తుమ్మూరి రాంమోహన్ రావు కవిత: నాకు రెక్కలు వస్తే బాగుండు

By telugu team  |  First Published Feb 18, 2020, 1:20 PM IST

తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం విశిష్టతను సంతరించుకుంది. తుమ్మూరి రాంమోహన్ రావు రాసిన తెలుగు కవితను మీ కోసం అందిస్తున్నాం.


నాకిప్పుడు రెక్కలు మొలిస్తే బాగుండు
ఒక్కసారి గరుత్మంతుడినై ఎగిరి
పుడమిచుట్టూ తిరిగివచ్చేవాణ్ని

ప్రాణవాయువై మందవాయువై 
మలయానిలమై మహోగ్ర చండ వాతమై 
పొరలు పొరలుగా తెరలుగా 
ప్రపంచంచుట్టూ ప్రబలి ఉన్న గాలిలో తేలుతూ 

Latest Videos

undefined

ఎన్ని అందమైన కలువలు పరచుకున్న సరస్సులో
ఎన్ని బకాలు కలువలతో పోటీ పడిన కొలనులో
ఎన్ని స్థాణువులై గగనంలోకి చొచ్చుకు పోయిన పర్వతశిఖరాలో
ఎన్ని పచ్చటి దుప్పట్లు కప్పుకున్న కీకారణ్యాలో
నీలినింగినిండా దూదిపింజలై ఎగురుతున్న 
ఎన్ని మేఘమాలికలో
అటనట ఖర్జూర వృక్షాల కలిమితో  
ఒయాసిస్సుల ఓదార్పుతో
ఒంటెల బిడారులు సాగే 
ప్రశాంత విస్తారమైన ఎన్ని ఎడారులో
గిరుల ఎదతడియై జనించి 
బండరాళ్ల పొత్తిళ్లలో సెలయేళ్లై దూకి 
 నదీ నదాలై మైదానాలు సస్యశ్యామలం చేసి 
కడలిలో కలిసే ఎన్ని జలప్రవాహాలో
పుడమి వేదనంతా నాభినుండి 
సలసలకాగే లావాలా వెలిగ్రక్కే ఎన్ని నిప్పు పర్వతాలో
ఘనీభవించిన హిమ శకలాలు పేరి పేరి వెండి గుట్టలై ప్రపంచంలోని తెల్లదనమంతా సమీకరించి నేసిన చీర కొంగుల్లా కప్పుకున్న  ఎన్ని హిమసానువులో
ఆకాశంలోని నీలి రంగునంతా తనలో కలుపుకొని విశ్వమంతా గంగాళమైనట్లు 
ఎగసి పడే అలలహోరుతో తళతళలాడే ఎన్ని జలధులో
నదుల్లో తటాకాల్లో సముద్రాల్లో కేరింతలు కొడుతూ ఈదులాడే ఎన్ని జలచరాలో
గుడిగోపురాలమీద చెట్లూ చేమలమీద 
విశాల వన వృక్షాలమీద గూళ్లు కట్టుకొని 
తమ పిల్లా పాపలతో ఉంటూ, 
పొద్దున్నే ఎక్కడికో మేతకు వెళ్లి  
పొద్దు వాలే సరికి తిరిగి వచ్చే ఎన్ని ఎగిరే పక్షులో
కొండకొమ్ముల్లో రాతిగుహల్లో  చెట్ల నీడల్లో కొనగొమ్మల్లో ఒకదానికొకటి ఆహారమవుతూ 
వనసంచారంచేసే ఎన్ని చతుష్పాత్తులో
పుట్టల్లో నేలబొరియల్లో కలుగుల్లో కంతల్లో 
భయపడుతూ భయపెడుతూ బతికే ఎన్ని సరీసృపాలో
పిపీలికం మొదలుకొని భ్రమరాలదాకా పుడమి నిండా ప్రబలి ఉన్న కోటానుకోట్ల మరెన్ని చిన్న జీవాలో
రంగులన్నీ భూగర్భం నుండి తోడి తెచ్చుకుని సుకుమారంగా సుమనోహరంగా
కన్నుల పండువ చేసే ఎన్నెన్ని పూలతోటలో
అన్నింటినీ చూసి వచ్చేవాణ్ని

నాకు రెక్కలు వస్తే బాగుండు
పల్లెలు పట్టణాలు నగరాలు రాజ్యాలు 
దేశాలు ఖండాలుఅన్నీ చూసివచ్చేవాణ్ణి
పలుజాతుల పలురీతుల జనాల్ని పలుకరించేవాణ్ని
వారి పాటలు విని నా పాట వినిపించేవాణ్ని
అప్పుడు నాకర్థమైనట్టే వారికీ తెలిసివచ్చేది
పదాలు వేరనిపించినా గొంతులొకటేననీ
భాషవేరైనా భావం ఒకటేననీ
వేషాలు వేరైనా వేదనలవేననీ
మనిషికి మనిషే శత్రువౌతున్నాడనీ
చేజేతులా చేటు కొనితెచ్చుకుంటున్నాడనీ
అందరి గుండెల్లో శాంతిమంత్రం తపిస్తున్నదనీ
అప్పుడు ఒకరొకరికీ నా రెక్కలు తొడుగుతాను
ఒక్కసారి ఎగిరి రమ్మంటాను 
కొత్తలోకానికై కొత్త పాట రాసుకుంటాను
పాడుకుంటాను పాడమంటాను
నాకు రెక్కలు వస్తే బాగుండు

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!