దేవనపల్లి వీణావాణి తెలుగు కవిత: విభాజిని

By telugu teamFirst Published Nov 28, 2019, 4:06 PM IST
Highlights

తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్పానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవనపల్లి వీణావాణి రాసిన విభాజిని అనే కవితను ఏషియానెట్ న్యూస్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నాం.

గుంపులు గుంపులుగా
పద ముద్రలు
భుజం భుజం ఒరుసుకుంటూ
జత కలిసిన అడవి బిడ్డల ఆటలాగా
చుక్క చుక్క కలిసి 
గీసుకునే ముగ్గు లాగా
 కథ  మొదలవుతుంది

పెనం వేడెక్కిన వేళకి
తల మీదెక్కి
చుక్కలు తెంపుకునే 
చేతులు పుడతాయి

నిలువూ అడ్డమూ
చదరాలుగా విడిపోతాం
నలుపూ తెలుపూ గళ్లలో
పెట్టబడతాం

నేయక ముందే 
గుడ్డకు మాసిక పడుతుంది

అనుభవాల ఘర్షణలో
మాటల నుసి రాలుతుంది
పొడి పొడి చూపులకు 
ఎడారి ఇసుక
మేట వేస్తుంది
నశించిన అనుభవం నుంచి
పైకి లేచిన చేయి
నడిచే తోవ మధ్య
విభాజినిగా నిలబడుతుంది

తెలుగు సాహిత్యం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!