అన్నవరం దేవేందర్ కవిత: గవాయి

By telugu team  |  First Published Feb 14, 2020, 5:38 PM IST

తెలుగు కవిత్వంలో అన్నవరం దేవేందర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. పలు కవితా సంపుటులను ఆయన వెలువరించారు. ఆయన రాసిన కవితను మీ కోసం అందిస్తున్నాం.


వి ద పీపుల్ ఆఫ్ ఇండియా.... అని
మనకు మనమే సమర్పించుకున్న సార్వభౌములం

పరిచ్చేదం పదకొండు నుంచి పదహారు దాకా
మనుషులంతా సరిసమాన స్వతంత్రులం

Latest Videos

'భారతదేశం నా మాతృభూమి' అని అనుదినం
బడి పిల్లలు గా ప్రతిజ్ఞ చేసినోల్లం

                  * * * *
గాలి ,మొగులు, నీళ్లు నిప్పుల్లా
ప్రకృతిలో ఆకృతులమై నేల మీద బతికినం
పుట్టిన పుటుకనే బతుకు గవాయి

తాతలు ముత్తాతల కాలం నాటి
పుట్టిన్నాటి దొండాకు పసరు జాడ చూడు

తల్లి కడుపుల ఎల్లిన మాయ
ఇంటి పెరడులో నే ఇంకిపోయింది
ముంతల కోసం పురావస్తు తవ్వకాలు తవ్వుకో

బొడ్డు తాడు కోసిన కొడవలి లిక్కి
నెత్తురు మరకలకు చిలుం పట్టింది

మిన్నుకు  మన్నుకూ తెలుసు
పుట్టుక చావు అన్నీ ఈ జీవాత్మ లోనే

                   * * * *

అవును  భారత దేశం మా యొక్క మాతృభూమి
భారతీయులందరం  సహోదరులం
మేము ఆవుల మేపుకోను
ఏ వింధ్య పర్వతాలూ దాటి రాలేదు

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

 

click me!