చొప్పదండి సుధాకర్ తెలుగు కవిత: హామీ పత్రం

By telugu teamFirst Published Mar 29, 2020, 4:42 PM IST
Highlights

తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం విశిష్టమైంది. చొప్పదండి సుధాకర్ కవిత్వం మాత్రమే కాదు, కథలు కూాడా రాస్తారు. చొప్పదండి సుధాకర్ రాసిన ఓ కవితను మీ కోసం అందిస్తున్నాం.

కథను వొట్టి కథగానే రాయలేను..కవిత్వమూ అంతే...
ఎక్కడా అచ్చవ్వలేదని హామీ ఇవ్వగలను
 కానీ , ఏ జీవితాన్ని ప్రతి ఫలించలే దనీ చెప్పలేను..
పరిసరాలే ప్రభావితం చేస్తున్నపుడు అబద్ధపు హామీ చిత్తగించలేను..
వస్తువు దిగుమతి చేసుకోవడానికి పస్తులున్నంతగా నలిగి పోతాను..
ఎక్కడా తేడాగా తోచినా ఆగిపోతాను .. అంతే..!
నమ్ముకొన్న అక్షరాన్ని నది వీధిలో వదిలెయ్యడం అస్సలు నచ్చదు
జీవితంలో ప్రతి దుఃఖం ప్రస్పుటించేలా
అక్షరాలే మలుపు తిరిగి నపుడు ..
నన్ను నేను మలచుకోవడం గొప్పేం కాదు 
వేల కథలు వందల పేజీలు రాసి తులాభారం తూగే వాళ్లుండొచ్చు..
నా సాహిత్యం ..నా తూకానికి సగం కూడా సరిపోక పోవచ్చును 
అయినా ఇలా ఉండడమే ఇష్టం నాకు..
అందుకే ఇంకా వందో కథకు
 ఇంకా వంద అడుగుల దూరం లోనే ఉన్నాను..
*.      *.    *    *
కలం..కాగితం ముందేసుకు కూర్చుంటానా..?
అక్షరాలన్నీ ఆనందంగా పీఠం వేసుకొంటాయి 
ప్రతి అనుభూతిని అనువదించమని అలుగుతుంటాయి
అనవసరంగా వేదిక నెక్కిన వాటిని చూసి ఉక్రోష పడిపోతాయి
చెరుకు బండి వేదన లాగా ఎంత రాసినా ఏది తృప్తిగా తోచదు
అందుకే రాస్తూనే ఉంటాను..తలపుల పహారా   
                                   కాస్తూనే ఉంటాను
షడ్రసోపతమైన భోజనా లకు ..
నానా విధ పరిమళాలకు 
దూర దూరంగానే తిరుగుతు ఉంటాను..
కాసింత జీవం అద్దడానీకి మనసూ వాక్యం 
ఎపుడు తడితడిగానే ఉంచుకుంటాను..

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

click me!