తెలుగు సాహిత్యంలో కవిత్వం విశిష్టమైంది. అక్షరాలు ఆయుధాలుగా ఎలా పనికి వస్తాయో పోరెడ్డి రంగయ్య తన ధ్వజమెత్తిన అక్షరం కవితలో వ్యక్తం చేశారు.
ఆ కలం నుంచి
అంగారం కురిసింది.
అంతేనా!
శృంగారమూ ఒలికింది.
మనిషి పిడికడంతే!
భావాలు మాత్రం పిడిగుద్దులు.
ఆవేశం ఉద్యమ కొలిమై
అగ్గి పుట్టించి
రాతి గుండెల్లో
కాక రగిలించిన సమరాక్షరం .
నిరంకుశ కోరలను
చిదిమింది ఖడ్గమై.
పరిపాలన ముసుగులో
వెట్టి చాకిరిని ఎర చేసి
పచ్చని బతుకులను నంజుకున్న
మద క్రీడా వినోదుల
భరతం పట్టింది ఆ అక్షరం.
జైలు గోడకు
అగ్గి పుట్టించి
తిమిరంపై ధ్వజ మెత్తిన
సమరభేరి అయ్యింది.
గుండె గుండెను తాకి
తిరుగుబాటు జ్వాలను
రగిల్చింది.
రూపు కట్టుకున్న పద్యం
కాగితపు మడతల్లో
గుర్రు పెట్టలేదు.
ప్రజా సమూహ
పిడికిలి అయ్యింది.
ఈ మాగాణ గుండె చప్పుడై
రుద్ర వీణను మీటింది.
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature