"నీటిదీపం" కాదు కన్నీటి దీపం

By telugu team  |  First Published Feb 5, 2020, 7:35 PM IST

తండా హరీష్ కవితల శీర్షికలు  చాలా బాగుంటాయి. "పాటల కన్నులు" అని "గాయాల వేడుక"అని "కన్నీటి వర్షం" "మృత్యు పల్లకి" "మరణానికి ప్రేమ లేఖ" "సమయాలను దాటుకుంటూ" అని విలక్షణంగా ఉంటాయి.  150 పేజీల ఈ పుస్తకంలో ఏ కవిత తీసివేయడానికి లేదు.


కవిత్వం రాయడం ఆషామాషి వ్యవహారం కాదు.ఆ విషయంతెలిసినవారు కొద్దిమందే ఉంటారు.అలాంటి కవుల్లో ఒకరు తండా హరీష్ గౌడ్.ఈ యువకుడు రాసిన "నీటి దీపం" లోని కవిత్వం చదివితే ఈ విషయం అర్థమవుతుంది. 
ఈ కవి భావనల్లో
కవిత్వం ఒక భావం, భావన 
కవిత్వం ఒక తత్వం 
కవిత్వం ఒక సౌందర్యారాధన 
కవిత్వం ఒక వాదం 
కవిత్వం ఒకానొక వేదన 
ఇలా అన్ని విషయాలు తెలిసిన విషయాలు తెలిసిన కవి కాబట్టి తండా హరీష్ గౌడ్ తన కళ్ళ ముందు జరిగిన, చూసిన,తన అనుభవంలోకి వచ్చిన విషయాలను అనుభూతి చెంది వాటిని కవిత్వం చేశాడు. కొన్ని కన్నీటి దీపాలు  ఆవిష్కరించడమే నా నీటి దీపం కవితాసంపుటి ముఖ్య ఉద్దేశం అంటాడు ఈ యువ కవి.

Also Read: సామాజిక చైతన్య స్ఫూర్తి "నాన్న పచ్చి అబద్దాలకోరు".

Latest Videos

undefined

75 కవితలున్న ఈ కవితా సంపుటిలో విభిన్నమైన అంశాలున్నాయి. వాటినన్నింటిని శక్తివంతంగా కవిత్వీకరించాడు. తన పాఠశాల ముందు బఠానీలమ్మే అవ్వను గురించి,బఠానీలవ్వ అనే కవితలో రాస్తూ 
ఆమె జీవితమే నాకు ఒక ఒక పెద్ద పాఠశాల అంటాడు ఈ కవి. 
ఆ కవితలో
"ఆమెకు మంచి తావు 
కడలి లాంటి ఆమె కష్టాలకు 
ఓదార్పు నిచ్చే రేవు 
మా పాఠశాల 

నేను పిల్లలకు 
పాఠాలు బోధిస్తుంటే 
నిత్యం నాకామె
జీవిత పాఠాలు బోధిస్తుంది 

ఏ విశ్వవిద్యాలయంలో 
ఎదురుపడని పాఠ్యప్రణాళిక
ఆమె జీవితం"
జీవితంలో ఎంత లోతైన అవగాహన ఈ కవికి  ! కష్టంలో, కన్నీటిలో కవిత్వాన్ని చూడటం గొప్ప విశేషం! అది ఎందరికో మామూలు విషయం కావచ్చు. ఆ కవికి అది ఒక విశ్వవిద్యాలయ పాఠం. ఆ అవ్వ విషయంలో కష్టంలో, కన్నీటిలో బతుకు దాగి ఉంది అని తెలిపి మానవీయ విలువలను వెతుకుతూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళడమే కవిత్వ జీవనంగా సాగుతున్నాడు ఈ కవి.

