చిల్లర ఇవ్వలేని నిస్సహాయతలో చిల్లర ఎగొట్టేవాడుగా నిందను మోస్తూ అంటూ డా. గాదె వెంకటేష్ రాసిన కవిత " కండక్టర్ " ఇక్కడ చదవండి :
కండక్టర్ అంటే
తిలక్ “అమృతం కురిసిన రాత్రి” లోని
తపాలా బంట్రోతె మదిలమెదులుతడు
ప్రజారవాణ మాత్రమే శరణ్యమైన కాలంలో
ఊరు ఊరికి -స్టేజి స్టేజికి
ప్రతిరోజూ ఎక్కి దిగే భావోద్వేగాలను పంచుకునే తోడు,
చెవిలో పెన్ను
జబ్బకు సంచీ
చేతిలో SR బాక్స్
కాకీ దుస్తులు
అరిగిన చెప్పులు
ఎండలో వానలో
ఎండి శీకి పోయిన
ఒక చిన్నసైజు జీతగాడు బస్సు కండక్టర్
పట్నంలోనో, పక్కూర్లోనో..
బతుకబోయిన,
సదువబోయిన
భర్తకోసమో, పిల్లల కోసమో
ఎన్నోరోజుల దూరాల ఎడబాటును భరిస్తున్న
దిగువ, మధ్యతరగతి ప్రజల మనసులను
మెట్లకాడ ఉండి ఒడిసి పట్టుకొని
స్టేజికి స్టేజికి ఎక్కిదిగే వాళ్ళ కళ్ళల్లోని
భావోద్వేగాల ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాస
బస్సు హారణుకు
ఒక్క ఉదుటున లేసిన తల్లులకు
వాళ్ళు వెల్లసిన బస్సు కానప్పుడు
విచ్చిన నిట్టూర్పు నిప్పులకూ
నీ చల్లని చిరునవ్వుల జల్లులే ఉపశమనం
కనపడీ కనపడని కళ్ళల్లో
కొడిగట్టిన చూపులతో కన్న కొడుకు కోసం
గుడిసె ముందు కూర్చున్న పండుముసలి అవ్వ
ఆ స్టేజి వైపే కళ్ళలో ఆతృత చూపుల ఆశలు,
ఈ బస్సుకైనా వచ్చాడా ?............
ముడతల నెర్రెల పడిన మొహం మీద
కాస్త ఉపశమనాన్ని జిలుకరిస్తూ నడిపించేవాడే కండక్టర్
రిక్వెస్ట్ స్టాప్ ల్లో
బడికి పొయ్యి వచ్చే పిల్లలకు ఎదురుచూసే
నానమ్మ తాతలకు
చేయి సంచిలోంచి సిల్లర తియ్యలేని ముసలవ్వకు
నిండుచూలాలుకు,
ఇంట్ల అలిగి వచ్చిన ఆడపిల్లలకు
దవఖానాలకు పొయ్యొచ్చే దేహాలకు
చేరువవుతున్న నీ బస్సు రాక ఒక ఊరట.
దగ్గర దగ్గరౌతున్న మిత్రుని రాక కోసం
వ్యాపారికి, దొంగకి
ముద్దాయికి, నిరుద్యోగికి,
ప్రేమ పక్షులకు, రాక్షసులకు
నీ బస్సు టికెట్ తో
దూరాల దారాల్ని , భారాల్ని
తగ్గించగల నేర్పరివి , కూర్పరివి
నిత్య చలనశీలత మీద నీ గమనం
శుభాశుభాలకి నువ్వు వర్తమానం
నీ మాజిక్ SR సంచిలో
నవ్వులు పువ్వులు
ఆనందాలు అభినందనలు
నిట్టూర్పులు ఏడుపులు
ఆపతికి సాపతికి
ఏడ చెయ్యి లేపితే ఆడ బస్సాపిన
ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!
జనాలతో కిక్కిరిసినా బస్సు ఆపకుండా
స్టేజి రాకమునుపే టికెట్స్ కొట్టే నేర్పరి
అందరికి పరిచయమైన నవ్వు
కొందరికి కొరియర్ అయ్యి
చిల్లర ఇవ్వలేని నిస్సహాయతలో
చిల్లర ఎగొట్టేవాడుగా నిందను మోస్తూ,
అందరిని తీరాలకు చేర్చే వాహకమైన
నీ కథనం మాత్రం ట్రాఫిక్ లో ఇరుక్కున్న మథనం
కండ్లు తీసి అద్దాల మీద పెట్టి
డ్రైవరన్న కారు చీకట్లో కంకర రోడ్లపై డ్రైవ్ చేసినా
నువ్వు వేళ్లు తూట్లు పడ్డట్టు టిక్కెట్లు కొట్టినా
ప్రభుత్వ రాయితీల చెల్లింపు దమననీతితో
సంస్థ పెద్దోళ్ల విలాసాల పోకడతో
కన్నవారి కడుపుకు
ముడుపుకట్టలేక పోతున్న మీ RTC ఉద్యోగం
నీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపలేదు
పేరుకే గవెర్నమెంట్ కొలువు
పెన్షన్ ఫెసిలిటీ లేని
ఏ గవర్నమెంట్ పథకానికి అర్హతలేని
అందరి ఆప్త బంధువువు
ఇన్ని కళ్ళు పిలిచినా
ఒక్క నయనం నీ లోపలకు తొంగి చూడదు
స్టేజి స్టేజికి దింపి
నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
కూతుర్ని అత్తారింటికి పంపి
భారమైన తండ్రి గుండె "తీరం" తీరు
(ఎందరో మా అన్న కండక్టర్ గాదె లక్ష్మయ్య లాంటి వారి కోసం)