తుమ్మూరి రాంమోహన్ రావు కవిత: అసంగత సంగతులు

By telugu team  |  First Published Nov 26, 2019, 2:25 PM IST

తుమ్మూరి రాంమోహన్ రావు అసంగత సంగతులు పేర ఓ కవిత రాశారు. ఏషియానెట్ న్యూస్ పాఠకుల కోసం ఆ కవితను మీకు అందిస్తున్నాం.


విఛ్ఛిన్నశిల్పం
తునకలుతునకలుగా
చెల్లాచెదరై ఉంది
ఏరడం ఎలా కుదురుతుంది
మళ్లీ తీర్చడం ఎలా పొసగుతుంది
విశ్వం పుట్టుక లాగే
విసిరి వేయ బడ్డ శకలాల్లా
ఇసుకమెరుపులైంది సంస్కృతి
నాగరికత ఒడ్డు కిపుడు నదీ జలాల పరుగు
మనుష్యుల మనస్సుల విస్ఫోటనం 
బాంబులను భయపెట్టేంత
ఇప్పటి కాళ్లు నడువవు
చేతులు కదలవు
పరుగంతా మెదళ్లదే
గూగూళ్ల నిండా నైతికాల పొంగులు
మట్టిగూళ్లలో మృగాలు జడుసుకునే మొగనాడులు
పసిమెుగ్గలు ముదివగ్గులు అని చూడని 
వైతరణి వారసులు
నింగిన ఎగిరే ప్రపంచ దేశాల జెండాల ఎజండాల వెనుక దాగిన అణ్వస్త్రాల చౌకబారు నేలబారు అంగడి బజారు
ప్రజలూ ప్రభుత్వాల పరస్పర అనైతిక సహకారం
నోటు కరచిన ఓటు ప్రజాస్వామ్యానికి పాముకాటు
అదో ఎడ తెగని డెబ్బయి ఏళ్ల టీవీ సీరియల్
తీసేవారు జెణకరుచూసేవారు ఉలకరు
తిట్టిన వాడు గిట్టనివాడై ఊచల వెనుక 
ఉరుమౌతాడు
చిల్లుల గొడుగులు మతాలు
కుళ్లిన శవాలు కులాలు
ఓటి కుండలు పలాయనవాద ప్రవచనాలు 
మానవత్వానికి కరువొచ్చిపడింది
అందుకే ఆ కళేబరాలు ఓగిరాలు
మృగతృష్ణ లాంటి సౌఖ్యం 
మదపిచ్చి లాంటి స్వార్థం
మనిషికి  పరుగుపందాలు పెట్టింది
వాడు నిలబడి నీళ్లు తాగడు 
పరుగాపి పాలుతాగడు
ఆలయాలు విద్యాలయాలు వైద్యాలయాలు  ఇనుపపెట్టెల లయలు
వత్తాసుల వృత్రాసురుల రాజకీయాల హొయలు
చినిగిన జీన్స్ ఫాషనొక్కటి చాలు మచ్చుకి
దిగజారిన నాగరికతకు
పొగచూరిన ఆకాశం కన్నీరు చాలు
మనిషి పిచ్చి వేషాల పరాకాష్ఠలకు
ఎన్నడో ఎప్పుడో విసుగెత్తిన జనరేషన్
దిసమొలలతో అడవుల్లోకి పరుగులు తీయకపోరు 
అదేమిటో
నిందించటానికి నాకు ఎప్పుడూ నువ్వే కనిపిస్తావు 
నన్ను నేను చూసుకునే కన్నులు నా కింకా మొలువలేదు
మొలిచే అవకాశాలు కనుచూపుల మేర 
లేవు..................
ఇవీ అర్ధరాత్రి మనసుబీడులో మొలిచిన
అసంగత సంగతులు
 

click me!