కాల చక్రాన్ని మోసే ఆమెకు అమ్మవుతానంటాడు

By telugu team  |  First Published Mar 28, 2020, 5:22 PM IST

ఇక్కడ తను అంటే ఓ అమ్మ, ఓ అక్క, ఓ చెల్లి, ఓ సహచరి, ఓ స్నేహితురాలు ఎవరైనా కావొచ్చని తన గురించి అంతంలేని వాక్యాలుగా కవిత్వం చేసినారు. అనేక రూపాల సమూహమైన స్త్రీ ని గురించి తన మనసులోని భావాలను అద్భుతమైన భావకవిత్వంగా మలిచారు మన బిల్లా మహేందర్ 


*కాల చక్రాన్ని మోస్తున్న ఆమెకు,ఓ నాలుగు రోజులైనా అమ్మనవుతానని -  హామీ ఇస్తున్నారు బిల్ల మహెందర్ గారు.  ఆడవాళ్లంతా ఆ నాలుగు రోజులు చప్పుడు చేయకుండా భరించాల్సిందేనని తెగించి చెప్పే కొంతమంది మగవాళ్ళ మధ్య నుండి ఆ నాలుగు రోజులు అమ్మనవుతానని హామీ ఇస్తున్నారంటే..‌.ఈ విషయాన్ని అభినందించకుండా ఉండలేము.ప్రతీ ఒక్కరు కూడా ఈ హామీపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందనే అనుకుంటున్నాను. తను లేనిదే నేను లేనంటారు. నేను నడిచే దారి పొడుగూత తన జ్ఞాపకాలే పరుచుకున్నాయంటారు...తను లేని ఈ జీవితమే అసంపూర్ణమని నిర్భయంగా ఒప్పుకుంటారు.అందుకే 'తను నేను వాక్యం' గా మారిపోయామంటారు.

తనను ప్రేమిస్తున్నప్పుడో,తనతో ఘర్షణ పడుతున్నప్పుడో,తన గురించి ఆలోచిస్తున్నప్పుడో,తనకోసం సంఘర్షణకు లోనవుతున్నప్పుడో తనొక వాక్యంగా మారి మదిలోని భావాలను తెల్లని కాగితంపై పరుచుకున్నాయని ...ఇక్కడ తను అంటే ఓ అమ్మ, ఓ అక్క, ఓ చెల్లి, ఓ సహచరి, ఓ స్నేహితురాలు ఎవరైనా కావొచ్చని తన గురించి అంతంలేని వాక్యాలుగా కవిత్వం చేసినారు. అనేక రూపాల సమూహమైన స్త్రీ ని గురించి తన మనసులోని భావాలను అద్భుతమైన భావకవిత్వంగా మలిచారు మన బిల్లా మహేందర్ గారు.

Latest Videos

Also Read: మనసును వెంటాడే గుంజాటన - అఫ్సర్ కవిత్వం

తను నేను వాక్యం కవిత్వ సంపుటి శీర్షికలు లేని 44 ఖండికల సమాహారంగా కనబడుతుంది.ప్రతీ ఖండికలో కూడా వివిధ సందర్భాలలో ఆమె పట్ల కలిగే భావనను భావాత్మకమైన ఆలోచనగా మనకుచూపెడుతారు.కొన్ని వాక్యాల నిర్మాణం అయితే మనసులో ఎప్పుడూ గుర్తుండి పోయేలా తాకుతుంటాయి.అవేంటివో ఒకసారి చూద్దాం...మూడవ ఖండికలో ఇలా అంటారు ఆమె కన్నీళ్లను తుడిచివేయాలనుకున్నాను దుఃఖం నదిలా పారుతూనే ఉంది....ఆమెను 'కవిత'గా మలుద్దామనుకున్నాను మహాకావ్యమై నా ముంగిట నిలబడింది....నేను ఆమెలోకి పయనిద్దామనుకున్నాను మొదటి అడుగులోనే నా జీవితం కాలం ముగిసింది ...ఆమెలోని అంతులేని వ్యధలను,కథలను పట్టుకోలేక పోతున్నానని ధైర్యంగా ఒప్పుకుంటాడు.నాలుగో ఖండికలో తనకోసం ఒకానొక రాత్రి దీపాన్ని వెంటేసుకొని చీకటిని పరిచయం చేస్తుంటాను...తను నవ్వుతూ దీపాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని మెల్లగా గొంతును నులిపేస్తుంది అంటాడు...అతని దృష్టిలో చీకటంటే దీపాలు వెలిగే రాత్రి మాత్రమే,కానీ ఆమెకు వెలిగే రాత్రులే కాదు,వెలగని పగళ్లలో కూడా చీకటి ఉందని తెలుసు.

