తెలుగు సాహిత్యంలో కవిత్వం ప్రత్యేకమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన వురిమళ్ల సునంద రాసిన మన ఇద్దరినీ కూర్చిన.. అనే కవితను మీ కోసం అందిస్తున్నాం
ఒకే గొడుగు కింద మనిద్దరం
ఏళ్ళకేళ్ళుగా సహజీవనం చేస్తూ..
మీరనుకుంటారు
ఎలాంటి స్పందనలు తెలియని తెల్ల కాగితాన్నని
అందుకేనేమో
మీ భావజాలాన్ని పదాలు వాక్యాలుగా
నా బతుకు పుస్తకంలో పుటలు పుటలుగా నింపుతుంటారు...
ఊపిరి సలపని అక్షరాల ఆదేశాలతో
ఉక్కిరిబిక్కిరి అవుతూనే
వాటి లోలోతులను తరచి చూస్తూ
అందులో ఆర్థ్రత నిండిన అనురాగం కోసం
మనసును దివిటీ చేసి
లేశమైనా నన్ను అభిమానించే చిటికెడు పదాల మెరుపుల కోసం
వెతుక్కుంటుంటూ
లాలిత్యం కరువైన మాటల విరుపుల్లో
విరిగిన హృదయ శకలాలను
కరిగిపోయిన కన్నీటి దారంతో కుట్టుకుంటూ
పేక మేడల్లా కూలిపోయిన ప్రేమ బౌద్ధాన్ని తలుచుకుంటూ
లబ్ డబ్ ల గుండె చప్పుళ్ళ మధ్య నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ..
బహుమతి గా ఇచ్చిన బంగారు పంజరం లో
అనివార్యమైన బంధాన్ని తలుచుకుంటూ
రెక్కలు తెగిన రేపటికి
ఆశల పుప్పొడి అద్దుకుంటూ..
కుటుంబ కావడిని మోసేందుకు
నువ్వు నేను
మార్చుకున్న భుజాలను తడుముకుంటూ
మనిద్దరినీ కూర్చిన ఆ క్షణాల
బలాలు బలహీనతలను త్రాసులో తూస్తూ నేను...
మరింత తెలుగు సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature