
కొత్త మరమ్మత్తుల మత్తులో
పగలూ మధ్యాహ్నమూ వగలు పోయినాక
ప్రతిఘటించిన ప్రేరణలన్నీ పేకమేడలైనాక
వంతెన వాలు నుంచీ సంధ్య వెలుగు
గమ్మత్తుగా చిక్కబడుతూ జారుతుంది!
సాయంత్రపు జన సందోహంతో
చెరచబడ్డ ఓపిక సన్నగిల్లి చిప్పిల్లి...
శతాధిక వత్సరాల శక్తి యుక్తుల్ని ఒడ్డి
చివరి చీలికను చిగురుటాకులా
ఆఖరి ఆశగా ఆలంబనగా
నిష్ప్రయోజనంగా చుట్టుకుంటుంది!
రాగాలుడిగిన రాత్రి జాతరలో
జ్ఞాపకాల గాజురాళ్ళ గాభరాలన్నీ
వేలాడుతూ వేడుకుంటూ వెక్కిళ్లతో
తలమునకల్లో తల్లడిల్లుతాయి!
ఎన్నో కలలు.. మెలకువలు..
పిల్లలు.. తల్లులు..
అల్పాయుష్కులైన అనామకులు..
తాళ్లతో తగువులాడిన రక్షాబంధనాలు..
తెగే మందు రాపిడిలో
తెగతెంపులు చేసుకున్న రాగద్వేషాలు..
సమస్తమూ జలసమాధి కావించ బడ్తాయి!
ఎవరు బేహారులో.. ఎవరు గ్రాహకులో..
ఎవరు శాపార్ధులో.. ఎవరు సమర్ధులో..
తెలియని సంస్థల పెడర్థాల పెను తొక్కిసలాటలో
కొలమానాల అరకొర కొరతతో
ప్రారబ్థం ప్రార్థనను మింగేసి
ప్రశాంతంగా ప్రారంభంలోనే ముగించేస్తుంది!
కడపటి కన్నీటి చారికలను కాలం కప్పేస్తుంది!
నీటి అట్టడుగున
పెంజీకటి ప్రేమగా పెనవేసుకున్నాక..
మురికి ముద్ర ముఖానికి పులుముకున్నాక..
చేతనైనంత చెమ్మ పీల్చుకున్న చైతన్యం మాత్రం..
బహుశా మళ్లీ ఒకనాటికి
బంధాలు గుర్తుకొచ్చి
మరో శైశవ గీతమై రోదించి రోదించి రెప్పలల్లార్చి చిగురుతొడుగుతుంది...
మరోపురుడు పోసుకుంటుంది!!!
(గుజరాత్ లో జరిగిన "మోర్బీ" తాళ్ల వంతెన దుర్ఘటనలో దాదాపుగా 135 మంది జలసమాధి అయ్యారు)