వఝ్ఝల శివకుమార్ తెలుగు కవిత: చావు నగారా

Published : Feb 04, 2020, 06:56 PM IST
వఝ్ఝల శివకుమార్ తెలుగు కవిత: చావు నగారా

సారాంశం

తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి వఝ్ఝల శివకుమార్. ఆయన తెలుగు కవిత్వంలో గూఢార్థాలుంటాయి. ఆయన రాసిన చావునగారా కవితను మీ కోసం అందిస్తున్నాం

పొగ చెట్లు డంపింగ్ గుట్టలు
ఆకాశానికి నల్లమబ్బులను,
నేలకు చీకటి వర్షాన్నీ బహూకరిస్తున్న
పర్యావరణ పరవశం.
ఉదారంగా విస్తరిస్తున్నాయి సరే
ఉప్పెనై చుట్టుముడుతున్న శాపాల మాటేంటి
పట్నం కావాలనో పడగలెత్తాలనో కోరలేదు
పల్లెలా మిగలనిమ్మని వేడుకున్నం
పాలిచ్చే తల్లిలాగే నిలిచి పోవాలనుకున్నం .
కోరని సౌకర్యాల తంపి పెట్టి
మసి చేసిన మా చేను చెలకల కల
రెప్పలిప్పేసరికి 
రసాయన గాయాల అనుభవమయింది.
ఆశల్ని హైజాక్ చేయడం మీకు 
మార్కెట్ నేర్పిన విద్య
కోరికలకు గాలాలు వేయడం
బలహీనతలకు వేలాడదీయడం
ఈ టెక్కుల కాలం టక్కుటమారమే.
పడుకున్నది పట్నం పక్కన అనుకున్నం
కానీ పాము పక్కన అని తెలిసేసరికి
అది మా దేహాలను చుట్టుకొని 
తలల పై బుస కొడుతుంది.

తెల్లందనుక
మా నిద్రలమీద టైర్లమోత
మెలకువల నేలబొందల్లో 
లారీలకొద్దీ ఉపద్రవసంపద
ఊటల గొంతుల్లో కాలకూటం.
దాహార్తికి ఈనేల
కళేబరాలు రాలుస్తున్న కబేళా 
పిట్టా చెట్టూ బతకని
ఎట్టి కాలం మా చుట్టబట్ట.
చెరువులన్నీ కబ్జాల కబంధహస్తాల్లో 
తోటలన్నీ మొగులంతబంగులల పునాదుల్లో
ముత్తెమంత ఆకుపచ్చగాలి,
దోసెడు చన్నీళ్ళు
ప్రాణుల మొర.
ఉండనిచ్చే ప్రకృతి మధ్య 
ఊపిరి ఆపుకునుడూ ఓ యుద్ధమే.
విషవలయాలూ,విషమయ సమయాలూ .
ప్రాణహితం కాలేని నిర్జీవచలనాలు. రుచిమరిగిన పచ్చధనాల వేట
  జబ్బులు పండించుకునే వ్యాపకాల బాట.
బాధ్యతలకు దూరమౌతూ  
బాధలకు దగ్గరౌతున్న అరాచకం
ప్రాణవాహకం చుట్టూ చావునగారా. 
విపత్తులో జీవావరణం
ఆగమౌతున్న మనిషితనం

మరింత తెలుగు సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం