మువ్వా శ్రీనివాసరావు దీర్ఘ కవితా సంపుటి " వైరాయణం " పైన నల్లగొండ నుండి సాగర్ల సత్తయ్య రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
ప్రపంచ చరిత్రలో అనూహ్యమైన సంఘటనలు జరిగినప్పుడు స్పందించేది మొట్టమొదట కవి హృదయమే. ఒక వస్తువు లేదా అంశం కవిని గాఢంగా కదిలించినప్పుడు , ఆ వస్తువు వల్ల కలిగిన సంవేదనతో కవి మనసు కుదిపి వేయబడ్డప్పుడు అతనిలోని సృజనకారుడు కవిత్వమై ప్రవహిస్తాడు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే సమాజం పట్ల ఒక నిబద్ధత కలిగిన కవి హృదయ స్పందన ఈ వైరాయణం.
మువ్వా శ్రీనివాసరావు జగమెరిగిన కవి. శాస్త్రీయ దృక్పథం కలిగిన అభ్యుదయ కవి. కరోనా కాలాన్ని ముందు తరాలకు ఒక డాక్యుమెంట్ గా రికార్డు చేసిన కవిత్వం ఈ వైరాయణం. మువ్వా శ్రీనివాసరావు లాంటి కవులు మాత్రమే రాయగలిగిన కవిత్వం ఇది. కవి తనలోని భావ పరంపర విస్తృతంగా వ్యక్తీకరించదలచినప్పుడు దీర్ఘ కవిత ప్రక్రియను తన సాధనంగా చేసుకుంటాడు. వైరాయణం తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే ఒక గొప్ప దీర్ఘకవిత. ఆవేదన, వ్యంగ్యంతో పాటు ఈ సంక్లిష్ట సమయంలో మానవాళికి ఓ భరోసా, ధైర్యాన్ని నూరిపోసే కావ్యమిది. 'కరోనా...కారణ జన్మమే నీది' అని పునరావృతమయ్యే ఈ వాక్యం చక్కని వ్యంగ్యాత్మక అభివ్యక్తి. శతకంలో మకుటంలా పాఠకులకు ఈ కవిత్వాన్ని మరింత చేరువ చేస్తుంది.
ఆపద సమయంలో మూఢత్వం అని తెలిసినప్పటికీ ఏమీ పాలుపోని స్థితిలో సామాన్యుడు మూఢనమ్మకాల వైపు మొగ్గడం సహజం. కరోనా మూలాలను శాస్త్రవేత్తలు శోధించేలోపే ఇది ఒక అలౌకికమైన భావన అనే మూఢనమ్మకం ప్రచారంలోకి వచ్చింది. దీపాలు వెలిగించడం, చప్పట్లు కొట్టడం వంటి మూఢనమ్మకాలకు తెర లేచింది.
" దీపాలకు
పాపాలు పోవని తెలుసు గాని
గుండెల్లో గుడి కట్టిన ఐక్యతా దీపాలకు
ఆయుష్షు పోయాలని చూస్తున్నాం
..... ...... ...... .......
మూర్ఖత్వపు ముందరి కాళ్ళకు మొక్కేలా చేస్తున్నావు కదా కరోనా.... " - అనే ఈ కవితా పంక్తులు కవి అభ్యుదయ దృక్పథానికి ప్రతీక.
" పెట్టుబడిదారులకు వేలకోట్ల మాఫీల వత్తాసు
కష్టపడేటోడికి అదనపు పని గంటల వడ్డింపు " - అని ఆవేదన చెందిన కవి, స్వేదం విలువను స్వాహా చేసే ఏలికలు అందరూ కార్పోరేట్ గేటు పాలకులే అని తేల్చి చెప్పడం ఈ కవి అభ్యుదయ దృక్పథానికి, ప్రజా పక్షపాతానికి నిదర్శనం.
