శాంతి కవిత : భరోసా

By Arun Kumar PFirst Published Oct 2, 2023, 10:58 AM IST
Highlights

నేడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విశాఖపట్నం నుండి శాంతి రాసిన కవిత ఇక్కడ చదవండి :

"అంకుల్! అదెంత?" అన్న ప్రశ్నకు..
తప్పుల తడకల లెక్కల్తో
లాభనష్టాలు తూచే లావాదేవీల్తో
తలమునకలై ఉన్న నేను తలెత్తి చూశాను!

కన్నీట తడిసి నలిగిన రెప్పల్తో
పగిలిన 'రంగు రబ్బరు' ముక్కల్తో
చూపుడు వేలు ముందుకు చాపిన
పాలపుంతనే దిగదుడిచి పారేయగల్గిన
ఓ పాలబుగ్గల పసి కూన నిల్చునుంది!

"ఐదు రూపాయలన్న"..
నా స్వాతిశయ సమాధానానికి
తనైదు ప్రాణాలు ఖైదైనట్లు ఖిన్నురాలై
"..ఇదే ఉంది..అయినా అది లేకపోతే...
నా తప్పుల్నెలా చెరుపుకునేదం"టూ
బుల్లి భుజాన బడి బరువంతా మోస్తూనే
కలిమి-లేముల్ని సమతుల్యం చేయమన్నట్లు
నిజాన్ని-స్వప్నాన్ని నిగ్గు తేర్చమన్నట్లు
ఒక రెండు రూపాయల నాణాన్ని
బల్లపై భద్రంగా ఉంచింది!

జాతికై సత్యాసత్యాల ప్రామాణికంగా
ప్రయోగాలు చేసిన సాహసి
బోసి నవ్వుల బాపు..
"ఇప్పుడేం చేస్తావ"న్నట్టు.?
క్యాలెండర్ లోంచీ కన్పిస్తే...
చిదిమి దీపం పెట్టుకునే లాంటి ఈ చిన్నారి
తనకు చేతనను చేవనూ ఇమ్మంటున్న చేష్టను
చటుక్కున చిదిపేయ బుద్ధి కాక
కొత్త రబ్బరొకటి తీసి..కుదురుగా చేతిలో పెట్టాను!

యెకాయెకిన
ఎన్నో జెండా పండుగలు రెపరెపలాడినట్లు
ఎన్నెన్నో ఎర్రకళ్ళ తెల్ల పావురాలు
రెక్కలల్లార్చి రేపు వైపు ఎగిరినట్లు
ఆకాశం అనుకోకుండానే ఆనందాన్ని రువ్వింది!

నేనిచ్చిన ఆ చిన్న భరోసాతో భవిత
"అమ్మయ్య!" అనుకుని రెప్పలల్లార్చి హాయిగా నవ్వింది!

ఇంతవరకూ నే చేసిన ఎన్నో తప్పులు
తుది దాకా మొత్తంగా తుడిచి పెట్టుకు పోయినట్టన్పించి
నిండా నీళ్లు నిండిన కళ్ళతోనైనా నిబ్బరంగా..
నేనూ నవ్వాను!!!
 

click me!