మహేందర్ గారికి తన వృత్తి పట్ల ఎంత ప్రేమ ఉందో పన్నెండవ ఖండికలో చెప్పుతారు... ఆమె అతడిని ప్రతిరోజూ ఉదయాన్నే గుడికి వెళ్ళి కొన్ని దీపాలను వెలిగించమంటుంది..అతడు ఆమె మాటను సరేనంటూ వెళ్లిపోతుంటాడు...ఒకానొక రోజు అనుమానం వచ్చి తనని గమనిస్తే... *పిల్లల కళ్లల్లో దీపాలను వెలిగిస్తున్న దేవుడు కనిపించాడు..ఇక ఆమె ఎప్పుడూ అతడిని అనుమానించలేదు ...తన వృత్తి పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో పిల్లలే దేవుళ్లుగా చేసి చెప్పడంలోనే అర్థమవుతుంది.ఈ సమాజంలో వేతనం లేకుండా ఇరవై నాలుగ్గంటలు పనిచేసేది ఎవరని అడిగితే ఎవ్వరైనా చెప్పుతారు మహిళనేనని.కానీ ఈ విషయాన్ని ఎంతమంది మగవాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు? ఇంటి పనులు చేయడం ఆడవాళ్ళ హక్కుగా భావిస్తారే తప్ప...ఒప్పుకోవడానికి ధైర్యం చేయరు.ఇదే విషయాన్ని మహేందర్ గారు ఇరవై ఒకటో ఖండికలో... ఉదయం కళ్లు తెరిచి వెతుకుతున్నప్పుడు వేకువ కిరణాల్లో తను పూర్తిగా అదృశ్యమై పోయింది..తప్పదు ఇక తన చిరునామాను మళ్ళీ పొద్దుపోయాకే వెతుక్కోవాలి ...ఇది చాలదా అతను ఆమెనెంత అర్థం చేసుకుంటున్నాడో...వేకువతో మొదలయ్యే ఆమె పనులు ఏ పొద్దుపోయాకో...పడుకోబోయే వరకు ఒడవవని...ఆమెను చూసుకోవాలన్నా,ఏదైనా మాట్లాడాలన్న ఆమె పడుకోబోయే సమయమే నాకు పట్టిస్తుందని...అదే ఆమె చిరునామవుతుందంటారు.

Also Read: సాహిత్య సీమలో ఆణిముత్యం ఈ "తొలిసంతకం"

"అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందనే నానుడి" వింటాము.కానీ బయటపడకుండ మేనేజ్ చేసే మగాళ్లలోని అనుమానం అంతా ఇంతా ఉండదు...ముఫ్ఫై నాలుగో ఖండికలో మగానిలోని అనుమానాన్ని..  వాడు మేఘాన్ని అనుమానించాడు ఆకాశాన్నంటుకొని మైలపడిందని..మేఘం కురవడం మానేసింది..వాడిప్పుడు తనను ఏవో కొలతలు కొలిచి మైలపడిందని అనుమానిస్తున్నాడు..తనిప్పుడు మూసిన కళ్లను ఒక్కసారిగా తెరిచింది అని చెప్పుకొస్తాడు.ప్రతీ విషయాన్ని సహజంగా అనుమానించిన వాడిని...తనను అనుమానిస్తే ఊరుకోవద్దని స్త్రీ పక్షపాతిగా ఉంటూ మహిళకు పరోక్షంగా ధైర్యాన్నందిస్తున్నారు.అందుకే శిలాలోలిత గారు ముందు మాటలో మహేందర్ గారిని "ఆమెతడు" గా అన్నారేమో...

  తను నేను వాక్యం  అంతా కూడా ఒక మాంచి కాఫీ లాంటి గుమగుమలతో గుమ్మరించిన భావకవిత్వమని చెప్పవచ్చును.అలతి అలతి పదాలతో నిగూఢమైన అర్థాన్ని తన భావంలో చూపెట్టారు.శిల్పంలోనూ ఎంతో జాగ్రత్త  పడ్డారనిపించింది.నలభై నాలుగు ఖండికలను చదువుతున్నంతసేపు కూడా మెలోడీయస్ పాటలు విన్నంత హాయిగా మనసుకు అనిపిస్తుంది.మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కవిత్వం ఇది.తను చెప్పాలనుకున్నదాన్ని స్పష్టంగా చెప్పుతారు.మహేందర్ గారు ఇంతకుముందు తీసుకొచ్చిన కవిత్వం కూడా సామాజిక సమస్యలపైనే కనబడుతుంది. 'పోరుగానం' (2011), 'పిడికిలి'(2012), 'కాలాన్ని గెలుస్తూ' కవితా సంకలనం (2014), 'గెలుపు చిరునామా' (2015), 'కొన్ని ప్రశ్నలు -కొన్ని జవాబులు' (2015) ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ జీవితాన్ని,ప్రత్యేక ప్రతిభావంతుల జీవితాన్ని,మానవ జీవితంలోని వివిధ కోణాలపైన స్పృశిస్తూ తీసుకురాబడినవి.
మహేందర్ గారికి కవిత్వంలో ఒకలాగ,నిజ జీవితంలో ఒకలాగ బతకడం చేతకాదు.తనచుట్టూ ఉన్న బాధలను,సంతోషాలను తనలోకి ఒంపుకొని,అనుభవించి,నిద్రపోని రాత్రులతో కవిత్వ పురిటినొప్పులు పడుతుంటాడు.

ఈ సంపుటిలో ఆమెను వివిధ రూపాలుగా వస్తువుగా తీసుకొని కవిత్వం చేసారంటే ఆమె పట్ల తనకున్న ప్రేమ,బాధ్యత ఎంత గొప్పదో అర్థమవుతుంది.కాత్యాయనీ విద్మహే గారు ఈ సంపుటి ముందుమాటలో...

"ఇదంతా ఒక స్త్రీ ని గురించిన ఒక పురుషుడి జ్ఞాపకాల అనుభవాల భావ కవిత్వమో... అనుభూతి కవిత్వమో అవుతుంది " అని అంటారు.నిజమే మరి...ఈ కవిత్వంను చదివాక మహేందర్ గారిని స్త్రీ పక్షపాతి అనడంలో సందేహం లేదు.ఇందుకు నేను స్త్రీ జాతి తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఇంతటితో ఆగకుండా ముందుముందు తన కలం నుండి మరెన్నో అద్భుతమైన రచనలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నాను!!

- గట్టు రాధికమోహన్

click me!