ప్రకృతి ప్రేమికుడు సౌందర్యారాధకుడు అయిన ఈ కవి ప్రపంచం ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందమైన వర్ణనలతో కూడిన కవిత్వం రాయలేనని ఆవేదనతో పలుకుతాడు
" విషవాయువు వీస్తున్న వేళ
ఆమె ముంగురుల నాట్యానికి
అక్షర చప్పట్లు కొట్టలేను... " - అంటూ స్పష్టం చేస్తున్నాడు.
ఈ కవిలో సున్నితమైన హాస్యం, వ్యంగ్యం ధ్వనిస్తూ ఉంటుంది. నేటి కాలం మనుషులు తాగుడుకు బానిస అవుతున్నారని చెప్పడానికి 'సురాపానానికి సూదంటురాళ్లం' అంటారు. కరోనా సమాజానికి కొంత మేలు చేసింది అనే అర్థం ధ్వనించేలా మద్యపాన నిషేధానికి కారణమైందని చెప్పడానికి ' రోశమ్మ పొలికేకకు నీ గొంతునిచ్చావు కదా! ' అంటూ దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుకు తెస్తారు. కరోనా వల్ల లాక్ డౌన్ పుణ్యమా అని ఇంటికే పరిమితమై పోవడం వల్ల తిరిగి మానవ సంబంధాలు అనుబంధాలు పునరుజ్జీవం పోసుకున్నాయి అని తెలియజేస్తారు.
" మరచిపోయిన మాసిపోయిన
బంధాలను వెతికి వెలిగించుకుంటూ
దూరాన్ని కూడా
స్వర్గధామాన్ని చేసుకునేలా చేశావు కదా! " - అని కరోనా వల్ల మానవాళికి జరిగిన మేలును ప్రశంసిస్తాడు. కరోనా మృతుల్లో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ అనే అంశాన్ని తెలియజేస్తూ అబలలు ఎవరో సబలలు ఎవరో తేల్చుకోవాల్సిన తరుణమిది అని స్త్రీలు పురుషులతో సమానం అనే అంశాన్ని తెలియజెప్పారు. దేవుడి గుళ్ళు కూడా మూసివేయడాన్ని తెలియజేస్తూ మానవత్వం ఉన్నతమైనదిగా స్పష్టం చేశారు. కుల వివక్షను నిరసించారు. కరోనా కాలుష్యాన్ని కూడా నివారించింది అంటారు. గంగానది ప్రక్షాళన జరిగింది అని తెలియజెప్పారు. విలువలకు ప్రతి విలువలు నేర్పినదిగా కరోనాను అభివర్ణించారు. మనిషితనాన్ని స్వీకరించి తుది మెరుగులు దిద్దుకోవాలి అని సందేశం ఇచ్చారు.
" పోలీసు నుండి పాలకుల వరకూ
ఎవని విధి వాడు చేసి
చాలా కాలం అయింది
ఆపద ఇస్తే ఇచ్చావు గానీ
అందరినీ అందుబాటులోకి తెచ్చావు కదా! " -
అని కరోనా చేసిన మేలును ప్రస్తుతించారు.
ఇదంతా కవి వ్యంగ్య వ్యక్తీకరణకు తార్కాణం. ప్రకృతి వర్ణనలో మువ్వా కలం అందె వేసిన చేయి.
" ఇప్పుడే కిటికీలోంచి వీచిన గాలి
స్వేచ్ఛకు కొత్త నిర్వచనం చెప్పి పోయింది
కిటికీ బయట రెక్కలు విదిల్చిన పక్షి
స్వాతంత్ర్యానికి కొత్త రేకులు విప్పి పోయింది
సూర్యుడు చెట్టు గుబురులోంచి నడచి వచ్చి
నీడలో వెలుగు సున్నాలు చుట్టి పోయాడు "
ప్రకృతి ఇమేజ్ ను పాఠకుల మనోఫలకంపై ముద్రిస్తున్న కవితా పంక్తులివి.