Also Read: ఒక హిజ్రా ఆత్మకథ: రేవతి విషాద గాథ

 ఇక "ఇచ్చోటన..నే" అనే మరో కవిత రాశాడు కవి. అది చదువుతుంటే జాషువా పద్యాలు జ్ఞాపకం వస్తాయి.మనిషి మనుగడ ,బతుకులోని విలువల గురించి చెబుతూ  పుట్టుక నుండి చావు వరకు విశ్లేషిస్తూ 
"అక్కడ వాళ్లు బ్రతికున్న మనిషిని 
మాటలతో పోస్టుమార్టం చేస్తూ
ఆ మనిషిని జీవచ్ఛవాన్ని చేస్తారు 
ఇక్కడ మాత్రం 
చచ్చిన శవం కూడా 
గర్వంగా తలెత్తుకుంటుంది"
అంటూ సమాజం నుండి స్మశానం దాకా మానవ మనుగడ ప్రస్థానాన్ని కవిత్వం చేశాడు హరీష్

"రక్తంతో నిండిన నది"అనే కవిత రాసిన ఈ కవి మానవీయ హృదయంతో
"రక్తం రంగు మారదు అని తెలిసిన 
కులం కూడు పెట్టదు అని తెలిసిన 
వాళ్ళు ఇంకా..ఇంకా 
కుల పునాదుల పై నిర్మింపబడ్డ 
సమాధుల్లో నివసించే ప్రేతాత్మలు" అంటాడు 
దానికి పరిష్కారంగా 
"నువ్వో నేనో ఆనకట్టలమవుదాం
 ఆ నది రక్త కన్నీరును తుడుద్దాం "అంటాడు 
కుల దురహంకార ప్రేమ హత్యలకు నిరసనగా ఈ కవి కవిత నెత్తుకోవడంలో గొప్పతనం కనిపిస్తుంది. ఇంకా కవితలకు శీర్షికలు పెట్టడంలో కూడా గొప్పతనం కనిపిస్తుంది. ఇంకో కవితలో "ఆకాశమేడుస్తుంది" అంటాడు. ఎందుకు మరి?బహుషా ఈ కవికి కవిత్వమంటే కన్నీరే? నిజంగా కన్నీటికి భాష్యం చెప్పేవాడే, కన్నీటి విలువ తెలిసినవాడే కవి
"ఆకాశం పైకప్పు నుండి 
నీటి చుక్కలు 
బొట్లు బొట్లుగా జారుతున్నాయి 
ఎందుకో ఆకాశం ఏడుస్తుంది" 

"ఇన్నాళ్ళు ఎండిన వాళ్ళ గొంతుకలలో 
చెలిమై దాహాన్ని తీర్చడానికో 
అబద్ధాలతో నిండిన ఈ లోకాన్ని 
తన కన్నీటిసబ్బుతో రుద్దిపారేయడానికో" 
ఇక్కడ "కన్నీటి సబ్బు" అనేది మంచి పదప్రయోగం. ఈ వెర్రి లోకాన్ని చూస్తూ ఆకాశం కొండలు పిండయ్యేలా వెక్కి వెక్కి ఏడుస్తుంది అని చెప్పే కవి భావన గమనించదగ్గది.
చెప్పాల్నంటే నిజంగా ప్రశ్నించేవాడే కవి. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ "ఏది స్వాతంత్ర్యత" అనే కవితలో మనుషుల కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. సమకాలీన దేశ పరిస్థితులను నిజాయితీతో 
"ఒక పక్క వాడు సీతాకోకచిలుకలను
ఏరుకుందామని చూస్తుంటే 
చిన్నప్పుడే వాని చేతుల్లో గొట్టం,గోళీ పెట్టి 
మన సమాధుల పునాదులు తవ్విస్తున్నారు 
మన దేశం పైకి పైకి ఉసికొల్పుతున్నారు" అంటూ 
దేశం వాస్తవ పరిస్థితిని గుర్తు చేస్తున్నాడు.

Also Read: అతడి కవిత, ‘ఇనుప గజ్జెల తలరాత’

కవి క్రాంత దర్శి, కవి సృజనశీలి, కవి అన్యాయాన్ని ఎదిరించే దీశాలి, అలాంటి కవి "కాళోజీ" గురించి రాస్తూ "అతడో పాలపిట్ట" అంటాడు.ఆ కవితా వాక్యాలు

"అతడు ఆ నేలలో కొన్ని సిరా చుక్కలు జల్లాడు 
కొన్ని మెదళ్లు పూసాయి 
సుద్దముక్కలను ఆ నల్లటి పొలంలో పిండిగా జల్లాడు అప్పుడు అతని ముందు 
కొన్ని నెమళ్ళు పురివిప్పుతూ ఆడాయి" 


కవిత్వం అంటే విలియం వర్డ్స్ వర్త్ చెప్పినట్లు "spontaneous over flow of powerful feelings" మరియు
 "emotions recollected in tranquility"
కవిత్వం పుట్టాలంటే కవికి ఈ రెండు భావనలు ఉండాలి.
ఈ రెండు విషయాలు బాగా తెలిసిన కవి తండ హరీష్.
అందుకే జ్ఞాపకాలను నెమరేసుకుంటూ 
"మొన్నోపాలి జారుడుబండ దగ్గరికెళ్ళా
అది నన్ను బాల్యంలోకి విసిరింది" అంటూ జారుడు బండ అనే కవిత రాశాడు.

అతని కవితల్లో ప్రాణం లాంటి కవిత "నీటి దీపం" అందుకే అతని కవితాసంపుటికి "నీటి దీపం" అని పేరు పెట్టుకున్నాడేమో! నీటి విలువ, కన్నీటి విలువ తెలిసినవాడే కవి! నీరు ప్రాణాధారం జీవకోటికి! నీరు లేకుంటే ఏమీ ఉండదు బతుకులో.అలాంటి నీటిపై  కవిత్వం రాశాడు. ఈ కవి బహునేర్పుతో ఇలా
"ఓ నలుగురు 
నీటికి ఊపిరాడకుండా చేసి 
పట్టపగలే భుజాలపై మోసుకెళ్తూ 
తెలిసీ తెలియని తనంతో 
నీరంటే మనిషి గుండె కాయని తెలియక 
బ్రతికుండగానే మంటల్లోకి తోసేస్తున్నారు" అని
నీటివిలువ తెలియనివారు నీటిని వృధా చేస్తారు, నీటికి ఆధారమైన ప్రకృతిని విధ్వంసం చేస్తారని
అలాంటి వారిని ఉద్దేశించి రాశాడు.

"కొద్ది రోజుల్లో చావుబతుకుల మధ్య నుంచి 
ఆకాశం భూమి మధ్య నుంచి 
శాశ్వతంగా దూరం చేస్తూ 
నీటి కాళ్లు చేతులు విరిచేసి 
ఏర్పడకుండానే
వాళ్ళు హత్య చేస్తారు" 

నీటిని మనిషితో పోల్చుతూ మనిషిని హత్య చేసినట్లు నీటిని కూడా హత్య చేస్తారు,లేకుండా చేస్తారు వాళ్ళు అంటాడు. అలాగే నీటిని ఆరిపోనీకుండా దీపంలా తరతరాలకోసం వెలిగించాలని అంటాడు.

"ఊపిరాడకుండా చేస్తున్న వాళ్ళకు
ప్రతిరోజు ఊపిరిపోసే దివ్యౌషధం
నీరెనన్న నాలుగు మంచిమాటలు
నువ్వో నేనో చెప్పాలి
నీటిదీపం ఆరిపోకుండా చేతులడ్డుంచి
తరతరాలకు వెలుగునివ్వాలి"

ఈ కవికి కవిత్వం రాయడంలో గొప్ప భావనలు ఉన్నాయి. గొప్ప అభివ్యక్తి ఉంది."ఆ వైపుగా వెళ్లి" అనే కవితలో ఇలా అంటాడు. 
"భూగోళాన్నంతా పచ్చని శాలువా కప్పి 
సన్మానించాలని ఉంది"అని 

