమాజానికి ఒక సందేశాన్ని అందించారని కొనియాడారు.  ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు పార్థసారథి మాట్లాడుతూ తెలుగు భాష లోతులు తెలిసిన పురుషోత్తమాచార్య రాసిన కథలు సాహిత్యంలో చిరకాలం నిలుస్తాయి అన్నారు.  

డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ పద్యం, నవల, నాటకం, పరిశోధన మొదలైన ప్రక్రియలో రచనలు చేసిన పురుషోత్తమాచార్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని అభినందించారు.  సాగర్ల సత్తయ్య మాట్లాడుతూ మనోవిశ్లేషణ, చైతన్య స్రవంతి పద్ధతిలో సాగిన ఈ కథలు  పాఠకులను ఆలోచింపచేస్తాయి అన్నారు. ప్రముఖ కథారచయిత్రి ఉప్పల పద్మ పుస్తకాన్ని సమీక్షించారు.  ఈ కార్యక్రమంలో ఎన్.సి పద్మ, బండారు శంకర్, అలుగుబెల్లి రామచంద్ర రెడ్డి, చకిలం కొండ నాగేశ్వరరావు, డాక్టర్ చింతోజు మల్లికార్జున చారి, గజవెల్లి సత్యం, సిలివేరు లింగమూర్తి, శీలం భద్రయ్య, మాదగాని శంకరయ్య,  వల్లాల అచ్చయ్య పరంధాం తదితరులు పాల్గొన్నారు.
 

click me!