కె ఎస్ అనంతాచార్య కవిత : రొట్టె బుట్ట

By SumaBala BukkaFirst Published Sep 30, 2023, 12:14 PM IST
Highlights

హరిత విప్లవ పితామహుడు M S స్వామినాథన్ స్మృతిలో - ఆహార భద్రతకు అక్షయ పాత్ర నిచ్చిన సాంబశివుడు! అంటూ కరీంనగర్ నుండి కె ఎస్ అనంతాచార్య రాసిన కవిత ' రొట్టె బుట్ట ' ఇక్కడ చదవండి: 

ఆయన ఒక పత్రహరితం
డీలాపడ్డ మనిషికోసం 
పుట్టిన స్వామికార్య రూపం
ఆకలిని చూసి చలించిన
భారతీయ ఆత్మ స్వరూపం 

సూక్ష్మ స్థాయి వ్యవసాయం
అతనికి కలల మీద సాము 
కొత్త వంగడం  కోసం                                      పరిశోధనలతో పరితపించిన 
హరిత ఋషిత్వం ఆయన తత్వం 

మహిళా రైతు భరోసాను 
ఔదల దాల్చిన భగీరథుడు 
ఆహార భద్రతకు అక్షయ పాత్ర 
నిచ్చిన సాంబశివుడు!

వరిసాగుకు
మెళకువలు నేర్పిన మహా మహుడు 
ధాన్యపు రాసుల 
హరిత విప్లవ పితమహుడు!

దిగుమతికి చరమ గీతం రాసి 
గోధుమతో కొంగొత్త జన్యు రాగాలు 
అల్లిన  అన్నమయ్య 

ఆకుపచ్చని కాన్వాసుపై 
ఆలు జన్యు చిత్రాలను 
గీసిన కుంచె!

ఆత్మ గల్ల మనిషి 
బక్కరైతు  ఎవుసానికి
మద్దత్తు దరైన
సామాజిక విప్లకారుడు!

సహకార వేదిక
నిత్య సత్య శోధక
అన్నపు రాసికి వెన్నెముకైన స్వామీ !
హాలికుల కడుపుకు 
కంటి కునుకుకు ధీటైన హామీ!!

వరి మొక్కల వేనవేల మొక్కులు 
గోధుమ గింజల సజల స్మృత్యంజలి 
మొక్కజొన్నల జోహార్ జోహార్,జోహార్!

click me!