ఆకాశమంత భావన ఇది. ఎందరికి స్ఫురిస్తుంది ఇలా అనాలని!
ఇంకా పట్టణాల్లో జొన్న రొట్టెలు అమ్ముతున్న అమ్మలను చూసి రొట్టెలమ్మలు  అనే అద్భుత కవిత రాశాడు. 
"సాయంకాలం వేళ 
కొలువు దిగిన సూర్యున్ని 
మంటగా పెట్టి 
గాలితో సోపతిచేసుకుంటూ 
అరచేతుల్లో చందమామలను గీస్తారు" 
సూర్యుని మంటగా పెట్టి ,అరచేతుల్లో చందమామలను గీయటం అనేది గొప్ప భావన. 

ఈ కవికి కవిత్వం జీవితానుభవం నుంచి వచ్చింది. అందుకే నిఖార్సయిన వాక్యాలు ఎన్నో రాశాడు."నిఖార్సయిన వాక్యం" కవితలో 
"నన్నో వాక్యంలా నిలబెట్టాలని 
అందులోని అక్షరాల నడుమ 
నాన్న గట్టి పునాదై నిలుచున్నాడు"అంటాడు. అందరి మీద కవిత రాసినట్టు వాళ్ళ అమ్మ మీద మృదుమధురంగా కవిత రాసిండు. "బంతి పువ్వువు నీవు" అనే కవితలో

"నాచే జ్ఞానాక్షరాలు తినిపించిన 
వీణాపాణివి నీవు 
నీ చేతి గోరుముద్దను నేను
.....................

అమ్మా!
పల్లె బంతిపువ్వువు నీవు 
ఆ పూరేకుల సువాసన నేను"అంటాడు.

ఈ కవి వాక్యాలు చూస్తుంటే, కవితా శీర్షికలు చూస్తుంటే అత్యద్భుతంగా ఉన్నాయి. ఒక కవితలో "ఆకాశాన్ని జోలెసంచి చేసి" అంటాడు. నిజంగా ఎవరు అనగలరు ఇలా! ఎంత సాహసం కావాలి కవికి అలా అనడానికి! చేతులు లేని బిచ్చగాడు రైలులో పాట పాడుతున్న సందర్భాన్ని తీసుకొని
రాసిన కవితలో

" కష్టాల కోరలు పీకి 
నెమలిపించంలా శిరస్సుపై ధరించి 
వజ్రపు కాంతుల వెదజల్లడం 
ఆకాశాన్ని జోలెసంచి చేసి 
నక్షత్రాలను మూటకట్టి 
వెలుగు నింపుకోవడం 
రెండు చేతులు లేని 
అతని జీవిత యాత్రలో సర్వసాధారణం" అని అంటాడు

తండా హరీష్ కవితల శీర్షికలు  చాలా బాగుంటాయి. "పాటల కన్నులు" అని "గాయాల వేడుక"అని "కన్నీటి వర్షం" "మృత్యు పల్లకి" "మరణానికి ప్రేమ లేఖ" "సమయాలను దాటుకుంటూ" అని విలక్షణంగా ఉంటాయి.  150 పేజీల ఈ పుస్తకంలో ఏ కవిత తీసివేయడానికి లేదు.

"నీటి దీపం" అనే కవితా సంకలనం  ఆధునిక తెలుగు వచన కవితా జగత్తులో మంచి కవిత్వ పుస్తకంగా నిలుస్తుంది. తన తొలి కవితా సంపుటితోనే మంచి ప్రవేశం చేసిన ఈ కవికి తెలుగు కవిత్వ లోకంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆశిస్తూ హరీష్ గౌడ్ ను అభినందిస్తున్నాను.

- డా.సబ్బని లక్ష్మీనారాయణ

click me!