కనిపించని చిన్న ప్రాణి సృష్టించిన అల్లకల్లోలం నభూతో. దీనిని కవి ఒకే ఒక రోగం వంద గొలుసుకట్టు దుఃఖాలుగా అభివర్ణించాడు. పాలకులను అప్రస్తుత ప్రసంగీకులుగా, కరోనాను అనారోగ్య అవధానిగా చమత్కరించారు. మానవుడు నిర్మించుకున్న శాస్త్రాన్ని తనను తానే శాసించుకునేలా చేసిందని, ఇది మానవ తప్పిదమని వాపోయారు. మా తప్పిదాలలో ఓ లెక్కేదో నెల తప్పి నిన్ను కన్నదేమో కదా! - అంటూ ప్రకృతి శాసనాలను అతిక్రమించిన మానవుని తిరోగమన వైఖరిని నిరసించారు. కరోనా మరణాల సమయంలో కనీసం కడచూపుకు నోచుకోని దుస్థితిని కవి ఆర్ద్రంగా అక్షరీకరించారు.
" మాధవుడు పోయినప్పుడు నలుగురే
మహామహోపాధ్యాయ మార్క్స్ పోయినప్పుడు నలుగురే
నీ చావుకు ఎందుకురా సంతని సగటు మనిషిని కారోన గద్ధిస్తున్నదని " అంటారు.
ఆధునిక శాస్త్ర సాంకేతికత పెరిగినకొద్దీ మనిషి జీవితం కృత్రిమమై పోయింది. యాంత్రికంగా మారిన ఈ జీవితం సహజత్వం అడుగంటింది. దీనిని దేహం నిండా అలారాల మోత, మెదడు నిండా కలుపు మొక్కలు - అంటూ మనిషి ఆ కలుపు మొక్కలను కంపోస్ట్ ఎరువుగా మార్చాలని అభిలషించారు.
ఒకరిని ఒకరు తాకడానికి కూడా భయపడే పరిస్థితిని కరోనా కల్పించింది
" ఒకే మొహంలో ఉన్నా
ఒక కన్ను ఇంకో కన్నును చూడలేదు
ఇప్పుడు మేము కన్నోళ్లను
మము కన్నోళ్లను కూడా చూడకుండా అయిపోయింది
మనసు ముందు ఉన్న అద్దం వెనుక వెండి పూతవై
మా లోపలి లోపాలకు అద్దం పడుతున్నావు కదా! "
ఎంత గొప్ప అభివ్యక్తి? మనల్ని మనం తెలుసుకునేటట్లు చేయగలిగిన కరోనాను ఇంతకంటే గొప్పగా ఎలా వ్యక్తీకరించగలం? ఇటువంటి వ్యక్తీకరణలు ఈ కవితా సంపుటిలో కోకొల్లలుగా కనిపిస్తాయి.
అగ్రరాజ్యం అనే అహంకారంతో ప్రపంచ దేశాలపై
ఆజమాయిషీ చేయాలని చూసే దేశాలకు కరోనా గర్వభంగం చేసిందనే చెప్పాలి. దీనికి కవి గరుడ గర్వభంగం ఉదహరిస్తారు. అగ్ర రాజ్యాలు కూడా అడుక్కునే స్థితిని కరోనా కల్పించింది అంటారు. అగ్రరాజ్యాలను పళ్లూడిన పహిల్వాన్ లను చేశావు అని చమత్కరించారు. మనుషులు ఎప్పుడు ఉంటామో పోతామో తెలియని స్థితిలో మనసు విప్పి మాట్లాడుకునేలా చేసింది కరోనా.
" విశ్వం విషమించిన వేళ
విన్నా వినకున్నా మాటలై విచ్చుకునేలా చేస్తున్నావు కదా ! "
డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు చేసిన సేవలను కొనియాడారు. ఒక రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు కేటాయించిన దుర్నీతిని తప్పుపట్టారు. సందర్భానుసారంగా శ్రీశ్రీ, శేషేంద్ర, ఆవంత్స సోమసుందర్ వంటి మహా కవుల కవిత్వ పాదాలను ఉటంకించారు. కరోనా కాలంలో బాధ్యతాయుతంగా పనిచేసిన పినరయి విజయన్ వంటి పాలకులను స్తుతించారు. వలస కార్మికుల దుఃఖాలను కవిత్వీకరించారు. సంచారజాతుల దైన్యాన్ని కళ్ళముందుంచారు. కరోనా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా పిల్లలూ పాఠశాలలకు దూరమయ్యారు ఈ దీనస్థితిని కవి వర్ణిస్తూ -
"పరీక్షలు ఆపి పాఠాలను పెదవులకే వేలాడ గట్టి
వాళ్ల నవ్వులను లాక్ డౌన్ లో పెట్టావు కదా " - అని ఆవేదన వ్యక్తం చేశారు.
" మా మొహాన్ని మేము తాకాలన్నా
మీ అనుమతి అవసరం అయ్యేటట్లు చేశావు కదా
ఆరు అడుగుల దూరాన్ని చుట్టూ తగిలించుకుని
మనిషి నుండి మనిషి పారిపోయేలా చేశావు
మా మరణ శిక్ష పత్రంపై మాతోనే సంతకం చేయిస్తున్నావు కదా " .... మొదలైన కవితా పాదాలు కరోనా సృష్టించిన ప్రళయాన్ని ప్రతిఫలిస్తున్నాయి. సంపంగి పువ్వు పరిమళంతో పాటు పాములు వస్తాయన్న భయం ఇచ్చినట్లుగా అంటూ ధైర్యాన్ని సేద్యం చేసుకునే వేళ కలుపు విత్తులు చల్లి పోయావు అని కరోనాను నిందిస్తూ చక్కని ఉపమానాలను ఉపయోగించారు. కరోనా కాలంలో ప్రజలు సామాజిక మాధ్యమాలలో ఏ చిట్కా వైద్యం కనిపించినా దాన్ని పాటించడానికి ఎగబడ్డారు. అది నిజమా కాదా అని ఆలోచించలేని స్థితిలోకి జారిపోయారు.
" గుండె బలానికి ఇప్పుడు
పిడికెడు అబద్ధాలతో
చారెడు అసత్యాలను రంగరించిన
కొత్త కొత్త లేహ్యాలకు అలవాటు పడేలా చేశావు " అంటూ ఆనాటి స్థితిని కళ్ళ ముందుంచారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దీర్ఘ కవితలో వందలాది పాదాలు ఉటంకించదగినవే. చక్కని శైలితో అద్భుతమైన శిల్ప విన్యాసంతో అనేక పదచిత్రాలు భావ చిత్రాలతో ఈ దీర్ఘ కవిత పాఠకులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఏకబిగిన చదివేలా చేస్తుంది. ఐక్యతా దీపాలు, ఆలోచన కొలిమి తిత్తులు, ప్రకృతి హాజరు పట్టి, కరోనాగార వాసం, కరోనరులు, హృదయపు అరుగులు, వెన్నెల కల్లాపి, కరోనా పూలు, మనసు దోసిళ్ళు, కరోనర్, బాల్కనీ బాదుషా, వెలుగు చొక్కా, మార్కెట్ దీపం మొదలైన పదచిత్రాలు ఈ కవిత్వానికి మరింత వన్నె తెచ్చాయి.
సర్కార్ సంసారం నడవాలంటే సారాయి సంపాదనే ముఖ్యం - వంటి కొంగొత్త సామెతలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
ఒక ప్రపంచ యుద్ధం చేసే నష్టం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విధ్వంసం కరోనా వల్ల కలిగింది. అందుకే ఈ కవిత్వాన్ని మూడో ప్రపంచ యుద్ధ కవితగా అభివర్ణించడం ఎంతో సముచితంగా ఉంది. ముందు తరాలవారు కరోనా కాలాన్ని గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక అద్భుతమైన డాక్యుమెంట్.