తెలుగు సాహిత్యంలో కవిత్వం విశిష్టమైంది. ఏడెల్లి రాములు అనే కవి తన కవితా ప్రస్థానంలో భాగంగా ఏషియానెట్ న్యూస్ కోసం ఓ కవిత రాశారు.
ఎవరు వాళ్ళు
నా కనురెప్పల అంచున నర్తనమాడే
నటరాజ పాద నాట్యభంగిమలు
నా మనో రథాన్ని అధిష్టించిన
నాతోఆడుకునే వెన్నెల చిన్నయ్యలు
ఆ నడకల్లో
జలజ తేరుల అలల ప్రమిదలు
ఆ కొంటె చూపుల్లో
నన్ను చూయించే నా కలల కలువలు
నాతో ఏతెంచే
నా కలానికి సిరా చుక్కలు
అక్షర మాలికలై
నాతో పాడుకునే శ్రీ సుధామ గీతికలు
ఎవరు వాళ్ళు
నా మది వీణను మీటుతూ
రసజ్ఞత రాగాల యోగా ప్రభలు
ఆ నవ్వుల పూల తోటలో
మీరెవరైనా విహరించని వారున్నారా?
ఆ మాటలే పాటలైన
గానామృత భాండాగారాల శృతులు
వేయి పున్నమిలు
చటుక్కున పూయించే మెరుపు తీగలు
వెన్నెల్లో నాతో ఆడుకునే అందమైన
రాజ హంసలు
గమకాల సరిగమల స్వర రాగ ప్రియులు
వారి చిటికెన వ్రేలు లో
ఎన్నెన్నో అపర్ణాల వర్ణాలు
నాపై అంబారీ అధిరోహించిన
అందమైన పాలపిట్టల పాటలు
మైత్రికి జమ్మాకులు
అలకలోనైనా ఎత్తుకునే చిలిపి పలుకుల కన్నయ్యలు